సాకర్‌ మాంత్రికుడు

ABN , First Publish Date - 2020-11-27T06:13:21+05:30 IST

గొప్పఆటగాళ్లు ఎందరో ఉండొచ్చు కానీ, ఆటకే గొప్ప అనిపించే వాళ్లు కొందరే ఉంటారు. అలాంటి వారిలో డీగో మారడోనా ఒకరు. ఫుట్‌బాల్‌ మైదానంలో...

సాకర్‌ మాంత్రికుడు

గొప్పఆటగాళ్లు ఎందరో ఉండొచ్చు కానీ, ఆటకే గొప్ప అనిపించే వాళ్లు కొందరే ఉంటారు. అలాంటి వారిలో డీగో మారడోనా ఒకరు. ఫుట్‌బాల్‌ మైదానంలో తనదైన విన్యాసాలతో ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించిన ఈ అర్జెంటీనా దిగ్గజ ఆటగాడి హఠాన్మరణం సాకర్‌ అభిమానులనే కాదు, యావత్‌ క్రీడాప్రపంచాన్నే కంటతడి పెట్టించింది. అరవై ఏళ్లకే అనంతలోకాలకు వెళ్లిన ఈ సాకర్‌ సమ్రాట్‌ తానాడిందే ఆట, ఆడకపోయినా వార్త అన్నంతగా విశ్వవేదికపై చెరగని ముద్ర వేశాడు. 


అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ఎయిర్స్‌ శివారులోని ఓ పేద కుటుంబంలో అయిదో సంతానంగా జన్మించిన మారడోనా ఎనిమిదేళ్ల వయసులోనే సాకర్‌లో ప్రావీణ్యాన్ని చాటుకున్నాడు. ఆ చిరుప్రాయంలోనే అద్భుతమైన ఆటతో కోచ్‌ను అచ్చెరువొందించేలా చేసిన డీగో అనతికాలంలోనే జూనియర్‌ క్లబ్‌ జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత జాతీయ జట్టులో చోటుతో అంచలంచెలుగా ఎదిగి సాకర్‌ సామ్రాజ్యాన్ని ఏలిన గోల్డెన్‌బాయ్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. ఐదున్నర ఎత్తుల అడుగుండే అతను మైదానంలో పాదరసంలా కదులుతూ, బంతిని తన నియంత్రణలో ఉంచుకుంటూ, అమోఘమైన డ్రిబ్లింగ్‌ స్కిల్స్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను బోల్తా కొట్టిస్తూ ఆశ్చర్యపరిచేవాడు. ఒక్కసారిగా ఆటగాళ్లంతా తనను చుట్టుముట్టినా ఏమాత్రం బెదరక బంతిని ఒక కాలి నుంచి మరో కాలుకు మారుస్తూ గోల్‌ పోస్ట్‌కు సంధించే ఆ నైపుణ్యం అతడికి మాత్రమే సొంతం. ఆటగాడిగానే గాకుండా సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలతో 1986లో అర్జెంటీనాకు ప్రపంచ కప్పును అందించి కెప్టెన్‌గా తన పేరును సార్థకం చేసుకున్నాడు. ఈ ప్రపంచ టోర్నీలోనే డీగో చేసిన విన్యాసానికి ఫుట్‌బాల్‌ ప్రపంచం మైమరిచిపోయింది. ఇంగ్లండ్‌తో క్వార్టర్‌ఫైనల్‌ పోరులో తాను కొట్టిన రెండు గోల్స్‌ సాకర్‌ చరిత్రలోనే అతడికి ప్రత్యేకస్థానాన్ని కట్టబెట్టాయి. వివాదాస్పదరీతిలో మారడోనా చేయి తాకి బంతి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లిన ఓ గోల్‌ ‘హ్యాండ్‌ ఆఫ్‌ ది గాడ్‌’గా నిలిచిపోగా, 62 మీటర్ల దూరాన్ని కవర్‌ చేస్తూ ప్రత్యర్థి జట్టులోని ఐదుగురు ఆటగాళ్లను బోల్తా కొట్టిస్తూ అతను సంధించిన గోల్‌ ‘ఆ శతాబ్దపు గోల్‌’గా ఖ్యాతికెక్కడం విశేషం. జాతీయ జట్టు తరఫున 91 మ్యాచ్‌లాడిన మారడోనా అంతర్జాతీయస్థాయిలో 34 గోల్స్‌తో అభిమానులకు ఆనందాన్ని పంచాడు. తనదైన ఆహార్యంతో, విభిన్నమైన హావభావాలతో వినూత్నమైన ప్రదర్శనతో ఎప్పుడూ జట్టులో ఉత్సాహాన్ని ఉరకలెత్తించే అతను అప్పట్లోనే ఫుట్‌బాల్‌కు దూకుడును పరిచయం చేశాడు. పరోక్షంగా అతని శైలినే ఒంట బట్టించుకున్నట్లు అనిపించే భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీకి మారడోనా అంటే విపరీతమైన అభిమానం. అందుకే అతని మరణవార్త తెలిసి ‘నా హీరో, మేధావి ఇక లేడం’టూ బాధాతప్త హృదయంతో స్పందించాడు. ఇక, వ్యక్తిగతంగా మారడోనాను ఇష్టపడని అప్పటితరం ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే కూడా ఆటపరంగా అతడి ప్రదర్శనను మాత్రం ఆకాశానికెత్తుతాడు. ‘ఏదో ఒకరోజు మేమిద్దరం ఆకాశంలో బంతితో ఆడతాం’ అంటూ వ్యాఖ్యానించి మారడోనా మృతికి పీలే ఘనమైన నివాళి అర్పించాడు. ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య 2001లో పీలేతో కలిసి మారడోనాను మేటి ఆటగాడిగా గుర్తించి గౌరవించింది. ఈతరం ఆటగాళ్లలో తమ దేశానికి చెందిన లియోనెల్‌ మెస్సీ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా నీరాజనాలందుకుంటున్నా, అర్జెంటీనా వాసులకు మాత్రం మారడోనానే ఎప్పటికీ హీరో. తన కన్నా మెస్సీ అత్యధిక గోల్స్‌ కొట్టినా ఆదరణలో మాత్రం డీగోకు సాటిరారెవ్వరూ అంటూ వాళ్లు తమ అభిమానాన్ని చాటుకుంటారు.


