నిధులొచ్చేనా.. శ్మశానం బాగుపడేనా!?

ABN , First Publish Date - 2021-06-17T04:10:44+05:30 IST

జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన శ్మశాన వాటికలు లక్ష్యాలకు దూరంగా నిర్మాణాలు సాగుతున్నాయి.

నిధులొచ్చేనా..  శ్మశానం బాగుపడేనా!?
ఉదయగిరి రూరల్‌: ఉదయగిరి ముస్లిం శ్మశాన వాటికలో అసంపూర్తిగా భవన నిర్మాణం

సా..గుతున్న అభివృద్ధి పనులు

2019లో 22 శ్మశానాలకు ఆరే పూర్తి

గతేడాది 8కి ఒక్కటీ పూర్తికాలేదు!

వేధిస్తున్న నిధుల కొరత 


నెల్లూరు(జడ్పీ), జూన 16 : జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన శ్మశాన వాటికలు లక్ష్యాలకు దూరంగా నిర్మాణాలు సాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో గ్రామాల్లో శ్మశాన వాటికల అభివృద్ధి కలగా మారుతోంది. గ్రామాల్లో శ్మశానాలు లేక అక్కడక్కడ ఉన్న స్థలాలకు దారులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదరవుతున్నాయి. ఎనఆర్‌జీఎస్‌ ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లో శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


ఏళ్ల తరబడి పనులు..


మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2019  -20 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 14.6 కోట్లతో 22 శ్మశాన వాటికల అభివృద్ధికి అనుమతులు వచ్చాయి. దీంతో టెండర్లు పిలిచి పనులను ప్రారంభించారు. అయితే వాటిలో ఇప్పటివరకు కేవలం 6 పనులు పూర్తికాగా మరో 11 పనులు నిర్మాణ దశలోనే కునారిల్లుతున్నాయి. మరో ఐదు పనులు ప్రారంభం కావాల్సి ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.10.5 కోట్లతో 8 శ్మశాన వాటికల నిర్మాణాలకు పరిపాలన ఆమోద ముద్ర పడింది. వీటిలోనూ కేవలం ఒక్క పని మాత్రమే ప్రారంభం కాగా, ఏడు చోట్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో రెండేళ్లుగా శ్మశాన వాటిక పనులు జిల్లాలో నత్తతో పోటీపడుతున్నాయి. అయితే, ఈ పనులకు నిధుల కొరతే కారణమని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. 


త్వరలో పనుల పూర్తికి చర్యలు


జిల్లాలో మంజూరైన 19 శ్మశాన వాటికలను వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. లక్ష్యాలకు అనుగుణంగా పనులను పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించాం. పనులు మరింత వేగవంతం చేసేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం.

- తిరుపతయ్య, డ్వామా పీడీ


Updated Date - 2021-06-17T04:10:44+05:30 IST