సరిహద్దుల్లో.. ఇసుకాసురులు!

ABN , First Publish Date - 2020-05-31T10:24:56+05:30 IST

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో అక్రమార్కులు ఇసుకను కొల్లగొడుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఉపాధి హామీ పనుల నెపంతో పెద్దఎత్తున ఇసుక నిల్వలను సేకరించారు. నదీ గర్భంలో నిబంధనలకు విరుద్ధంగా

సరిహద్దుల్లో.. ఇసుకాసురులు!

  • అక్రమ రవాణాపై మాఫియా దృష్టి
  • ఉపాధిహామీ పనుల నెపంతో దందా
  • పట్టించుకోని మైనింగ్‌, రెవెన్యూ శాఖలు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో అక్రమార్కులు ఇసుకను కొల్లగొడుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఉపాధి హామీ పనుల నెపంతో పెద్దఎత్తున ఇసుక నిల్వలను సేకరించారు. నదీ గర్భంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వేశారు. రహస్య ప్రదేశాలలో నిల్వ చేసి.. రాత్రి వేళల్లో విశాఖ, ఒడిశా ప్రాంతాలకు అక్రమ రవాణా సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెండు నెలలుగా మూతపడిన ఇసుక ర్యాంపులను అధికారులు ఇటీవల మళ్లీ ప్రారంభించారు. ‘నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన పనులకు, పేదల గృహ నిర్మాణాల కోసం ఇసుక అనుమతులు ఇస్తున్నారు. ఇదే అదనుగా అక్రమార్కులు సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఒడిశా సరిహద్దు మండలాల్లోని పలు గ్రామాల్లో ఇసుక తవ్వకాలకు తెరలేపారు. ఇప్పటికే 600 టన్నులకు పైగా ఇసుకను లారీల్లో యథేచ్ఛగా విశాఖ, ఒడిశాలోని ముఖ్య పట్టణాలకు తరలించుకుపోయినట్లు సమాచారం.


కేవలం నాడు-నేడు పనులకు మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వగా, ఉపాధిహామీ పనుల మాటున టన్నుల కొద్దీ ఇసుక నిల్వలను పక్కదారి పట్టిస్తున్నారు. అధికారులు, పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. భామిని మండలం తాలాడ, కొత్తూరు మండలం అంగూరుతో పాటు నరసన్నపేట, వీరఘట్టం మండలాల్లో స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి ఇసుక పక్కదారి పట్టిస్తున్నారు. వాస్తవానికి వీరఘట్టం, సీతంపేట, భామిని, కొత్తూరు, మెళియాపుట్టి, హిరమండలం పరిధిలో 39 మట్టి రహదారులు, 72 తారురోడ్ల పనులు మార్చి 3 వరకు చేపట్టారు. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 22 నుంచి ఈ పనులు నిలిపివేశారు. ఈ పనుల కోసం 5,50,089 టన్నుల ఇసుక అవసరమని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఈ పనులు చేపట్టకపోయినా.. చేపడుతున్నట్టు సుమారు పది వేల టన్నుల ఇసుక నిల్వలు ఇప్పటికే తోడేసినట్లు సమాచారం. పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీర్లు ఇచ్చే స్లిప్పుల ఆధారంగా ఇసుక స్టాక్‌ పాయింట్‌ నుంచి రవాణా చేయాలి.  ప్రభుత్వ ధర ప్రకారం టన్ను ఇసుక రూ.376 ఉండగా, అక్రమార్కులు మాత్రం రూ.1200 వరకు విక్రయిస్తున్నారు.


సరుబుజ్జిలి పురుషోత్తపురం ఇసుక ర్యాంపు నుంచి నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతోంది. ఇటీవల మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. స్థానిక నాయకులు కొందరు అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న విషయం బయటకు పొక్కడంతో మూడు ట్రాక్టర్లను సీజ్‌ చేసి ఆమదాలవలస పోలీసు స్టేషన్‌కు తరలించారు. నామమాత్రపు అపరాధ రుసుము వేసి,  వాటిని వదిలేయాలని అధికార పార్టీ నాయకులు కొందరు తీవ్ర ఒత్తిడి  తెస్తున్నట్లు తెలుస్తోంది. 


పాత బిల్లులతో మస్కా...

పట్టా భూముల్లో ఇసుక సేకరణ చేస్తున్నట్టు చెబుతున్న కొందరు వ్యాపారులు తాలాడ, అన్నవరం, అంగూరులలో నదీ గర్భంలోనే తవ్వకాలు చేస్తున్నారు. సీతంపేట, భామిని నుంచి రాత్రి పూట ఇసుక లారీలు అక్రమంగా విశాఖ వైపు వెళుతున్నాయి. గతంలో పొందిన పాత బిల్లులనే పోలీసులకు చూపుతూ.. కొంత ముడుపులు చెల్లిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెళియాపుట్టి, భామిని ప్రాంతాల నుంచి ఒడిశా రాష్ట్రానికి కూడా ఇసుక తరలి పోతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నా.. మైనింగ్‌ అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2020-05-31T10:24:56+05:30 IST