కరోనాకు ‘దగ్గరగా

ABN , First Publish Date - 2020-06-02T08:53:15+05:30 IST

కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.

కరోనాకు ‘దగ్గరగా

మినహాయింపులతో ‘స్వేచ్ఛ’గా రోడ్లపై జనం 

జిల్లాలో కొత్తగా తొమ్మిది మందికి పాజిటివ్‌ 

కొవిడ్‌ ఆసుపత్రిలో మరో మహిళ మృతి 


జిల్లాలో లాక్‌డౌన్‌ సడలింపులు ప్రజలను గడప దాటించాయి. స్వేచ్ఛగా తిరిగేందుకు ‘మినహాయింపులు’ దారులను తెరిచాయి. మొన్నటి వరకు కఠినమైన నిషేధాజ్ఞల మధ్య ఉన్న విజయవాడ నగరంలో జనజీవనం సాధారణ స్థితికి వచ్చేసింది. బస్సులు మినహా మిగిలిన వాహనాలకు అనుమతివ్వడంతో ప్రజా రవాణా ఊపందుకుంది.


మార్కెట్లు, దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. జనం భౌతిక దూరాన్ని మరిచారు. ఇదే అదునుగా కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుకుంటోంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 


(విజయవాడ, ఆంధ్రజ్యోతి)

కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. ఇదే సమయంలో జిల్లా అధికారులు కరోనా కేసులు, మరణాల వివరాలపై గోప్యత పాటిస్తుండడంతో వైరస్‌ తీవ్రత తగ్గిందనే భావనతో ప్రజలు స్వీయ రక్షణ చర్యలను ప్రాధాన్యతను పక్కన పెట్టేశారు. మరో పక్క కరోనా  మళ్లీ జడలు విప్పుకుంటోంది. కేసుల సంఖ్య పెరగడంతో పాటు ప్రతి రోజూ కరోనా కారణంగా మరణాలూ సంభవిస్తున్నాయి. జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన జిల్లా అధికార యంత్రాంగం పనితీరు చూస్తుంటే పూర్తిగా కాడి పక్కన పడేసినట్లు కనబడుతోంది. దీంతో కరోనా భూతం ఎప్పుడు, ఎవరిని కాటేస్తుందో తెలియని పరిస్థితులు తలెత్తుతున్నాయని వైద్యనిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


కృష్ణలంకలో మరో నలుగురికి పాజిటివ్‌ 

వైద్యుల ఆందోళనను నిజం చేస్తూ, జిల్లాలో కొత్తగా మరో తొమ్మిది మంది కరోనా బారినపడినట్టు  సోమవారం తెలిసింది. కరోనా హాట్‌స్పాట్‌గా గుర్తించిన కృష్ణలంకలో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నలుగురిలో ఒకరు వైసీపీ నాయకుడు కాగా.. మరొకరు టీడీపీ సానుభూతిపరుడు. మరో ఇద్దరు బీసెంట్‌ రోడ్డులో వ్యాపారులు. ఇటీవల ఢిల్లీ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న విజయవాడకు చెందిన యువ డాక్టరుకు కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు ఆయనను క్వారంటైన్‌కు తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించగా ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన పిన్నమనేని సిద్ధార్థ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదేవిధంగా జిల్లాకు చెందిన మరో నలుగురు కరోనా బారినపడి ఆసుపత్రుల పాలయ్యారు. ఒకవైపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా జనసంచారం, మరోవైపు అధికారుల ఉదాసీన వైఖరిని.. ఇలాగే కొనసాగితే.. ఇంతకాలం లాక్‌డౌన్‌తో కొంత అదుపులో ఉన్న కరోనా భూతం మళ్లీ కట్టలు తెచ్చుకుంటుందనడంలో సందేహం లేదు. 


మరో మహిళ మృతి? 

కరోనా వైరస్‌ బారినపడి విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భవానీపురం ఊర్మిళానగర్‌కు చెందిన మరో మహిళ  సోమవారం మృతి చెందారు. ఈమె మృతదేహానికి నిబంధనల ప్రకారం ఆసుపత్రి సిబ్బంది స్వర్గపురిలో దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే ఈ కరోనా మరణాన్ని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రభుత్వం వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు 18 మంది కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-06-02T08:53:15+05:30 IST