బుసకొడుతున్నాయ్‌..జర జాగ్రత్త!

ABN , First Publish Date - 2022-06-29T05:57:56+05:30 IST

బుసకొడుతున్నాయ్‌..జర జాగ్రత్త!

బుసకొడుతున్నాయ్‌..జర జాగ్రత్త!

వర్షాకాలం ఆరంభంలోనే పలువురికి పాముకాట్లు..
రాచన్నగూడెంలో బాలుడి మృతి.. జంగారెడ్డిగూడెంలో నలుగురికి చికిత్స
రెండు రోజుల్లో  వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలు

జంగారెడ్డిగూడెం/జీలుగుమిల్లి, జూన్‌ 28: వర్షాకాలం ఆరంభంలోనే పాములు బుసలు కొడుతున్నాయి. తుప్పలు, కట్టెలు, పడిపోయిన గోడలు, కట్టడాలు, పాడుబడిన ఇళ్లను స్థావ రాలుగా మార్చుకుని పలువురిని కాటేస్తున్నాయి. జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాల్లో రెండు రోజుల్లో వేర్వేరు ప్రాంతాల్లో పలువురిని కాటేశాయి. ఓ బాలుడు మృతి చెందగా.. నలుగురు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు. సకాలంలో వైద్యం అందక, అవగాహన లోపం, భయంతోనే అత్యధింగా మృతి చెందుతున్నట్టు నిపుణులు చెబు తున్నారు. ఈ ప్రాంతంలో సంచరించే వాటిలో అత్యంత ప్రమాదకరమైనవి కట్లపాము, పొడపాము, తాచుపాము, రక్తపింజర.. ఈ మధ్య కాలంలో పశ్చిమ ఏజెన్సీలో మరింత విషపూరిత కింగ్‌ కోబ్రా కన్పించింది. బుట్టాయిగూడెం మండల పరిసర ప్రాంతాల్లో రెండు కింగ్‌కోబ్రాలను స్థానిక గిరిజనులు హతమార్చారు.
పశ్చిమ మన్యంలో ప్రమాదకర జాతులు
ప్రమాదకర విషసర్పాలు పొడపాము, పిచ్చుకపొడ, పింజర, రక్త పింజర, నల్ల తాచు, కట్లపాము, గిరినాగు, మిన్నాగు వంటి రకాలు పశ్చిమ మన్యంలో సంచ రిస్తుంటాయి. వర్షాకాలంలో వరదలకు కొండ ప్రాంతం నుంచి కొండ చిలువలు కొట్టు కొచ్చి పిల్లకాలువలు, చెరువుల్ని ఆవాసంగా చేసుకుంటాయి. జీలుగుమిల్లి మండ లంలోని రాచన్నగూడెం, జీలుగుమిల్లి, కామయ్యపాలెం పీహెచ్‌సీల పరిధిలో ఏడాది లో 25 పాముకాటు కేసులు అధికారికంగా నమోదయ్యాయి.
పొలాల్లో జాగ్రత్త..!
 పొలం గట్లపై ఎలుకల కోసం పాములు మాటు వేస్తాయి. గట్లపై నడిచే వారు చేతిలో కర్ర, భుజంపై కండువా తప్పకుండా ఉంచుకోవాలి. కర్ర చప్పుడు చేసుకుం టూ వెళ్తే పాములున్నా పారిపోతాయి. తాచుపాము పడగ విప్పి బుసలు కొడుతూ వస్తే భుజంపై ఉన్న కండువా పాముపై వేస్తే దాని కోపం కండువాపై చూపుతూ కాటేస్తుంది. ఈ సమయంలో దాని నుంచి తప్పించుకోవచ్చు.
రాత్రి సమయంలో ఇబ్బందులు
గిరిజన ప్రాంతంలో పగటి పూట పాముకాటుకు గురైతే పీహెచ్‌సీల్లో వైద్యం అందుతోంది. రాత్రి సమయంలో కామయ్యపాలెం, రాచన్నగూడెం పీహెచ్‌సీలు మూసి ఉండటంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. సరైన సమయంలో వైద్యం అందక, కొన్ని చోట్ల సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు.
నాటు వైద్యులను ఆశ్రయిస్తూ..
గిరిజన గ్రామాల్లో పూర్వం నుంచి నాటు మందుకు అలవాటు పడిన కొందరు పాముకాటుకు ఆస్పత్రిలో అత్యవసర వైద్యం పొందినా అనంతరం నాటువెద్యులను ఆశ్రయిస్తున్నారు.
గుర్తించడమిలా..
రెండు గాట్లు ఉంటే విషపూరితమైన పాము అని గుర్తించాలి. విషమున్న పాములకు తోక సూ దిగా, విషం లేని సర్పాల తోక మొదలి భాగం గుండ్రంగా ఉంటుంది. కాలుపై కాటు వేస్తే కంగారు పడి పరుగులు తీయకూడదు. ఒత్తిడికి లోనై రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది. తక్కువ సమయంలోనే శరీరం అంతా విషం పాకుతుంది. మోచేయి కింద భాగంలో పాము కరిస్తే చేతిని వీ ఆకారంలో పెట్టడం వలన విషం పాకదు. పాము కరిచిన చోట నోటితో విషాన్ని లాగితే లాగిన వారికీ ప్రమాదమే. కరిచిన చోట తాడు, వస్త్రంతో  కట్టకూడదు. మంచినీరు, సెలైన్‌ నీటితో కాటు వేసిన ప్రాంతాన్ని శుభ్రంగా కడగాలి. వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లాలి.
లక్షణాలు..!
విష సర్పాలు కరిస్తే విషం నరా ల్లోకి ప్రవేశిస్తుంది. తల తిరగడం, కంటి చూపు మందగించడం, నోటి నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బ ందులు, నోటి వెంట నురుగు వస్తుంది. రక్త పింజర కరిస్తే కాటు వేసిన భాగం నుంచి 5 నుంచి 10 నిమిషాల పాటు రక్తం కారుతుంది. పంటి చిగుర్ల నుంచి రక్తం కారడం, మూత్రం ఎర్రగా రావడం, కాలు వాచిపోవడం జరుగుతుంది. పాము లాలాజలంతో ధనుర్వాతం వస్తుంది టీటీ ఇంజెక్షన్‌ చేయించాలి. తాగడం, తినడం చేయకూడదు.
అందుబాటులో ఏఎస్వీ
పాముకాటుకు ఏఎస్వీనే (యాంటీ స్నేక్‌ వీనమ్‌) మం దు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. కావలసిన వారు వినియోగిం చుకోవాలని పీహెచ్‌సీల వైద్యులు చెబుతున్నారు.

