మంచు విపత్తు

ABN , First Publish Date - 2021-02-11T06:39:53+05:30 IST

ఉత్తరాఖండ్‌ విషాదాన్ని మరో హిమాలయన్‌ సునామీగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఎనిమిదేళ్ళ నాటి విధ్వంసంతో పోల్చినప్పుడు స్థాయిలో,...

మంచు విపత్తు

ఉత్తరాఖండ్‌ విషాదాన్ని మరో హిమాలయన్‌ సునామీగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఎనిమిదేళ్ళ నాటి విధ్వంసంతో పోల్చినప్పుడు స్థాయిలో, విస్తృతిలో తేడాలు ఉండివుండవచ్చును కానీ, సందేశం ఒక్కటే. చమోలీ జిల్లా జోషీమఠ్‌ సమీపంలోని నందాదేవి హిమనీనదం నుంచి భారీ మంచుచరియలు నదిలో విరిగిపడటంతో ఒక్కసారిగా వరదపోటెత్తి, మరో రెండు నదులతో కలగలసి జలప్రళయం సమీప ప్రాంతాలను ముంచెత్తింది. రెండు జలవిద్యుత్‌ ప్రాజెక్టులు ధ్వంసం కావడంతోపాటు, డ్యాములు, రోడ్లు, బ్రిడ్జిలు, ఇళ్ళు, ఇతర మౌలిక సదుపాయాలు కొట్టుకుపోయాయి. పవర్‌ ప్రాజెక్టు టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు ఆ భయానకమైన చలిలో, అనేక గంటలపాటు గుండెలోతున చల్లటినీటిలో మునిగి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సివచ్చింది. ప్రాణాలు కోల్పోయినవారు, కనిపించకుండాపోయినవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.


వర్షకాలమైతే కుంభవృష్టితో వరదలు రావడమో, మండువేసవైతే హిమఖండాలు కరిగి ఊళ్లను ముంచెత్తడమో జరుగుతూంటుంది. కానీ, ఆదివారం దుర్ఘటన గట్టి చలికాలంలో జరిగింది. ఆ ఎత్తయిన కొండల్లో క్లౌడ్‌బరస్ట్‌ జరిగివుండవచ్చునన్న అనుమానాలూ లేకపోలేదు కానీ, వర్షంకంటే మంచుఫలకాలు వాటికవి కరిగి జారడమే ఈ దుర్ఘటనకు కారణమన్న వాదనే ఎక్కువబలంగా వినిపిస్తున్నది. ఒకప్పుడు మంచుఫలకాలు మైనస్‌ ఆరునుంచి ఇరవైడిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ఉండేవనీ, ఇప్పుడవి మైనస్‌ రెండు నుంచి పదిడిగ్రీల మధ్య ఉంటున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. భూతాపం ప్రభావంతో తీవ్రమైన చల్లదనాన్ని క్రమంగా కోల్పోతున్న మంచుకొండలు సులువుగా కరుగుతున్నాయి, ఏ చిన్నకారణం దొరికినా పట్టుజారుతున్నాయి. హిమఖండాలు నెమ్మదిగా కరుగుతూ, హిమనీనదాల్లోకి క్రమంగా నీరుచేరడం ప్రకృతి సహజసిద్ధమైన ప్రక్రియ. వాతావరణమార్పు ఆ క్రమాన్ని దెబ్బతీసింది. హిమాలయాలు అధికంగా కరుగుతున్నాయి. దీనికితోడు, మానవ కార్యకలాపాలు, ప్రాజెక్టు నిర్మాణాలకోసం ఉద్దేశించిన భారీపేలుళ్ళు వీటి పటిష్ఠతను దెబ్బతీస్తున్నాయి. మానవ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయిన లాక్‌డౌన్‌ కాలంలో ప్రకృతి ఎంతగా కోలుకున్నదో చూసి మురిసిపోయాం. ఇప్పుడు అదే కంటితో ఉత్తరాఖండ్‌ విలయాన్ని చూస్తున్నాం.


ఎనిమిదేళ్ళక్రితం ఆరువేలమంది ప్రాణాలు బలితీసుకున్న విషాదం తరువాత హిమాలయ సానువుల్లో సాగే అభివృద్ధి మీద తీవ్ర చర్చ జరిగింది. గంగ, దాని ఉపనదులమీద వరుసగా కడుతూ పోతున్న జలవిద్యుత్‌ ప్రాజెక్టులు అక్కడి పర్యావరణ వ్యవస్థని నాశనం చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్ని ప్రాజెక్టులున్నా, మరిన్ని అనుమతించాల్సిందిగా అక్కడి ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూనే ఉంటుంది. అది సంకల్పించిన స్థాయిలో జలవిద్యుత్‌ప్రాజెక్టుల నిర్మాణం కనుక సాగితే ప్రతీ ముప్పైకిలోమీటర్లకు ఒకటి తయారవుతుందట. అత్యంత సున్నితమైన ఈ ప్రాంతాల్లో జరిగే అభివృద్ధిని శాస్త్రవేత్తల సలహాతో నిర్థారించాలన్న ఇంగితం ప్రభుత్వాలకు లేకపోయింది. కాంట్రాక్టర్లు రాజకీయనాయకుల లాలూచీ వల్ల అవసరం ఉన్నా లేకున్నా భారీ ప్రాజెక్టులు తయారవుతూనే ఉన్నాయి. ఉత్తరాఖండ్‌ ఉదంతం ప్రకృతితో మనం అమానుషంగా వ్యవహరిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తున్నది. మానవుడు అభివృద్ధి పేరిట సాగిస్తున్న విధ్వంసానికి ప్రకృతి ఇలా ప్రతీకారం తీర్చుకుంది. భయతోనో, బాధ్యతతోనో దానితో సయోధ్య సాధించాల్సిందే. ఈ ప్రాంతంలో ప్రాజెక్టులను కుదించడం, అక్రమనిర్మాణాలను అరికట్టడం ద్వారా విధ్వంసాన్ని పరిమితం చేయడం అత్యవశ్యకం.

Updated Date - 2021-02-11T06:39:53+05:30 IST