అనైతిక షోలపై ఇంత అచేతనత్వమా?

ABN , First Publish Date - 2020-09-11T06:16:52+05:30 IST

కళకళ కోసం కాదు, ప్రజల కోసం అన్నారు లెనిన్‌. నిజమే, సామాజిక వాస్తవికతతో సంబంధం లేని కళలు, సాహిత్యం పురోగమనానికి తోడ్పడకపోగా తిరోగమనానికి దారితీస్తాయి...

అనైతిక షోలపై ఇంత అచేతనత్వమా?

కరోనా మహమ్మారి విజృంభించి మానవీయ అనుబంధాలను మంటగలిపింది. రైతులు, వృత్తిదారులు అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆడపిల్లలపై లైంగికదాడులు పెరుగుతున్నాయి. దళితులు, బలహీనవర్గాలపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో శిరోముండన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి ఒక విషమ, విషాద పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఇవేమీ ఈ బిగ్‌బాసులకు పట్టవా?


కళకళ కోసం కాదు, ప్రజల కోసం అన్నారు లెనిన్‌. నిజమే, సామాజిక వాస్తవికతతో సంబంధం లేని కళలు, సాహిత్యం పురోగమనానికి తోడ్పడకపోగా తిరోగమనానికి దారితీస్తాయి. వాస్తవికతను విస్మరించడమంటే అది కేవలం గారడీయే అవుతుంది. ఏ కళైనా సరే ప్రజలను చైతన్యవంతం చేసేలా, ఆలోచనపరులుగా తీర్చిదిద్దేలా ఉండాలే తప్ప, వారిని నిద్రమత్తులో ముంచకూడదు. ఇటీవలి కాలంలో టీవీల్లో వస్తున్న బిగ్‌బాస్‌, జబర్దస్త్‌, అదిరింది తదితర కార్యక్రమాలు యువతీ యువకులను నిష్ర్కియాపరులుగా మార్చేస్తున్నాయి. ఒకనాడు మన కళలు జాతీయోద్యమాన్ని, సంస్కరణోద్యమాన్ని ఆంధ్రోద్యమాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు, వారిని పోరాటయోధులుగా మలిచేందుకు కీలకపాత్ర పోషించాయి. నేడు మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామంటే, దాంట్లో కళలు నిర్వహించిన పాత్ర ఎంతో ఉంది. ఎందరో కళాకారులు తమ జీవితాలను వాటి కోసం త్యాగం చేశారు. ఇఫ్టా, ప్రజానాట్యమండలి వంటి సంస్థలు సామాన్యులను సైతం కదిలించాయి. సమస్యలపై ఉద్యమించేలా చేశాయి. ఫలితంగానే మనం నేడీ పరిస్థితుల్లో ఉన్నాం. ‘మాభూమి’ నాటకం తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించింది. నిజాం దురాగతాలను ప్రజల కళ్లకు కట్టి వారిని ఆలోచించేలా చేసింది. తొలినాళ్లలో సినిమాలు కూడా ప్రజా చైతన్యానికి ఆయుధాలుగా నిలిచాయి. మన కళారంగం హిమాలయ శిఖరాలను అధిరోహించడానికి ఇవన్నీ కారణమయ్యాయి. కానీ నేడు మన సీరియళ్లు, హాస్యం పేరుతో వస్తున్న ఎపిసోడ్స్‌, కొన్ని ఇతర కార్యక్రమాలు ఆ కళారంగాన్ని పాతాళంలోకి తోసేస్తున్నాయి. వీటన్నింటికీ పరాకాష్ఠే ‘బిగ్‌బాస్‌’ షో. ఇది విలాసవంతమైన అనైతిక సంస్కృతిని నిస్సిగ్గుగా ప్రదర్శించడం కాదా?


