బోనులో న్యాయ కోవిదుడు

ABN , First Publish Date - 2020-08-15T08:22:50+05:30 IST

ఆయన తండ్రి శాంతి భూషణ్‌ దేశంలోనే పేరుమోసిన న్యాయనిపుణుడు. అలహాబాద్‌ హైకోర్టులో రాజ్‌నారాయణ్‌ తరఫున వాదించి నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీయే పదవి కోల్పోవడానికి కారకుడైన వ్యక్తి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామికవేత్త. మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఇందిరాగాంధీ రాజ్యాంగానికి చేసిన అనేక మార్పులను తిరగరాసిన ఉద్ధండుడు. ఇప్పుడు తండ్రి బాటలోనే నడస్తూ పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాల ద్వారా ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రశ్నిస్తున్న ఆయన కుమారుడు ప్రశాంత్‌ భూషణ్‌ న్యాయవ్యవస్థపై చేసిన కీలక వ్యాఖ్యల కారణంగా కోర్టు ధిక్కార నేరం కింద శిక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు...

బోనులో న్యాయ కోవిదుడు

ఆయన తండ్రి శాంతి భూషణ్‌ దేశంలోనే పేరుమోసిన న్యాయనిపుణుడు. అలహాబాద్‌ హైకోర్టులో రాజ్‌నారాయణ్‌ తరఫున వాదించి నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీయే పదవి కోల్పోవడానికి కారకుడైన వ్యక్తి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామికవేత్త. మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఇందిరాగాంధీ రాజ్యాంగానికి చేసిన అనేక మార్పులను తిరగరాసిన ఉద్ధండుడు. ఇప్పుడు తండ్రి బాటలోనే నడస్తూ పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాల ద్వారా ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రశ్నిస్తున్న ఆయన కుమారుడు ప్రశాంత్‌ భూషణ్‌ న్యాయవ్యవస్థపై చేసిన కీలక వ్యాఖ్యల కారణంగా కోర్టు ధిక్కార నేరం కింద శిక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.


న్యూఢిల్లీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే, ఆయనకు ముందున్న నలుగురు ప్రధాన న్యాయమూర్తులపై తన ట్వీట్ల ద్వారా వ్యాఖ్యలు చేసిన న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌పై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం నిర్ణయించడం న్యాయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ కేసును సుప్రీం తనంతట తాను విచారణకు స్వీకరించింది. ప్రశాంత్‌ భూషణ్‌కు విధించాల్సిన శిక్షపై ఆగస్టు 20న వాదోపవాదాలు వింటామని సుప్రీం స్పష్టం చేయడంతో ఆయనకు ఏ శిక్ష విధిస్తారన్న విషయంపై కూడా ఆసక్తి చెలరేగింది. కోర్టు ధిక్కార చట్టం, 1971 ప్రకారం ప్రశాంత్‌ భూషణ్‌కు ఆరునెలలు జైలుశిక్ష విఽధించవచ్చు లేదా ఆయన క్షమాపణను కూడా అంగీకరించవచ్చు. అంతే కాదు.. ప్రశాంత్‌ భూషణ్‌పె 11 ఏళ్ల క్రితం నమోదైన మరో కేసును కూడా వెలికితీసి ఆగస్టు 17న విచారించాలని సుప్రీం అతి వేగంగా నిర్ణయించడంపై కూడా సంచలనం రేగుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన 16 మందిలో సగం మంది అవినీతిపరులేనని 2009లో ప్రశాంత్‌భూషణ్‌ తెహెల్కా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూపై ఈ కేసు నమోదైంది. తన కుమారుడు చేసిన ఆరోపణలను తాను సమర్థిస్తానని ప్రశాంత్‌ భూషణ్‌ తండ్రి శాంతి భూషణ్‌ కూడా అఫిడవిట్‌ దాఖలు చేశారు. తన కుమారుడి వాదనకు మద్దతుగా ఆయన ప్రధాన న్యాయమూర్తుల అవినీతి గురించి సుప్రీంకోర్టుకు సీల్డు కవర్‌లో డాక్యుమెంట్లను సమర్పించారు. ఈ కేసు విచారణ బహిరంగ కోర్టు ద్వారా జరగాలని ఆయన తాజాగా డిమాండ్‌ చేశారు. కానీ, శాంతి భూషణ్‌ వాదనలను వినేందుకు సుప్రీం అంగీకరించలేదు. ఆయన సీల్డ్‌ కవర్‌లో ఏమి సమర్పించారన్న విషయం మరుగున పడిపోయింది. ఆయన పిటిషన్‌ తిరస్కరించిన రీత్యా సీల్డ్‌ కవర్‌లో ఉన్న అంశాలపై కోర్టు విచారిస్తుందా లేదా అన్నది స్పష్టం కాలేదు. 


ఆగ్రహం తెప్పించిన ట్వీట్లు..

