వాసనాక్షయం

ABN , First Publish Date - 2020-10-14T06:59:38+05:30 IST

శ్వాస నియంత్రణతో వాసనలు క్రమంగా నశించి, ఆపై మనసూ నశిస్తుంది.

వాసనాక్షయం

శ్వాస నియంత్రణతో వాసనలు క్రమంగా నశించి, ఆపై మనసూ నశిస్తుంది. మనసనే విషయ వృక్ష మూలాలను, విత్తనాలనబడే మూలవాసనలను దహించే ప్రయత్నమే ఆత్మవిచారణ దేనికీ చెదరని, బెదరని దివ్యాస్త్రమే ‘నేను ఎవరు? అన్న విచారణ. 

పాలలో దాగిన మాధుర్యంవలె, ఆత్మవిచారంలోనే విజ్ఞాన, సుజ్ఞాన, ప్రభావాలు దాగి ఉన్నాయి. అవి భౌతిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక స్థితులలో అనుభవంలోకి వస్తాయి. శాస్త్రజ్ఞానం కేవలం విజ్ఞానం మాత్రమే. అది కాలినడక. 


సుజ్ఞానం అంటే విషయావగాహనను తేలిక పరచేది. అది బండి ప్రయాణం. 

ప్రజ్ఞానం అంటే అసలు తెలివి. అది ఆధ్యాత్మిక పయనం. విమాన ప్రయాణంలా వేగవంతమైనది. అన్నిటినీ దాటి, సమున్నతంగా సాగే ప్రయాణం. ఆత్మ నెరిగిన వారికి సృష్టి స్థితి, లయలు, అన్నీ, అంతా, అంతటా కరుణాలయంగా సాక్షాత్కరిస్తుంది. ఆత్మ సాధకుడు అన్ని వేళలా ఆనందమయుడై ఉంటాడు. అతడికి దృశ్య ప్రపంచం, తెరమీద కదిలే బొమ్మవలె ఉంటుంది. 


శ్వాస నియంత్రణ వాసనలు క్రమంగా నశించి, ఆపై మనసూ నశిస్తుంది. మహాత్ములతో సాలోక్య, సామీప్య, సాన్నిధ్య స్థితులు సాయుజ్య భావనను సమృద్ధం చేస్తాయి. దేహాత్మ భావన నశించటమే సాయుఖ్యం. స్థిమిత, సంస్థిత మనసు అజ్ఞానాన్ని జ్ఞానంగా, కాలకూట విషాన్ని అమృతంగా మార్చుకోగలదు. నేను దేహం అనుకున్నంత కాలం అది పరిమిత పరిధి. నేను దేహం మాత్రమే కాదనుకోవటంతోనే ఆత్మవిచారం ప్రారంభమౌతుంది. దేహం స్వప్నావస్థలో సుఖశయ్యపైన కలలుకంటూ.. అసహజ, తాత్కాలిక ఆనందం పొందుతుంది. కల నిజం కాదు కనుక, ఆ ఆనందమూ అశాశ్వతమే. ప్రశాంత చిత్తుడు, సత్యాన్వేషి, ఆత్మ విదారమార్గ పథికుడు అహం వృత్తులను సునాయాసంగా వదుల్చుకుని ఆత్మస్వరూపుడౌతున్నాడు. దాంతో అంతరంగంలో ఆనందాన్ని, సమస్త యోగస్థితిని కైవసం చేసుకున్న ఆత్మారాముడవుతున్నాడు.



- వి.ఎస్.ఆర్‌.మూర్తి

Updated Date - 2020-10-14T06:59:38+05:30 IST