శాసనమండలి మెట్లెక్కని సామాజిక న్యాయం!

ABN , First Publish Date - 2022-08-03T06:24:46+05:30 IST

ఓట్లకోసం కులాధారంగా సంక్షేమ పథకాలు అమలుజేస్తున్న రాష్ట్రంలో, కులమే అధికారమై కొలువుదీరుతున్న సమాజంలో, కూటి నుంచి స్మశాన వాటిక దాకా కులం ఉన్నప్పుడు,...

శాసనమండలి మెట్లెక్కని సామాజిక న్యాయం!

ఓట్లకోసం కులాధారంగా సంక్షేమ పథకాలు అమలుజేస్తున్న రాష్ట్రంలో, కులమే అధికారమై కొలువుదీరుతున్న సమాజంలో, కూటి నుంచి స్మశాన వాటిక దాకా కులం ఉన్నప్పుడు, శాసనమండలి కుర్చీల్లో కులమెందుకు లేదు? శాసనసభలో రిజర్వేషన్‌ ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వరంగ సంస్థ చట్టబద్ధత కలిగిన శాసనమండలిలో రిజర్వేషన్‌ ఎందుకు లేదు? అణగారిన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించకుండా, మేధావుల పేరుతో డబ్బున్న సంపన్న వర్గాలను దొడ్డిదారిన శాసనమండలి కుర్చీల్లో కూర్చోపెట్టడమేనా సామాజిక న్యాయమంటే? అణగారిన వర్గాలైన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలలో మేధావులు ఉండరా? ప్రభుత్వరంగ సంస్థల్లో, నామినేటెడ్‌ పదవులలో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్‌ అమలుచేస్తున్నామని చెప్పుకుంటూ జీవో నెం.24ను తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం, రాజ్యాంగబద్ధ ప్రభుత్వ సంస్థయైన శాసనమండలిలో ఆ జీవోను ఎందుకు అమలు చేయరు?


నేరుగా ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనలేని కళాకారులు, క్రీడాకారులు, సైంటిస్టులు, మేధావుల సేవలను సమాజానికి ఉపయోగించుకోవాలనే  ఆశయంతో గవర్నర్‌ కోటాను ఏర్పాటు చేశారు. కానీ అందులో కనీస ప్రాతినిధ్యం లేని ప్రాంతాలకు, కులాలకు ప్రాతినిధ్యం కల్పించటం లేదు. అక్కడ ఏమాత్రం సామాజిక న్యాయ సూత్రాన్ని పాటించటం లేదు. ఎమ్మెల్యేలూ ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయిన వారికి, నేరారోపణలున్న రాజకీయ నాయకులకు శాసనమండలి సభ్యత్వాన్ని కట్టపెడుతున్నారు. ఇది గవర్నర్‌ కోటా లక్ష్యానికే విరుద్ధం.


సమాజంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు ఎస్టీ, ఎస్సీ, బీసీలు మైనార్టీ వర్గాలు కూడా ప్రభుత్వానికి పన్నులు కడుతున్నాయి. ఆ పన్నులతోనే బడ్జెట్‌ రూపొందుతుంది. ఆ బడ్జెట్‌ నుంచే శాసనమండలి సభ్యులకు జీతభత్యాలు ఇస్తున్నారు. మరి అలాంటి శాసనమండలిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఎందుకు వాటా కల్పించటం లేదు? ఒకవేళ శాసనమండలిలో రిజర్వేషన్‌ ఉండి వుంటే జనాభా నిష్పత్తి ప్రకారం నలుగురు ఎస్టీలకు, తొమ్మిది మంది ఎస్సీలకు, పన్నెండు మంది బీసీలకు, ముగ్గురు మైనార్టీలకు అవకాశం వచ్చేది కాదా?


రాష్ట్ర శాసనసభలో విధానపరిషత్‍ (శాసనమండలి)ను ఎగువ సభగా అభివర్ణిస్తారు. శాసనమండలి సభ్యులను ఎమ్మెల్సీలుగా పేర్కొంటారు. ఎమ్మెల్సీ (MLC) అనగా మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌. ఈ శాసనమండలి విధానం ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్‌, కర్ణాటక, జమ్ముకాశ్మీర్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌... ఇలా ఏడు రాష్ట్రాల్లో అమలవుతోంది. 1985లో ఎన్టీఆర్ ఈ శాసన మండలిని రద్దు చేశారు. 2007 దీన్ని వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి పునరుద్ధరించారు. అప్పటి నుంచి అందులో గిరిజనులకు, దళితులకు, బీసీలకు, మైనార్టీలకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోంది.


ఏ కులం, ఏ తెగ అభివృద్ధి అయినా రాజ్యాధికారంలో  అది సాధించుకున్న వాటాను బట్టే ఉంటుందనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మైదాన ప్రాంత గిరిజనులకు పోటీ చేయటానికి రిజర్వుడు సీట్లు లేవు. దాంతో, రాజ్యధికారంలో వాటాని దక్కించుకోలేక చట్టసభల మెట్లెక్కని షెడ్యూల్డ్‌ ప్రాంత పి.టి.జి.వి తెగల, మైదాన ప్రాంత గిరిజనులైన ఎరుకల, యానాది, చెంచు, నక్కల, సుగాలి (లంబాడి) తెగల పరిస్థితి కడు దయనీయంగా ఉంది.


ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి గిరిజన జనాభాను బట్టి రాజ్యాంగంలోని అధికరణ 330 ప్రకారం లోక్‌సభలోను, అధికరణ 332 ప్రకారం అసెంబ్లీలలోను తగు మోతాదులో స్థానాలను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంలో 294 శాసనసభ నియోజకవర్గాలకుగాను 19 అసెంబ్లీ స్థానాలను, 42 లోక్‍సభ నియోజకవర్గాలకు గాను 3 స్థానాలను ఎస్టీలకు ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడం వలన ఆంధ్రప్రదేశ్‌‍లో 7 శాసనసభ స్థానాలను, 1 లోక్‌సభ స్థానాన్ని ఎస్టీలకు కేటాయించారు. రాజ్యాంగంలోని అధికరణ 332 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలో శాసనసభ స్థానాల సంఖ్యను బట్టి, గిరిజన జనాభా నిష్పత్తిని బట్టి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 12 శాసనసభ స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేయాలి. కానీ 7 స్థానాలు మాత్రమే కేటాయించారు. విభజన హామీల ప్రకారం కేటాయించాల్సిన మరో 5 శాసనసభ స్థానాల గురించి ఏ ఒక్కరూ నోరు మెదపకుండా అన్ని రాజకీయ పార్టీలు గిరిజనుల పట్ల పక్షపాతధోరణిని అవలంబిస్తున్నాయి.


2003లో అమలులోకి వచ్చిన 87వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 2026 వరకు మార్పు చేయరాదు. అసెంబ్లీ, పార్లమెంటు సాధారణ ఎన్నికలు 2024లో జరుగుతాయి. 2026లో పునర్విభజన జరిగినా 2024లో ఎన్నికైన వారి పదవీకాలం ఐదేళ్లు కనుక, విభజన చట్టంలో పేర్కొన్న మరో 5 ఎస్టీ స్థానాలను 2029 వరకు కోల్పోవల్సిందే. అప్పటివరకు గిరిజనులు జెండాలు మోస్తూ ఓట్లేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు ఊడిగం చేయాల్సిందే.


రిజర్వేషన్‌ లక్ష్యం అసమానతలను తొలగించడమే. రాజ్యాంగం ఈ అసమానతలను తొలగించి అందరి కన్నీళ్ళు తుడవాలనే రాజ్యాంగంలోని  అధికరణ 14, 15, 16, 338, 341, 342, 342(ఎ)లను కల్పించింది. కానీ అమలులో మాత్రం అన్యాయమే జరుగుతోంది. ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం ఉన్నప్పటికీ యథేచ్ఛగా గిరిజనులకు సంబంధించిన నిధులను దారి మళ్ళించి, గత మూడేళ్లుగా ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా ఒక్క గిరిజనుడికి కూడా ఋణం మంజూరు చేయలేదంటే అన్యాయం కాదా?


శాసనసభకు పోటీ చేయుటకు మైదాన ప్రాంతంలో ఎస్టీలకు రిజర్వుడ్‌ స్థానాలు లేవు. మైదాన ప్రాంత గిరిజనులు పోటీ చేద్దామని భావిస్తే అన్ని రాజకీయ పార్టీలు నాన్‌ లోకల్‌ పేరుతో టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. అందువలన రిజర్వేషన్ కొన్ని తెగలకు వరంగానూ, కొన్ని తెగలకు శాపంగానూ మారింది. ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వుడు స్థానాలు ఏజెన్సీ ప్రాంతంలోనే కేంద్రీకృతం అయివున్నవి. 34 తెగలలో ఇప్పటివరకు ఏజన్సీ ప్రాంతంలో పి.టి.జి.వి తెగలు, మైదాన ప్రాంతంలోని ఎరుకల, యానాది, చెంచు, నక్కల లంబాడి తెగలకు ఏడున్నర దశాబ్దాల కాలంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది. మైదాన ప్రాంతంలోని గిరిజన తెగలకు నేటికీ రాజకీయ ప్రాతినిధ్యమే లేదు. మరోపక్క దళితులలో 50కి పైగా కులాలకు ఇప్పటికీ రిజర్వేషన్‌ అంటే కూడా తెలియదు. 56 శాతం జనాభా కలిగిన బీసీలకు అసలు రాజకీయ రిజర్వేషనే లేదు. మైనార్టీలకు మొక్కుబడిగా తప్పితే హక్కుగా అవకాశాలు కల్పించబడలేదు. కనీసం శాసనమండలిలోనైనా చట్ట సభలకు వెళ్ళని కులాలు, తరగతులు, తెగలకు న్యాయం జరుగుతుందని భావిస్తే అందులో రిజర్వేషన్‌ లేదు. ఈ నేపథ్యంలో చట్టసభలలో ప్రాతినిధ్యం లేని మైదాన ప్రాంత గిరిజనులకు, ఏజెన్సీలోని తెగలకు, దళితులకు, బీసీలకు, మైనార్టీలకు ఇన్నేళ్ళుగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే శాసనమండలిలో జీఓ24ను అమలు చేయాలి.

అనుముల వంశీకృష్ణ

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బిజెపి గిరిజన మోర్చ

Updated Date - 2022-08-03T06:24:46+05:30 IST