అదొక ఇంద్రలోకాన్ని తలపించే అత్యంత విలాసవంతమైన భవనం. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే విజయ్‌ మాల్యా అనుభవించిన విలాస జీవితాన్ని ప్రతిబింబించేట్లు బిగ్‌బాస్‌ చిత్రీకరణ ఉంది. దీనికి ప్రముఖ హీరో పరిచయకర్తగా ప్రత్యక్షమయ్యారు. ఈ మాయాశిబిరంలోకి ఒక యువకుడు ప్రవేశించాడు. అతడిని ఆహ్వానించిన పరిచయకర్త ముగ్గురు సినిమా తారల చిత్రాలు చూపించి ముగ్గురితో నీకేమి చేయాలనుందని అడుగుతాడు. అందుకా యువకుడు ‘ఒక అమ్మాయితో డేటింగ్‌ చేయాలని, మరో అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలనీ, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది’ అని జవాబిస్తాడు. ఈ సినిమా హీరోయిన్ల పేర్లు చెప్పడం సంస్కారం కాదు. అభేద్య విలాసపంజరం లోకి యువతీ యువకులతో పాటు ఎత్తుగడల రీత్యా పేద ముసలమ్మలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారందరూ వంద రోజులు ఈ నిర్బంధగృహంలో ఉంటారు. వారికి సెల్‌ఫోన్స్‌ ఉండవు.


కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సంబంధం ఉండదు. ఈ షో ద్వారా సమాజంలోని యువతకు వాళ్లిచ్చే సందేశం ఏమిటి? ఈ షో వల్ల వచ్చే పర్యవసానాలను ఎప్పుడైనా వాళ్లు ఒక్కసారి ఆలోచించారా? అలాగే ‘జబర్దస్త్‌’, ‘అదిరింది’ షోల ద్వారా పచ్చిబూతులు, ద్వంద్వార్థాల మాటలతో సమాజానికి ఏం చెబుతున్నారు? యువతీ యువకులు ఆ పోకడలను అనుసరించాలని సూచిస్తున్నారా? అటువంటి తరాన్నేనా మనం కోరుకుంటున్నది? సమకాలీన ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలకనుగుణంగానే మనిషి జీవితం ప్రభావితం అవుతుందనీ కళ ఆ జీవితంలో అంతర్భాగమనే వస్తుగత దృష్టితో పరిశీలించలేకపోవడమే దీనంతటికీ కారణం. మన జానపదాల్లో కూడా పిట్టకథలు తదితరాలు మనిషి ప్రయోజనానికి ఉద్దేశించి ఉండేవనే వాస్తవాన్ని మనం గమనించాలి. కళలు సహజంగా నిర్దిష్ట కాలానికి, స్థలానికి చెందినవైనా నిర్దిష్ట స్థలకాలాదులకు అతీతంగా నిర్వహించబడతాయి. ప్రభావం చూపుతాయి. ఈ సీరియళ్ళు, షోలు చూసే ప్రేక్షకుడు ప్రకృతి విరుద్ధంగా జడత్వంతో లేదా నిస్సారంగా లేదా అదో రకమైన అచేతనా స్థితిలో ఉంటాడని వీరి నిర్మాతలు, నటులు, దర్శకుల అభిప్రాయమా? ఇలాంటి ప్రేక్షకుల కోసం ఈ అనైతిక, విలాసవంతమైన షోలను రూపొందిస్తున్నారా?


