మంచుబంతి

ABN , First Publish Date - 2021-05-03T06:22:04+05:30 IST

వొదులు రయికలోంచి వొంపుగా జారిన గడుసు గుబ్బలా నువ్వు...

మంచుబంతి

వొదులు రయికలోంచి

వొంపుగా జారిన

గడుసు గుబ్బలా నువ్వు


ముగ్గు ముంగిట

మోకాలు దన్నుకి

మొలుచుకొచ్చిన మూడోరొమ్మువై నువ్వు


నల్లద్రాక్ష రాలిన వెన్నెల ముద్దగానో

బుడిపె తొడిమెల పచ్చి బొప్పాయిలానో

కాలాలకి సడలని బిగిబంతి వలెనో

                తొందర తొణికిసల ఉరమై

                ఎందుకు నాలో ఉపమిస్తావ్‌!


కలిసిన ఒకేఒక ఆగంతుక ఋతువులో

నేనెందుకు చూశాను

కాని కాలపు కాపు

మ్రానుపండ్లు మోస్తున్న నీ నూగుతీగల వీపు


          ఎలా చూశాను

          బోర్లా పారే ఏటి ఏకాంతపు ఎడమేను!


కరుడుగట్టిన నా జెండర్‌ శిలలో

కప్ప... కన్నీటి దోషాలు చెక్కిన

ఉలిపచ్చి ఉలి ముచ్చిక మొన నువ్వు


కడగట్టిన కన్నతండ్రికి

అంచెల ఆయువు కుడిపిన

పాలధారల చాటుచన్ను నువ్వు


హంసలబారు నఖరేఖలు

హత్తిన పంటిగాట్లూ

హక్కుభుక్తాలు కాదన్న అనాధీన పయోధర నువ్వు


సగం సగం వెలుగునీడల

సందెజాము క్లివెజ్‌ దారుల్లో

గుండ్రని రేయింబవళ్ల గుండె నువ్వు


ఇప్పుడు మాత్రం

ఇబ్బడి ఈతాకు దొప్పల్లో

తెగింపు తెగ్గోతల తంగేటిజున్ను నువ్వు...

పోగుపేర్చిన ఎదిరింపు ఎడద నువ్వు


                జీరాడే నీ జీబు మాటు

                జోడు దీగూడు దివ్వెల కింద

                దిగులు క్రీనీడ నేను

(మంచుబంతి వలె దొర్లి నాలోకి, నదీహృదిలా పొర్లిన నిమ్మీకి.)

అభిశప్తుడు


Updated Date - 2021-05-03T06:22:04+05:30 IST