తాజా కేసులో ప్రశాంత్‌ భూషణ్‌ తన రెండు ట్వీట్ల ద్వారా సుప్రీం ఆగ్రహానికి గురయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే ఒక బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన అత్యంత విలువైన హార్లీ డేవిడ్‌సన్‌ మోటార్‌ సైకిల్‌పై కూర్చోవడంపై భూషణ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నాలుగు నెలలుగా కోర్టు క్రమబద్ధంగా నడిచేందుకు అనుమతించని ప్రధాన న్యాయమూర్తి స్వయంగా చుట్టూ పలువురు వ్యక్తులు ఉండగా, మాస్కు లేకుండా మోటార్‌ సైకిల్‌పై కనిపించారని వ్యాఖ్యానించారు. ఈ మోటారు సైకిల్‌ విలువ, అది బీజేపీ నేతకు చెందినదన్న విషయం వాస్తవాలేనని అన్నారు. అయితే నిలుచున్న మోటార్‌ సైకిల్‌ను ప్రధాన న్యాయమూర్తి నడుపుతున్నారని తాను చెప్పడం సరైంది కాదని ఆయన అంగీకరించారు. కాగా మరో ట్వీట్‌ లో ఆయన గత నలుగురు ప్రధాన న్యాయమూర్తుల హయాంలో ప్రజాస్వామ్య విధ్వంసం జరిగిందని అన్నారు. పెండింగ్‌ లో ఉన్న అనేక కేసులను ఆయన ఉటంకించారు వాటిలో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, పౌరసత్వ చట్టం, పలు హెబియస్‌ కార్పొరేషన్‌ పిటిషన్లు ఉన్నాయన్నారు. ముఖ్యమైన అంశాలపై సుప్రీంకోర్టు పనితీరు సరిగా లేదని, కావాలనే ఆలస్యం చేస్తుందని అన్నారు. అదే సమయంలో రాజ్యాంగ బెంచ్‌ అతివేగంగా అయోధ్య కేసును విచారించిందని పేర్కొన్నారు. 


సుప్రీంపై ప్రశాంత్‌ న్యాయవాది ప్రశ్నలు..

ప్రశాంత్‌ భూషణ్‌ తరఫున కేసును వాదించిన ఆయన న్యాయవాది దుష్యంత్‌ దవే పలు ప్రశ్నల్ని లేవనెత్తారు. కొందరు న్యాయమూర్తులకే సున్నితమైన కేసులను ఎందుకు కేటాయిస్తున్నారు? సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగిని తన కేసు ఉపసంహరించుకున్నా ఆమెను ఎందుకు తిరిగి నియమించారు? అంటే ఆమె ఆరోపణలు సరైనవేనన్నట్లే కదా? అయోధ్య కేసును ఆగమేఘాలపై విచారించి తీర్పుచెప్పినందుకేనా జస్టిస్‌ గొగోయ్‌ను పదవీ విరమణ తర్వాత రాజ్యసభకు నామినేట్‌ చేశారు? 2018 జనవరిలో సుప్రీం పనితీరుపై నలుగురు న్యాయమూర్తులు చేసిన ఆరోపణల మాటేమిటి? ప్రశాంత్‌ భూషణ్‌ వారి అభిప్రాయాలనే కదా వ్యక్తం చేసింది.. అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. సుప్రీంకోర్టు ఈ ప్రశ్నలకు ఏమీ జవాబివ్వలేదు. తన వ్యాఖ్యలపై ప్రశాంత్‌ భూషణ్‌ వ్యక్తం చేసిన విచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. కోర్టు ధిక్కారం కింద శిక్ష విఽధించడానికే సిద్ధపడింది. 



విచారణను తప్పుబడుతున్న మాజీలు.. 

నిజానికి ప్రశాంత్‌ భూషణ్‌పై కోర్టు ధిక్కారం కింద విచారించడాన్ని మాజీ సుప్రీం న్యాయమూర్తులతో సహా దేశంలోని 131 మంది ప్రముఖులు విమర్శించారు. ఈ కేసును ఉపసంహరించుకోవాలని సుప్రీంకు విజ్ఞప్తి చేశారు. కోర్టు పనితీరు గురించి మాట్లాడడం భావ ప్రకటనా స్వేచ్ఛగా అభివర్ణించారు. వారిలో సుప్రీం మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌, రుమాపాల్‌, జిఎస్‌ సింఘ్వీ, ఏకే గంగూలీ, గోపాల గౌడ, అఫ్తాబ్‌ అలామ్‌, జాస్తి చలమేశ్వర్‌, విక్రంజిత్‌సేన్‌, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అంజనా ప్రకాశ్‌, చరిత్రకారుడు రామచంద్ర గుహ, ప్రముఖన్యాయవాది ఇందిరా జైసింగ్‌ కూడా ఉన్నారు. కానీ, సుప్రీం ఈ విజ్ఞప్తులను కూడా పట్టించుకోలేదు. దీనితో ప్రజాస్వామ్యానికి చీకటిరోజులు వచ్చాయని రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. నిజానికి సుప్రీం న్యాయమూర్తులపై ప్రశాంత్‌ భూషణ్‌, ఆయన తండ్రి శాంతి భూషణ్‌ మాత్రమే కాదు.. సుప్రీం మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ కూడా వ్యాఖ్యానించారు. 2015లో ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమంలో మాట్లాడుతూ ఉన్నత న్యాయస్థానంలో 50 శాతం న్యాయమూర్తులు అవినీతిపరులేనన్నారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెఎల్‌ దత్‌ ఆస్తులపై తనకున్న సమాచారాన్ని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు ఇచ్చానని, అయినా ప్రయోజనం లేదని చెప్పారు. జస్టిస్‌ దత్‌ను తర్వాత మానవహక్కుల సంఘం చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే.


Updated Date - 2020-08-15T08:22:50+05:30 IST