ప్రేక్షకుల్లో భిన్న తరగతులుంటాయి తప్ప వారు ఊహించే లేదా భావించే వారుండరు. తమ జీవన విధానాలు సాంస్కృతిక పద్ధతులు, అనుభూతులు పొంది నిక్షిప్తం చేసుకునే స్థాయికనుగుణంగా ఆ ప్రేక్షక సమూహం కళలో లీనమవుతుంది. తమదైన జీవనశైలికి కళ ఎంత దగ్గరయితే అంతగా వాళ్లు కళకు చేరువవుతారు. కళ వాళ్ల జీవితంతో మమేకమైతే వాళ్లు కళలో లీనమవుతారు. అదే ప్రజాకళా జీవప్రవాహం. లెనిన్‌ చెప్పినదదే. కళను బూతుగా, విలాసంగా, అసహ్యంగా ఏ వర్గ ప్రజలూ చూడరు. జీవితంలోకి, ఇంకా వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టని యువతను అశ్లీలతతో, పెడదారులతో ఆకర్షించేలా ఈ షోలను కొంతవరకు తీర్చిదిద్దవచ్చు గానీ అది శాశ్వతం కాదు. యువతను తప్పటడుగులు వేయించడం మంచిది కాదు. సమాజానికి ఏమాత్రం ఉపయోగకరమూ కాదు. వర్గాలతో సంబంధం లేకుండా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం తమ పోరాట ఆయుధంగా కళలను ఏవిధంగా మార్చుకున్నది ఏ దేశ చరిత్ర చూసినా మనకు అవగతమవుతుంది. కమ్యూనిస్టు ఉద్యమంలో భాగంగా ప్రజానాట్యమండలి కళాకారులు ఊరూరా తిరిగి ప్రజాచైతన్యాన్ని ప్రోదిచేసి ఆంధ్రలో నూతన సాంస్కృతికోద్యమానికి నాంది పలికిన వాస్తవం మనందరికీ తెలిసిందే.


గురజాడ కన్యాశుల్కం, వీరేశలింగం వ్యవహారబోధిని సమాజంలో సంస్కరణలకు నాంది పలికాయి. నాజర్‌ బుర్రకథ, సుంకర, వాసిరెడ్డిల నాటకాలు, అభ్యుదయ రచయితల గీతాలు ప్రజల్ని ఒక ఊపు ఊపాయి. తెలంగాణ ప్రాంతంలో సుద్దాల హనుమంతు, ఆ తర్వాత గద్దర్‌, ఇప్పుడు వెంకన్న వంటి ఎందరో ప్రజాచైతన్యానికి తమ పాటను ఆయుధంగా మలిచారు. నిన్నగాక మొన్నటి తెలంగాణ ఉద్యమంలో కళాకారులు పోషించిన పాత్ర మరువలేనిది. ఇంతటి వారసత్వానికి మచ్చ తెస్తూ వెకిలిగా, అసభ్యంగా, అభ్యంతరకరంగా, అప్రస్తుతంగా కాలక్షేపం పేరిట ఇటువంటి పలాయన షోలను ప్రజలపైకి రుద్దడంలోని ఆంతర్యం ఏమిటి? పెట్టుబడిదారీ సంస్కృతిలో లాభం, ప్రయోజనం తప్ప సమాజ క్షేమం, ప్రజల క్షేమం పట్టదు. దాని ఫలాలే ఇవన్నీ. ప్రజాభ్యుదయ భావజాలాన్ని తక్కువ చేసి చూపడమే దాని లక్ష్యం. కానీ ఇది భౌతికవాదానికి విరుద్ధం. సమకాలీన ప్రపంచ ఆర్థిక రాజకీయ పరిణామాల కనుగుణంగానే మనిషి జీవితం ప్రభావితమవుతుంది. కళ జీవితంలో అంతర్భాగమనే వస్తుగత దృష్టితో పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలా చేస్తే ఈ పిచ్చిపిచ్చి షోల గురించి నేడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. సమాజంలో మార్పు సహజం. అయితే అది యాదృచ్ఛికంగా రాదు. ఆయా వర్గాల ప్రయోజనాల కనుగుణంగా జరిగే ఘర్షణల ద్వారా వస్తుంటుంది. ఈ ఘర్షణలో కళలు కూడా పాత్ర వహిస్తాయి. తను చస్తూ తోటివారిని చంపే కళలు ఇలాంటి షోలే. తాను బతుకుతూ తోటివారిని బతికిస్తూ తన ముందుతరాలు బతికేందుకు ఆలంబనగా నిలిచేవి ప్రజాకళలు. ఇప్పుడు మనకు కావాల్సింది అటువంటి ప్రజాకళలే తప్ప ఇటువంటి చెత్త షోలు కాదు.


