Jul 26 2021 @ 20:50PM

29న సినీ నటితో ఆ గేయ రచయిత పెళ్లి

కోలీవుడ్‌ సినీ గేయ రచయిత స్నేహన్‌ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ నెల 29వ తేదీన మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌ హాసన్‌ సమక్షంలో సినీ నటి కనికను ఈయన పెళ్ళిచేసుకోనున్నారు. ఈ విషయాన్ని స్నేహన్‌ ఆదివారం అధికారికంగా వెల్లడించారు. స్నేహన్‌ సినీ రచయితగానే కాకుండా ఎంఎన్‌ఎం యువజన విభాగం కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విరుగంబాక్కం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఇదిలావుంటే, సినీ నటి కనిక రవితో స్నేహన్‌ గత కొన్నేళ్ళుగా ప్రేమలో మునిగితేలుతున్నారు. 


ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చిన ‘దేవరాట్టం’ అనే చిత్రంలో కనిక నటించింది. ఆ చిత్రం షూటింగ్‌ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో వారే కూర్చొని వీరిద్దరికి వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో ఈనెల 29వ తేదీ గురువారం వడళనిలోని గ్రీన్‌పార్క్‌ హోటల్‌లో ఉదయం 10.45 గంటలకు వీరి పెళ్లి జరుగనుంది. ఈ పెళ్లిని సినీనటుడు కమల్‌ హాసన్‌ దగ్గరుండి జరిపించనున్నారు. ఈ పెళ్ళి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు ఎంఎన్‌ఎం కీలక నేతలు మాత్రమే హాజరుకానున్నారు. 

Otherwoodsమరిన్ని...