ఆరు చోట్లా అతడే..!

ABN , First Publish Date - 2022-01-20T16:24:13+05:30 IST

రెండేళ్లుగా గొలుసు దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి. స్నాచింగ్‌లు జరిగినా గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకుంటున్నారు.

ఆరు చోట్లా అతడే..!

నగరంలో రెచ్చిపోయిన గొలుసు దొంగ

ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకు వరుస స్నాచింగ్‌లు 

ట్రై కమిషనరేట్స్‌లో 6 స్నాచింగ్‌లు

లోకల్‌ దొంగగా పోలీసుల అనుమానం 

రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు


హైదరాబాద్‌ సిటీ/పేట్‌బషీరాబాద్‌/అడ్డగుట్ట/పీర్జాదిగూడ/మారేడ్‌పల్లి జనవరి 19(ఆంధ్రజ్యోతి): రెండేళ్లుగా గొలుసు దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి. స్నాచింగ్‌లు జరిగినా గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకుంటున్నారు. అలాంటిది బుధవారం నగరంలో ఒకేఒక్క గొలుసుదొంగ రెచ్చిపోయాడు. ట్రై కమిషనరేట్‌ పరిధిలో గంటల వ్యవధిలోనే ఆరు చైన్‌ స్నాచింగ్‌లు చేశాడు. ఒకేరోజు ఇన్ని గొలుసు దొంగతనాలు జరగడం హాట్‌టాపిక్‌గా మారింది. ఒక్కసారిగా బరితెగించిన స్నాచర్‌ సైబరాబాద్‌లో 3, హైదరాబాద్‌లో-2, రాచకొండలో-1 చొప్పున మొత్తం ఆరు గొలుసులను చోరీ చేశాడు. ఒక్కటి మినహా ఐదు చోరీల్లో 18 తులాల విలువైన ఐదు పుస్తెలతాళ్లను తెంపుకెళ్లాడు. అన్ని స్నాచింగ్‌ల్లోనూ గొలుసు దొంగ యాక్టివా బైక్‌ను ఉపయోగించడం గమనార్హం.  


మారేడ్‌పల్లిలో మొదలు..

హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని మారేడ్‌పల్లిపోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉదయం 10.30 గంటలకు చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. ఇందిరా రైల్వే కాలనీ వద్ద  యాక్టివాపై వచ్చిన దుండగుడు నడుచుకుంటూ వెళుతున్న విజయ అనే మహిళ మెడలోనుంచి 5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. స్నాచింగ్‌ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.  


గంటలో మూడు స్నాచింగ్స్‌

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో గొలుసు దొంగ కేవలం గంట వ్యవధిలోనే మూడు వరుస చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడి కలకలం సృష్టించాడు.  ఉదయం 11.50గంటలకు కుత్బుల్లాపూర్‌ భాగ్యలక్ష్మి కాలనీలో నడుచుకుంటూ వెళుతున్న ఉమారాణి (37) మెడలోనుంచి బంగారు గొలుసును యాక్టివాపై వచ్చిన దొంగ దొంగలించేందుకు యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో నిందితుడు వదిలేసి పారిపోయాడు.


అక్కడి నుంచి సుచిత్ర సమీపంలోని రాఘవేంద్ర కాలనీకి చేరుకున్న దొంగ మధ్యా హ్నం 12.15గంటలకు ఇంటి ముందు కూరగాయలు కొనుగోలు చేస్తున్న టి.అనురాధ (53) మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోయాడు. 

ఇది జరిగిన అరగంటకు 12.45 సమయంలో జీడిమెట్లలో గుడి నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న వరలక్ష్మి (58)మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును వెనకనుంచి యాక్టివాపై వచ్చిన దొంగ తెంపుకొని పారిపోయాడు.  


తుకారాంగేట్‌కు చెందిన రాంబాయి అనే వృద్ధురాలు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో తన మనుమరాలితో కలిసి అడ్డగుట్ట సమోసా గార్డెన్‌ మీదుగా నడుచుకుంటూ వెళ్తుండగా యాక్టివాపై వచ్చిన వ్యక్తి ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల మంగళసూత్రం లాక్కొని పారిపోయాడు. కొద్ది క్షణాలకు తేరుకున్న బాధితురాలు తుకారాంగేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బైక్‌పై ఇద్దరున్నట్లు ఆమె పేర్కొంది. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు స్నాచర్ల కోసం గాలిస్తున్నారు.


రాచకొండ కమిషనరేట్‌లోని బోడుప్పల్‌ ఈస్ట్‌ హనుమాన్‌నగర్‌లో సాయంత్రం 4.30గంటలకు చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. ఈస్ట్‌ హనుమాన్‌నగర్‌ నుంచి హుడా లక్ష్మీనగర్‌వైపు వాకింగ్‌కు వెళుతున్న కట్ట అంజమ్మ (50) మెడలోని మంగళ సూత్రాన్ని యాక్టివాపై వచ్చిన దుండగుడు లాక్కెళ్లాడు. దీంతో ఆమె మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

Updated Date - 2022-01-20T16:24:13+05:30 IST