ఇప్పటి మన పరిస్థితి ఏమిటి? కరోనా మహమ్మారి విజృంభించి ప్రజల్ని భయభ్రాంతులను చేస్తోంది. అనేక మందిని పొట్టనబెట్టుకుంటోంది. మానవీయ అనుబంధాలను మంటగలిపింది. తండ్రి, తల్లి, కొడుకు, భర్త, భార్య -ఎవరు చనిపోయినా అంత్యక్రియలు కూడా చేయడానికి వెనుకాడే ఒక అమానవీయ పరిస్థితి మనల్ని చుట్టేసింది. రైతులు, వృత్తిదారులు అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆడపిల్లలపై లైంగికదాడులు పెరుగుతున్నాయి. దళితులు, బలహీనవర్గాలపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో శిరోముండన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి ఒక విషమ, విషాద పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఇవేమీ ఈ బిగ్‌బాసులకు పట్టవా? విలాసవంతమైన, విచ్చలవిడి సంస్కృతిని పోగుచేసే ఒక విషవలయాన్ని మన చుట్టూ ముఖ్యంగా మన యువత చుట్టూ బిగిస్తున్నారు. సమాజ స్వభావం, సామాజిక మార్పు అనే సూత్రం వీరికి పట్టదా? సమాజం అంటే మనుషులు సమష్టిగా ప్రకృతితో కలిసి, ప్రకృతితో పోరాడుతూ సాగించే ఉత్పత్తి, పునరుత్పత్తి ప్రక్రియలు, మానవ సంబంధాల సమాహారం అని మార్క్సిజం నిర్వచిస్తోంది.


అంటే సమాజంలో మనుషుల పాత్ర, ప్రకృతి పాత్ర ఉంటుంది. ప్రకృతిని ఉపయోగించుకుని మనిషి మనుగడకు అవసరమైన ఉత్పత్తి సాగించడం ఉంది, మనుషులు నిరంతరాయంగా పునరుత్పత్తి కావడమూ ఉంది. ఈ మనుషుల మధ్య సామూహికత వల్ల సంబంధాలు నెలకొనడమూ ఉంది. ఈ సంబంధాల్లో ఘర్షణ, ఐక్యతా ఉంటాయి. వీటికి కళలు చోదకశక్తిగా పనిచేస్తాయి. ఇప్పుడు మన టీవీలు చూపుతున్న షోలు ఇందుకు విరుద్ధం. ఇవి మనిషిని పతనదిశగా తీసుకుపోతాయి. హైదరాబాద్‌కు ఎంతో చరిత్ర ఉంది. పోరాట స్ఫూర్తి, దీప్తి ఉన్నాయి. ఇక్కడి ప్రజలు, తెలుగు వారంతా ఎంతో చైతన్యవంతులు. వీరి పురోగతికి స్పష్టమైన చరిత్ర, అనివార్యమైన భౌతిక చలన నియమాలూ ఉన్నాయి. అటువంటి వారు ఇటువంటి చెత్త షోలను ఎందుకు భరిస్తున్నారు? అవినీతి సొమ్ము చేతులు మారడానికీ, లక్షలాదిమంది యువతీ యువకులు సామాజిక స్పృహ లేకుండా, టీవీలకు అతుక్కుపోతూ నిర్బంధ హింసకు గురవుతుంటే ఎందుకు చూస్తూ మిన్నకుంటున్నారు? టీవీల ద్వారా అనైతికకేళిని అందిస్తుంటే ఈ సమాజం ఎందుకు చోద్యం చూస్తోంది? ఈ ప్రజలకు అంత ఓర్పు, అచేతన ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది?

డా. కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

Updated Date - 2020-09-11T06:16:52+05:30 IST