అలా వదిలేశారు

ABN , First Publish Date - 2021-10-29T05:27:34+05:30 IST

పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీలో ఎన్‌.రామయ్య పురపాలక ప్రాథమిక పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతోంది.

అలా వదిలేశారు
వైఎస్సార్‌ కాలనీలో అద్దె భవనంలో కొనసాగుతున్న పాఠశాల

  1. అద్దె భవనంలో పురపాలక పాఠశాల
  2. రెండేళ్లుగా అద్దె చెల్లించని అధికారులు
  3. చందాలు వేసుకుని చెల్లిస్తున్న మాస్టార్లు
  4. చారిత్రక ఎన్‌.రామయ్య పాఠశాల దుస్థితి


ఆదోని(అగ్రికల్చర్‌), అక్టోబరు 28: పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీలో ఎన్‌.రామయ్య పురపాలక ప్రాథమిక పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతోంది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాల గతంలో పురపాలక సంఘం కార్యాలయం పక్కన ఉండేది. పాఠశాల చుట్టుపక్కల భవనాలు, పార్కు, తాగునీటి ట్యాంకు ఏర్పాటు చేయడంతో మరుగున పడింది. భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులను చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపించారు. ఈ నేపథ్యంలో పట్టణ శివారు ప్రాంతంలోని వైఎస్సార్‌ కాలనీలో పురపాలక పాఠశాల ఏర్పాటు చేయాలని కాలనీవాసులు అధికారులకు పలుమార్లు విన్నవించారు. దీంతో రెండేళ్ల క్రితం ఎన్‌.రామయ్య పురపాలక పాఠశాలను ఆ కాలనీకి మార్చారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, ఎదురుగా ఒక రేకుల షెడ్డు ఏర్పాటు చేసి పాఠశాలను నిర్వహిస్తున్నారు. భవనం యజమానికి ఇంత వరకూ ఒక్క పైసా కూడా అద్దె చెల్లించలేదు. రెండేళ్లుగా అద్దె ఇవ్వకపోవడంతో ఇంటి యజమాని ఉపాధ్యాయులపై ఒత్తిడి చేశారు. విద్యార్థులను తీసుకుని రోడ్డుపైకి వెళ్లలేక ఉపాధ్యాయులే తలా కొంచెం డబ్బు జమ చేసి అద్దె చెల్లిస్తున్నారు. ఈ సమస్యలను పురపాలక కమిషనర్‌, సూపర్‌వైజర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఈ పాఠశాలలో సుమారు 80 మంది విద్యార్థులు చదువుతున్నారు. శివారు ప్రాంతం కావడంతో ఇతర పాఠశాలకు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లకు పైగా వెళ్లాల్సి వస్తుంది. దీంతో స్థానికంగా ఉండే ఈ పాఠశాలకే తమ బిడ్డలను తల్లిదండ్రులు పంపుతున్నారు. పురపాలక శాఖ అధికారులు ప్రతి నెలా అద్దె చెల్లించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. కాలనీలో ప్రభుత్వ ఖాళీ స్థలం ఉంది. పక్కా భవన నిర్మాణానికి విద్యాశాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపితే పాఠశాల తరగతి గదులు నిర్మాణానికి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా పురపాలక అధికారులు కృషి చేయాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-29T05:27:34+05:30 IST