విషపూరితమో..కాదో నిర్ధారించుకోండి
ప్రాణహాని భయంతోనే పాములు కరుస్తాయి. విషపూరితమో కాదో.. గాయాల ద్వారా నిర్ధారించుకోవాలి. పరుగు తీయకుండా, ఎక్కువగా నడవకుండా త్వరగా ఆస్పత్రికి చేర్చాలి. పరుగులు తీసినా, ఒత్తిడికి గురైనా రక్త ప్రసరణ జరిగి త్వరగా విషం శరీరమంతా పాకుతుంది. విషసర్పాలు కన్పిస్తే వాటి జోలికెళ్లకుండా స్నేక్‌ సేవియర్‌ సొసైటీ నంబర్‌ 91331 27327కు సమాచారమివ్వండి.
– చదలవాడ క్రాంతి, స్నేక్‌ సేవియర్‌ సొసైటీ, జంగారెడ్డిగూడెం


 జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామానికి చెందిన తాడిచర్ల మహేష్‌ చిన్న కుమారుడు విశాల్‌(2) ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా తాచుపాము కాలును చుట్టేసి కాటేసింది. తల్లి కేకలు వేయగా స్థానికులు పామును హతమార్చారు. బాలుడిని అశ్వా రావుపేటలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

 జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురానికి చెందిన కొత్లపల్లి దుర్గమ్మ మంగళవారం ఉదయం వంట చేద్దామని బియ్యం కడిగి గిన్నెలో వేసి కట్టెల పొయ్యి వద్దకు వెళ్లింది. పొయ్యిలో ఉన్న బూడిద తీసి పక్కనే ఉన్న కట్టెను పొయ్యిలో పెట్టింది. మరో కట్టె తీస్తుండగా కట్టెల్లో ఉన్న కట్లపాము చేతిపై కాటేసింది. దీంతో ఆమెను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామానికి చెందిన వంజం గంగమ్మ పొలం పనులు చేస్తుండగా పొడపాము చేతిపై కాటేసింది. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 బుట్టాయిగూడెం మండలం ముం జూరుకు చెందిన నడపల జనార్ధనరెడ్డి ఆదివారం ఇంటిలోకి వెళ్తుండగా గుమ్మం వద్ద ఉన్న కట్లపాము కాటేసింది.  జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 

ఇంటి వద్దే పనులు చేస్తున్న సమయంలో పుల్లల వద్ద ఉన్న పామును గమనించకపోవడంతో బుట్టాయి గూడేనికి చెందిన వై.కనకదుర్గను పాముకాటేసింది. ఆమె జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Updated Date - 2022-06-29T05:57:56+05:30 IST