సోప్‌ యూనిట్‌పై జీసీసీ శీతకన్ను

ABN , First Publish Date - 2022-07-01T06:14:36+05:30 IST

అరకులోయలోని సబ్బుల తయారీ పరిశ్రమపై గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఉన్నతాధికారులు శీతకన్ను వేశారు.

సోప్‌ యూనిట్‌పై జీసీసీ శీతకన్ను
అరకులోయలోని జీసీసీ సోప్‌ యూనిట్‌

అరకులోయలో నిలిచిపోయిన సబ్బుల తయారీ

- గోదాముల్లో మూలుగుతున్న నిల్వలు

- మార్కెటింగ్‌పై కనీస దృష్టి సారించని అధికారులు

- గతంలో గిరిజన సంక్షేమ శాఖ హాస్టళ్లకు, డీఆర్‌ డిపోలకు సబ్బులు సరఫరా

- అమ్మఒడి పథకంతో కాస్మటిక్‌ చార్జీలను రద్దు చేసిన ప్రభుత్వం

- సబ్బు కొనుగోళ్లు ఆపేసిన గిరిజన సంక్షేమ అధికారులు

- ‘ఇంటి వద్దకే రేషన్‌’తో సరిగా తెరుచుకోని డీఆర్‌ డిపోలు

- బకాయిలు పేరుకుపోవడంతో సబ్బుల సరఫరా ఆపేసిన అధికారులు

- సోప్‌ యూనిట్‌ను మూసేస్తారేమోనని కార్మికులు ఆందోళన

అరకులోయ, జూన్‌ 30: అరకులోయలోని సబ్బుల తయారీ పరిశ్రమపై గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఉన్నతాధికారులు శీతకన్ను వేశారు. ఆరు నెలల నుంచి సబ్బుల ఉత్పత్తిని నిలిపివేశారు. గోదాముల్లో రెండు లక్షలకుపైగా సబ్బులు నిల్వ వున్నాయి. మరోవైపు అమ్మఒడి పథకంతో గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాలకు సబ్బుల సరఫరా నిలిచిపోయింది. డ్వామా నుంచి కూడా ఆర్డర్లు రావడంలేదు. జీసీసీ డీఆర్‌ డిపోలకు గతంలో సరఫరా చేసిన సబ్బులకు సంబంధించి బకాయిలు పేరుకుపోయాయి. జీసీసీ మార్కెటింగ్‌ విభాగం అధికారులు బహిరంగ మార్కెట్‌లో సబ్బుల అమ్మకాలపై కనీస దృష్టి సారించకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే సబ్బుల తయారీ యూనిట్‌ త్వరలో మూతపడి, తాము ఉపాధి కోల్పోతామని దీనిలో పనిచేస్తున్న కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

గిరిజన సహకార సంస్థ 2008వ సంవత్సరంలో అరకులోయలో ‘సోప్‌ యూనిట్‌’ను (సబ్బుల తయారీ కేంద్రం) ఏర్పాటు చేసింది. నెలకు లక్ష సబ్బులు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ఇక్కడ తయారు చేసిన సబ్బులను రాష్ట్రంలో (ఉమ్మడి ఏపీ) ఉన్న అన్ని గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాలకు సరఫరా చేసేవారు. డ్వామా అధికారులు ఉపాధి హామీ పథకం కూలీల కోసం సబ్బులు కొనుగోలు చేసేవారు. ఇంకా జీసీసీ డీఆర్‌ డిపోలకు కూడా సబ్బులు సరఫరా అయ్యేవి. దీంతో 2012లో సోప్‌ యూనిట్‌ను విస్తరించి నెలవారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండు లక్షల సబ్బులకు, 2020లో మూడు లక్షల సబ్బుల తయారీకి పెంచారు. నీమ్‌ (వేప), అలోవేరా (కలబంద), టర్మరిక్‌ (పసుపు), జాస్మిన్‌ (మల్లె) రకం సబ్బులు తయారు చేసేవారు. కాగా 2020 మార్చిలో కొవిడ్‌-19 ప్రబలడంతో గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాలను నెలల తరబడి మూసివేశారు. అదే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రారంభించింది. నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడంతో గిరిజన సంక్షేమ శాఖకు చెల్లించే కాస్మటిక్‌ చార్జీలను ప్రభుత్వం నిలిపివేసింది.  గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సోప్‌ యూనిట్‌ నుంచి సబ్బుల కొనుగోళ్లను ఆపేశారు. ఈ ప్రభావం సోప్‌ యూనిట్‌పై  పడడంతో ఉత్పత్తిని బాగా తగ్గించేశారు. ఇదే సమయంలో డ్వామా నుంచి కూడా కొనుగోళ్లు ఆగిపోయాయి.   