క్రీడలను ఎంతగానో ప్రేమించే మారడోనా రాజకీయాలన్నా అంతే ఆసక్తి కనబరిచేవాడు. సమకాలీన రాజకీయాలపై తన అభిప్రాయాలను బలంగా చెప్పేవాడు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించేవాడు. లాటిన్‌ అమెరికా వామపక్ష నేతలకు మద్దతివ్వడంలో ఎప్పుడూ ముందుండేవాడు. వెనిజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌తో అతడికి మంచి సంబంధాలు ఉండేవి. క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడేల్‌ క్యాస్ట్రోను అమితంగా ఆరాధించే మారడోనా అతడిని తన రెండో తండ్రిగా భావించేవాడు. తన తండ్రి మరణం తర్వాత ఇప్పుడే ఇంతలా ఏడుస్తున్నానని క్యాస్ట్రో చనిపోయిన సందర్భంగా మారడోనా వ్యాఖ్యానించాడు. ఎడమకాలిపై క్యాస్ట్రో టాటూ వేయించుకొని ఆయనపట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. తాను అభిమానించే మరో నాయకుడు, విప్లవ యోధుడు చే గువెరా టాటూను కుడి భుజంపై వేయించుకున్నాడు.


తన ఆటతో విశ్వవ్యాప్తంగా అభిమానగణాన్ని సంపాదించుకున్న మారడోనా మైదానం బయట మాత్రం అత్యంత వివాదాస్పదుడిగా అప్రతిష్ఠ మూటగట్టుకున్నాడు. ఆటాడుతున్నప్పుడే మాదకద్రవ్యాలకు బానిసై ఎన్నోసార్లు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడు. 1991లో కొకైన్‌ తీసుకొని 14 నెలలు బహిష్కరణకు గురయ్యాడు. 1997లో కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత మత్తుకు బానిసగా మారాడు. మాదకద్రవ్యాల కోసమే నపోలికి వెళ్లి అక్కడి మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నాడు. మితిమీరిన డ్రగ్స్‌, మద్యం వాడకంతో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అన్నిసార్లు వివాదాలతో సహవాసం చేసినా ఫుట్‌బాల్‌ను వీడకపోవడం ఆటపై అతనికున్న అంకితభావానికి నిదర్శనం. చనిపోయే ముందువరకు అతను అర్జెంటీనాలోని ప్రఖ్యాత జిమ్నాసియా క్లబ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. చివరి శ్వాస వరకు ఫుట్‌బాల్‌తోనే ప్రయాణించిన మారడోనా అభిమానుల మదిలో ఎప్పటికీ దిగ్గజమే. 

Updated Date - 2020-11-27T06:13:21+05:30 IST