Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఇలా చేయడమే బెటర్..

ఆంధ్రజ్యోతి(10-04-2020)

క్రిమిసంహారక టన్నెల్‌ కంటే పరిశుభ్రత, భౌతిక దూరమే బెటర్‌

కరోనా ముప్పు తగ్గి, లాక్‌డౌన్‌ ఎత్తివేశాక మనం ఏ మాల్‌కి వెళ్లినా లేదా మార్కెట్‌, రైల్వేస్టేషన్‌, ఎయిర్‌పోర్ట్‌.... ఇలా ఎక్కడికి వెళ్లినా క్రిమిసంహార పిచికారీ టన్నెల్‌లు దర్శనమివ్వనున్నాయి. ఇప్పటికే వీటిని రద్దీ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టన్నెల్‌ అంటే  ఏమిటి? నిజంగానే వీటివల్ల వైరస్‌, ఇతరత్రా బ్యాక్టీరియాను నిర్మూలించగలమా? ఇవి ఎంతవరకు సురక్షితం వంటివి చూద్దాం.! 

టన్నెల్‌ అంటే సొరంగం. అవసరమైన చోట దీనిని కృత్రిమంగా ఏర్పాటు చేస్తారు. దీనిలో సెన్సర్లు, స్ర్పేలు ఉంటాయి. ఈ కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించగానే అధిక పీడనంతో గల పొగమంచు రూపంలో క్రిమిసంహారక ద్రావణం 40 సెకన్ల పాటు పిచికారీ అవుతుంది. దాంతో మన దుస్తులపై ఉన్న వైరస్‌, ఇతరత్రా సూక్ష్మక్రిములు నశిస్తాయి. ఇలాంటి టన్నెల్‌లను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ఈ పిచికారీ ద్రావణంలో సోడియం హైపోక్లోరైట్‌ సొల్యూషన్‌, క్లోరిన్‌ కాంపౌండ్‌ను ఉపయోగిస్తున్నారు. తాగునీటి శుద్ధీకరణలో, వ్యర్థ జలాలను శుద్ధజలాలుగా మార్చడంలో, అదేవిధంగా స్విమ్మింగ్‌పూల్‌ల్లో కూడా సోడియం హైపోక్లోరైట్‌నే ఉపయోగిస్తారు. 0.5 (100 ఎంఎల్‌కి) శాతం డబ్ల్యూ/వి ఉండే ద్రావణాన్ని డేకిన్స్‌ సొల్యూషన్‌ (డేకిన్స్‌ ద్రావణం) అంటారు. దీనిని సాంప్రదాయకంగా క్రిమినాశక (యాంటీసెప్టిక్‌) మందుగా అంటే సంక్రమణను నివారించడానికి, గాయాలను శుభ్రపరచడానికి వాడతారు. అయితే ఒక శాతం ద్రావణ పరిమాణం గల భారీ టన్నెల్‌ను మొదట తమిళనాడులోని తిరుపూర్‌ జిల్లా మార్కెట్‌లో వినియోగంలోకి తెచ్చారు. ఇప్పుడు ఈ టన్నెల్‌లను వివిధ ఆకారాలు, వివిధ పరిమాణాల్లో తయారు చేస్తున్నారు. వీటి ధర కూడా అవసరాన్ని బట్టి పదివేల రూపాయలు మొదలుకొని లక్షల రూపాయల వరకు పలుకుతున్నాయి. ముఖ్యంగా మంచి నాణ్యత గల ఉక్కు, వివిధ రకాల సెన్సర్లు, కన్వేయర్‌ బెల్ట్‌లు, ట్రాఫిక్‌ లైట్లతో తయారవుతున్న క్రోమ్‌ టన్నెల్‌ ధర 25 లక్షల రూపాయల వరకూ ఉంటోంది. మహారాష్ట్ర భుస్వాల్‌లోని ఇండియన్‌ రైల్వేస్‌ లోకోషెడ్‌ కూడా పదివేల రూపాయల ధర గల టన్నెల్‌ను తయారు చేసింది. దీనిలో మూడు నాజిల్‌లు ఉంటాయి. ఇవి మిలియన్‌ సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని మూడు నుంచి ఐదుసెకన్ల వరకు పిచికారీ చేస్తాయి. ఇది 500 లీటర్ల ట్యాంక్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 15 గంటలకు పైగా నిరంతరాయంగా పనిచేస్తుంది. ఈ స్ర్పే కొవిడ్‌ వైర్‌సను అయితే నశింపచేస్తుంది కానీ, మానవులకు కొంత మేర హానికరమేననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వీటి వినియోగంపై ఇటీవలే ఒక హెచ్చరిక చేసింది. ఇవి ఒక సప్లిమెంట్‌ మాదిరిగానే పనిచేస్తాయని, వెంటవెంటనే చేతులు కడుక్కోవడం, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి సురక్షితమైన విధానాలకు ప్రత్యామ్నాయం కాబోవని పేర్కొంది. సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం వల్ల తేలికపాటి నుంచి తీవ్ర దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని, చర్మం, కళ్లు మండటం లాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మంపై కాలిన గాయాల వంటివి కూడా అరుదుగా కొంతమందిలో ఏర్పడే ప్రమాదం ఉండనున్నదన్నారు. కాబట్టి ఇలాంటి టన్నెల్‌లను విరివిగా వినియోగంలోకి తీసుకురాకముందే ప్రభుత్వాలు వీటికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని వారు కోరుతున్నారు. ఏది ఏమైనా మాస్కు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరాన్ని పాటించడం ఒక్కటే కరోనా కట్టడికి సరైన మార్గమని వారు సూచిస్తున్నారు.

Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...