పేరుకపోయిన డీఆర్‌ డిపోల బకాయిలు

ఏజెన్సీ ప్రాంతంలో రేషన్‌ పంపిణీని జీసీసీ చేపట్టి డీఆర్‌ డిపోల ద్వారా గిరిజనులకు బియ్యం, పంచదార, కందిపప్పు వంటివి అందజేసేది. వీటితోపాటు సబ్బులు, టూత్‌పేస్టులు, ఇతర నిత్యావసర సరకులకు కూడా విక్రయించేవారు. అరకులోయ సోప్‌ యూనిట్‌ నుంచి అన్ని డీఆర్‌ డిపోలకు సబ్బులు సరఫరా అయ్యేవి. అయితే వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీని ప్రారంభించడంతో డీఆర్‌ డిపోలను సక్రమంగా తెరవడంలేదు. అప్పటికే సరఫరా చేసిన సబ్బులకు కోట్లాది రూపాయలు బకాయి వున్నాయి. దీంతో డీఆర్‌ డిపోల నిర్వాహకులు డబ్బులు చెల్లిస్తేనే సబ్బులు సరఫరా చేయాలని అప్పటి జీసీసీ ఎండీ శోభ ఆదేశాలు జారీ చేయడంతో డిపోల్లో సబ్బుల విక్రయాలు పూర్తిగా ఆగిపోయాయి. 

మార్కెటింగ్‌లో విఫలం

జీసీసీలో మార్కెటింగ్‌కు ప్రత్యేకంగా జనరల్‌ మేనేజర్‌ స్థాయి అధికారి వున్నారు. జీసీసీ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం వేలాది రూపాయలు జీతాలు చెల్లిస్తూ పలువురిని ఉద్యోగులుగా నియమించారు. జీసీసీ ఉత్పత్తుల విక్రయానికి ఫ్రాంచైజ్‌లు కూడా ఇచ్చారు. ఇంత నెట్‌వర్క్‌ వున్నప్పటికీ సబ్బుల మార్కెటింగ్‌పై ఏడాది నుంచి ఎందుకు దృష్టి సారించలేదన్న విమర్శలు వస్తున్నాయి. 

సోప్‌ యూనిట్‌ కార్మికుల్లో గుబులు

అరకులోయ సోప్‌ యునిట్‌లో 23 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గతంలో వీరికి సబ్బుల ఉత్పత్తి ఆధారంగా వేతనాలు (పీస్‌ రేట్‌) చెల్లించేవారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అరకులోయ పర్యటనకు రాగా... సోప్‌ యూనిట్‌ కార్మికులు ఆయనను కలిసి, నెలవారీ జీతాలు చెల్లించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన నెలకు రూ.6 వేల చొప్పున జీతాలు చెల్లించాలని జీసీసీని ఆదేశించారు. తరువాత ఏటా కొంతమేర పెరుగుతుండడంతో ప్రస్తుతం రూ.10 వేల వరకు వేతనం పొందుతున్నారు. ఆరు నెలల నుంచి సబ్బుల తయారీ నిలిచిపోయినప్పటికీ కార్మికులకు జీసీసీ నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే సబ్బుల మార్కెటింగ్‌పై జీసీసీ అధికారులు శ్రద్ధ చూపకపోవడం, గోదాముల్లో రెండు లక్షలకు పైగా సబ్బులు మూలుగుతుండడంతో భవిష్యత్తులో సోప్‌ యూనిట్‌ని మూసేస్తారేమోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2022-07-01T06:14:36+05:30 IST