సోషల్‌ మీడియాలో వికృత క్రీడ

ABN , First Publish Date - 2022-09-28T08:03:38+05:30 IST

సోషల్‌ మీడియాలో అన్ని హద్దులూ దాటుతున్నారు. వికృత పోకడలకు పాల్పడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాల్లోని మహిళలను వివాదాల్లోకి లాగుతున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని

సోషల్‌ మీడియాలో వికృత క్రీడ

హద్దులు దాటిన అసభ్య పోస్టింగ్‌లు 

మొదట భారతి పే పేరుతో పోస్టింగ్‌.. దానిపై ఫోన్‌ నంబర్‌ 

ట్రూ కాలర్‌లో ఐటీడీపీకి చెందిన వారిదని వచ్చేలా కుట్ర 

ఆ తర్వాత టార్గెట్‌ చంద్రబాబు కుటుంబం

మహిళలపై దుష్ప్రచారం.. అనుచిత పోస్టింగ్‌లు 

వాటికి ఉద్దేశపూర్వకంగా పాత్రికేయుల ఫోన్‌ నంబర్‌ జత


అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో అన్ని హద్దులూ దాటుతున్నారు. వికృత పోకడలకు పాల్పడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాల్లోని మహిళలను వివాదాల్లోకి లాగుతున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని ఫొటోలు మార్ఫింగ్‌ చేసి రెచ్చగొట్టేలా కామెంట్లు పెడుతున్నారు. ఆ పోస్టింగులకు ఉద్దేశపూర్వకంగా పాత్రికేయుల ఫోన్‌ నెంబర్లు జత చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక ఉన్నది ఎవరో తెలియకుండా దాడి, ఎదురు దాడి అంతా తామే చేస్తున్నారు. ఎన్నికల కోసం వ్యూహకర్తలు నియమించుకున్న బృందాలు తమ దాడి వ్యూహాల్లో పరిధి దాటిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అసలు విషయానికొస్తే... కొద్ది రోజుల క్రితం కర్ణాటక రాజకీయాల్లో ‘పే సీఎం’ పోస్టర్లు సంచలనం సృష్టించాయి.


ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కమీషన్లు ఇవ్వాల్సి వస్తోందని ఆరోపిస్తూ ఆయన ఫొటోతో కొన్ని పోస్టర్లు ముద్రించి బెంగుళూరు నగర వీధుల్లో అంటించారు. ఇదే తరహాలో సోమవారం భారతి పే పేరుతో ఒక ఫొటో తెలుగు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ముఖ్యమంత్రి జగన్‌ సతీమణి భారతి ఫొటో దీనిపై వేసి ఒక ఫోన్‌ నెంబర్‌ రాశారు. భారత్‌ పే పేరుతో ఉన్న ఒక యాప్‌ను అనుకరిస్తూ భారతి పే అని దీనిని రూపొందించారు. 


లేని ఫోన్‌ నంబర్‌ ఉన్నట్టుగా... 

సోషల్‌ మీడియాలో భారతి పే పేరుతో ప్రత్యక్షమైన పోస్టింగ్‌లో ఉన్న ఫోన్‌ నంబర్‌ ఎవరిదో తెలుసుకునేందుకు ట్రూ కాలర్‌ యాప్‌లో వెతికితే ఐటీడీపీ లోకేశ్‌ సెక్యూరిటీ అధికారి మాధవ రెడ్డిది అని వస్తోంది. టెలికం వర్గాల సమాచారం ప్రకారం ఆ ఫోన్‌ నంబర్‌ అసలు లేనే లేదు. లేని నంబర్‌ను అందులో ముద్రించారు. ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన వెంటనే వైసీపీ అనుకూల వర్గాల వారు ఆ ఫోన్‌ నంబర్‌ టీడీపీకి సంబంధించిన వారిదని వచ్చేలా చేశారు. ఎలాగంటే... పది మంది తమ ఫోన్లలో ఒక నంబర్‌ను ఒకే పేరుతో సేవ్‌ చేస్తే, ట్రూ కాలర్‌ యాప్‌ ఆ పేరునే చూపిస్తుంది. జగన్‌ సతీమణి భారతి చిత్రాన్ని పోస్టు చేసింది  ఐటీడీపీకి చెందిన వారేనని అందరూ అనుకోవడం కోసం ఆ నంబర్‌ను ఆయన పేరుతో సేవ్‌ చేశారు. ఆ తర్వాత మరో వ్యూహానికి తెర లేపారు. 


చంద్రబాబు కుటుంబంపై దుష్ప్రచారం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన వారి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బయటకు వదిలారు. ఆ కుటుంబానికి చెందిన మహిళల ఫొటోల పక్కన వేరే మగవారి ఫొటోలు పెట్టి అసభ్యంగా కామెంట్లు రాసి పోస్టు చేశారు. అందులో కూడా తెలివి ప్రదర్శించారు. మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు పోస్టు చేస్తూ ఈ మాదిరిగా ఫొటోలను ఎడిటింగ్‌ చేయవద్దని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని కామెంట్‌ రాశారు. తమ్మా రవికృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరుతో ఈ ఫొటోలు పోస్టు అయ్యాయి. వాటితో పాటు బ్రాహ్మణి పే అనే చిత్రాన్ని తయారు చేసి పోస్టు చేశారు. అందులో ఒక ఫోన్‌ నంబర్‌ రాశారు.  ఆ ఫోన్‌ నంబర్‌ ఒక టీవీ చానల్‌లో చర్చాగోష్టులు నిర్వహించే ఒక పాత్రికేయుడిది. ఆ పాత్రికేయుడిని ఇబ్బంది పెట్టడం కోసం ఆయన ఫోన్‌ నంబర్‌ ప్రచురించారు. ఈ ఫొటోలను మరికొందరు వైసీపీ సానుభూతిపరులు ఫార్వర్డ్‌ చేసి వాటి కింద ఇష్టానుసారం కామెంట్లు పెడుతున్నారు. వికృత పోకడలకు ఇది పరాకాష్ఠని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


దాడి, ఎదురు దాడి రెండూ వైసీపీ వైపు నుంచే జరుగుతున్నాయని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ‘‘భారతి పే అన్న చిత్రం ఎవరు పెట్టారో తెలియదు. అది బయటకు రాగానే అందులో ఉన్న ఫోన్‌ నంబర్‌ ఐటీడీపీకి చెందినదిగా ప్రచారం చేశారు. తర్వాత చంద్రబాబు కుటుంబంలోని మహిళలను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి తెగబడ్డారు. ఎన్నికల వ్యూహాల కోసం నియమించుకున్న వ్యూహకర్తల బృందాలు దిగజారి ఇలాంటి పనులు చేస్తున్నాయి’’ అని టీడీపీ కేంద్ర కార్యాలయ నేత ఒకరు ఆరోపించారు. 


బ్రహ్మచారిణిగా భ్రమరాంబికాదేవి

శ్రీశైలం, సెప్టెంబరు 27: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణి అ లంకారంలో దర్శనమిచ్చారు.  స్వామి అమ్మవార్లకు మయూర వాహనసేవ, అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించారు.

Updated Date - 2022-09-28T08:03:38+05:30 IST