Smriti Mandhana: స్మృతి మెరుపు అర్ధ సెంచరీ.. ఇంగ్లండ్ ఎదుట భారీ స్కోరు

ABN , First Publish Date - 2022-08-06T22:38:02+05:30 IST

కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌లో భారత్ చెలరేగిపోయింది. నిర్ణీత

Smriti Mandhana: స్మృతి మెరుపు అర్ధ సెంచరీ.. ఇంగ్లండ్ ఎదుట భారీ స్కోరు

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌లో భారత్ చెలరేగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి ఇంగ్లండ్‌ మహిళలకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హర్మన్‌ప్రీత్ నిర్ణయం సరైనదేనని ఓపెనర్ స్మృతి మంధాన నిరూపించింది. క్రీజులోకి అడుగుపెడుతూనే వీరవిహారం చేసింది.


ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ బంతిని నలువైపులా బాదింది. ఆమె దెబ్బకు ఇంగ్లండ్ బౌలర్లు ప్రేక్షకుల్లా మారిపోయారు. బౌండరీలు దాటుతున్న బంతులను తెచ్చి ఇచ్చేందుకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. టీ20ల్లో స్మృతికి ఇది 16వ అర్ధ సెంచరీ. క్రీజులో పాతుకుపోయిన మంధాన, షెఫాలీ వర్మ జోడీని విడగొట్టేందుకు మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.


చివరికి 76 పరుగుల వద్ద షెఫాలీ వర్మ (15) అవుటైంది. ఫ్రెయా కెంప్ బౌలింగ్‌లో బ్రంట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. మంధాన దూకుడుగా ఆడుతుంటే ఆమెకు అండగా నిలిచిన షెఫాలీ అవుటైన తర్వాత మరొక్క పరుగు జోడించాక స్మృతి మంధాన కూడా అవుటైంది. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న మంధాన 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసింది.


మంధాన వేసిన పునాది కూలిపోకుండా జెమీమా రోడ్రిగ్స్ కాపాడింది. 31 బంతులు ఆడిన జెమీమా 7 ఫోర్లతో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 20, దీప్తి శర్మ 22 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

Updated Date - 2022-08-06T22:38:02+05:30 IST