తెలంగాణ టు కడప మద్యం బాట..!

ABN , First Publish Date - 2020-06-02T11:01:24+05:30 IST

పెరిగిన మద్యం ధరలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. నిఘా కళ్లకు చిక్కకుండా అక్రమంగా తెలంగాణ మద్యం

తెలంగాణ టు కడప మద్యం బాట..!

నిఘా కళ్లుగప్పి అక్రమంగా మద్యం రవాణా

తెలంగాణతో పోలిస్తే ఇక్కడ రెట్టింపు ధరలే కారణం


కడప, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పెరిగిన మద్యం ధరలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. నిఘా కళ్లకు చిక్కకుండా అక్రమంగా తెలంగాణ మద్యం జిల్లాకు తెచ్చి ఎక్కువ ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణ మద్యం ధరలతో పోలిస్తే ఇక్కడ రెట్టింపు ధరలు ఉండడం.. కావాల్సిన బ్రాండ్‌ మద్యం దొరకకపోవడంతో అక్రమార్కులకు తెలంగాణ మద్యం ఆదాయ వనరుగా మారింది. ఆ వివరాలిలా..


జిల్లాలో 255 మద్యం దుకాణాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దశల వారీగా మద్య నిషేధంలో భాగంగా 179 షాపులకు కుదించారు. లాక్‌డౌన్‌ తరువాత 131 షాపులు మాత్రమే ఓపెన్‌ చేశారు. లాక్‌డౌన్‌కు ముందు అన్ని షాపులు కలిపి రోజుకు రూ.1.50 కోట్ల మద్యం విక్రయాలు జరిగితే.. లాక్‌డౌన్‌ తరువాత 75 శాతం మద్యం ధర పెంచడంతో రోజూ వ్యాపారం రూ.2.50 కోట్లు జరుగుతోంది. అయితే.. మందుబాబులకు కావాల్సిన బ్రాండ్లు అందుబాటులో లేవు.


తెలంగాణ నుంచి అక్రమంగా...

జిల్లాలో మాన్సన్‌హౌస్‌, మాక్డోల్‌ విస్కీ, రాయల్‌ స్టాగ్‌, బ్లెండర్స్‌ ప్రైడ్‌.. వంటి బ్రాండెడ్‌ మద్యం తగినంత అందుబాటులో లేదు. దీనికి తోడు తెలంగాణకు ఇక్కడికి ధరల్లో రెట్టింపు తేడా ఉంది. దీంతో అక్రమార్కులు అడ్డదారుల్లో తెలంగాణ మద్యం తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. జిల్లాకు చెందిన కొందరు అక్రమార్కులు కర్నూలు దగ్గర తుంగభద్ర నది దాటి కావాల్సిన మద్యం తెచ్చి నిఘా కళ్లకు చిక్కకుండా బ్రాండెడ్‌ మద్యాన్ని విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గత నెల 18వ తేదీన తెలంగాణ నుంచి ఏపీ 39 టీఎఫ్‌ 5000 నెంబరు టాటా ఏస్‌ వాహనం చిన్న పిల్లల ఆహార వస్తువులతో బయలుదేరింది. కర్నూలు దగ్గర రాష్ట్ర సరిహద్దు దాటి ఏపీలోకి వస్తుండగా కర్నూలు ఎక్సైజ్‌ చెక్‌పోస్టు పోలీసులు తనిఖీ చేస్తే పిల్లల ఆహార వస్తువుల మధ్యలో ఎంసీ విస్కీ ఫుల్‌ బాటల్‌ 2, డౌన్‌టౌన్‌ విస్కీ 2, మాన్సన్‌హౌస్‌ ఫుల్‌ బాటల్స్‌ 2, మాక్డోల్‌ విస్కీ హాఫ్‌ బాటిల్స్‌ 12, మాన్సన్‌ హౌస్‌ నాలుగు హాఫ్‌ బాటిల్స్‌ గుర్తించారు. ఈ మద్యాన్ని జిల్లాలోని ఖాజీపేట, కడపకు తీసుకువస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. గతంలో కడపలో కూడా తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 


సెబ్‌ రాకతో ..

మద్యం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో (సెబ్‌)ను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకు అడిషనల్‌ ఎస్పీని నియమించింది. జిల్లాకు సెబ్‌ అడిషనల్‌ ఎస్పీగా కడియం చక్రవర్తి ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టగానే ఇసుక, మద్యం అక్రమ రవాణా, నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు చేస్తున్నారు. అక్రమార్కుల్లో కొంత అలజడి మొదలైంది. తెలంగాణ మద్యం జిల్లాకు రాకుండా నిరోధించేందుకు జిల్లా సరిహద్దుల్లో పక్కా నిఘా, తనిఖీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం రాకపై సెబ్‌ ఏఎస్పీని ఆంధ్రజ్యోతి విరణ కోరగా.. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం వస్తున్నట్లు సమాచారం ఉందని, కర్నూలు జిల్లా సరిహద్దుల్లో పక్కా నిఘా ఉంచామని చెప్పారు. ఎవరినీ ఉపేక్షించే పరిస్థితి లేదని, మద్యం అక్రమ రవాణాకు కళ్లెం వేసేందుకు సెబ్‌ అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని అన్నారు.


ఏపీ, తెలంగాణలలో ప్రధాన బ్రాండ్ల మద్యం ధరలు రూ.లలో 

బ్రాండ్‌ హాఫ్‌ బాటిల్‌ ఫుల్‌బాటిల్‌

తెలంగాణ ఏపీ తెలంగాణ ఏపీ

మాన్సన్‌ హౌస్‌ 330 700 650 1400

ఎంసీ విస్కీ 330 640 660 1280

బ్లెండర్స్‌ ప్రైడ్‌ 600 960 1200 2000


Updated Date - 2020-06-02T11:01:24+05:30 IST