‘లొకేషన్‌’ను పసిగట్టి.. పగ తీర్చుకుని..

ABN , First Publish Date - 2022-05-09T08:53:45+05:30 IST

మతాంతర వివాహం చేసుకున్న దళిత యువకుడు నాగరాజు హత్య కేసు దర్యాప్తులో పోలీసులకు కొత్త ట్విస్ట్‌ కనిపించింది.

‘లొకేషన్‌’ను పసిగట్టి.. పగ తీర్చుకుని..

  • నాగరాజు హత్యలో సాంకేతికత వాడిన మొబిన్‌
  • ఫైండ్‌ మై డివైజ్‌ ఆధారంగా లొకేషన్‌ గుర్తింపు
  • నెల రెక్కీ.. రంజాన్‌ తర్వాత పన్నాగం అమలు: పోలీసులు
  • సమగ్ర విచారణకు గవర్నర్‌కు బీజేపీ నేతల వినతి
  • పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా హస్తం ఉంది
  • నిందితులకు ఓల్డ్‌ సిటీ నుంచి సమాచారం: రాజాసింగ్‌


హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, వికారాబాద్‌/మర్పల్లి/ధారూరు, మే 8(ఆంధ్రజ్యోతి): మతాంతర వివాహం చేసుకున్న దళిత యువకుడు నాగరాజు హత్య కేసు దర్యాప్తులో పోలీసులకు కొత్త ట్విస్ట్‌ కనిపించింది. తన చెల్లి అశ్రీన్‌ సుల్తానాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజును ఎలాగైనా చంపాలని కక్ష పెంచుకున్న మొబిన్‌.. ఇందుకోసం సాంకేతికతను వాడినట్లు తెలుసుకున్నారు. ముందుగా కొంతమంది స్నేహితుల సాయంతో నాగరాజు మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తెలుసుకున్న మొబిన్‌ ఈ మేరకు తన కుట్రను అమల్లో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నాగరాజు మొబైల్‌ ఫోన్‌లో.. ‘‘ఫైండ్‌ మై డివైజ్‌’’ ఆప్షన్‌ను ఆన్‌ చేసి దాని ద్వారా మొబిన్‌ తన ఫోన్‌కు లింకు కలిపి నాగరాజు లొకేషన్‌ను ట్రాక్‌ చేసినట్లు పోలీసులు గమనించారు. రంజాన్‌ మాసం ప్రారంభంలోనే మొబిన్‌ ట్రాకింగ్‌ ప్రారంభించాడు. నెల రోజుల పాటు నాగరాజు ఎక్కడకు వెళ్తున్నది? ఎప్పుడు వెళ్తున్నది పసిగట్టాడు. ఆమేరకు రెక్కీ నిర్వహించి రంజాన్‌ ముగిసిన వెంటనే హత్యకు ప్రణాళిక వేశాడు. అదే క్రమంలో గత బుధవారం రాత్రి లొకేషన్‌ను బట్టి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని వారు తెలిపారు. నాగరాజును హత్య చేసింది ఇద్దరేనని, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వారిని పట్టుకున్నామని వెల్లడించారు.  


విచారణకు గవర్నర్‌కు బీజేపీ వినతి

నాగరాజు దారుణ హత్యపై సమగ్ర విచారణ కోసం డీజీపీని ఆదేశించాలని బీజేపీ నాయకులు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కోరారు. ఈనెల 4న హత్య జరిగినా పోలీసులు కంటితుడుపు చర్యలు తీసుకున్నారని, వారి వైఖరి ఒక వర్గానికి మద్ధతు ఇచ్చేలా ఉందని ఆరోపించారు. మాజీ ఎంపీ వివేక్‌, బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా తదితరులు ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు.  


సీబీఐ విచారణ జరపాలి: రాజాసింగ్‌

నాగరాజు హత్యపై సీబీఐ విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు.  నాగరాజు కుటుంబాన్ని ఆదివారం వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో ఆయన పరామర్శించి విలేకరులతో మాట్లాడారు. ఇద్దరు నిందితులను ఎవరు దాచిపెడుతున్నారో తెలియాలని.. దీనివెనుక రాజకీయ నేతలు ఉన్నారా! అనేది తేలాలన్నారు. నిందితులకు హైదరాబాద్‌ పాతబస్తీలో కొందరు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోందని, హంతకుల వెంట పీఎ్‌ఫఐ (పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా) కార్యకర్తలు ఉన్నారని అన్నారు. ‘‘దేశంలోని పలు ప్రాంతాల్లో లవ్‌ జిహాద్‌ పేరుతో హిందువుల అమ్మాయిలను ముస్లింలు పెళ్లి చేసుకుంటున్నా హిందువులు ఏమీ చేయట్లేదు. వాళ్లలాగా అందరూ అలోచిస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో తెలుస్తుంది. హిందువులు అలా చేయడం లేదు. వారికీ.. మనకు అదే తేడా’’ అని రాజాసింగ్‌ అన్నారు. కాగా, ప్రభుత్వ నిర్లక్ష్యమే నాగరాజు హత్యకు కారణమని రిటైర్డ్‌ ఐఏఎస్‌, సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం కన్వీనర్‌ ఆకునూరి మురళి ఆరోపించారు. మర్పల్లిలో ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నాగరాజు భార్య ఆశ్రీన్‌తో మాట్లాడారు.

Read more