బాన్స్‌వాడ: రాజస్థాన్‌లోని బన్స్‌వాడలోగల మందారేశ్వర్ మహాదేవ్ మందిరంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. శివభక్తుడైన జయ్ ఉపాధ్యాయ్ కొంతకాలంగా శివాలయంలో నిద్రిస్తున్నాడు. ఈ నేపధ్యంలో జరిగిన ఒక ఘటనతో అతనికి ప్రాణాలు పోయినంత పనయ్యింది.
వివరాల్లోకి వెళితే నేషనల్ హైవే విభాగంలో ఐసీటీ మేనేజర్‌గా పనిచేస్తున్న జయ్ ఉపాధ్యాయ్ తాను చేపట్టిన దీక్షలో భాగంగా కొద్ది రోజులుగా ఆలయంలో రాత్రివేళ నిద్రిస్తున్నాడు. తాజాగా జయ్ ఉపాధ్యాయ్ నిద్రిస్తున్న సమయంలో అతను కప్పుకున్న దుప్పటిలోకి ఒక భారీ పాము దూరింది. బుసలు కొడుతూ అతనికి మరింత దగ్గరగా వచ్చింది. దీంతో వెంటనే జయ్ ఉపాధ్యాయ్ లేచి నిలుచున్నాడు. ఈ ఘటన గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాము తన దగ్గరకు వచ్చినప్పటికీ, తనకు ఎటువంటి హానీ చేయలేదని తెలిపారు. దీనిని భగవంతుని లీలగా భావిస్తున్నానని తెలిపారు. ఈ ఘటన ఆలయంలోని సీసీటీవీలో రికార్డయ్యింది.