ఈ యాప్స్‌ ఆమె కోసమే!

ABN , First Publish Date - 2020-07-18T05:30:00+05:30 IST

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల్లో మహిళల సంఖ్య ఎక్కువే. మహిళల కోసం ప్రత్యేకంగా ఎన్నో యాప్స్‌ ఉన్నాయి. కానీ చాలామందికి వాటిపై పెద్దగా అవగాహన లేకపోవడంతో....

ఈ యాప్స్‌ ఆమె కోసమే!

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల్లో మహిళల సంఖ్య ఎక్కువే. మహిళల కోసం ప్రత్యేకంగా ఎన్నో యాప్స్‌ ఉన్నాయి. కానీ చాలామందికి వాటిపై పెద్దగా అవగాహన లేకపోవడంతో వాటికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన అప్లికేషన్ల గురించిన వివరాలివి.


డైటింగ్‌ కోసం!


మానసిక ఒత్తిడి, ఇతర సమస్యల కారణంగా కొద్ది శాతం మంది మహిళలకు శారీరక బరువు పెద్ద సమస్యగా మారుతుంటుంది. బరువు తగ్గించుకోవడానికి రకరకాల డైటింగ్‌ విధానాలు అనుసరించి ఆరోగ్యం మరింత క్షీణింపజేసుకుంటూ ఉంటారు. అలాకాకుండా ఆహారంలో క్యాలరీల పరిమాణాన్ని లెక్కించి, తగిన విధంగా శారీరక వ్యాయామం చేయడానికి Calorie Counter అనే అప్లికేషన్‌ పనికొస్తుంది. https://bit.ly/3h1Eo2b అనే లింకు నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మనం రోజువారి తినే ఇడ్లీ, దోశ, భోజనంలో తీసుకునే వివిధ పదార్థాల క్యాలరీల వివరాలను ఇది నిక్కచ్చిగా చూపిస్తుంది.




ఇంటి ఖర్చుల లెక్కల కోసం...


చాలా ఇళ్ళల్లో కుటుంబ ఆర్థిక వ్యవహారాలన్నీ మహిళలే చక్కదిద్దుతూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడే మహిళా యూజర్లకు Home Budget Manager Lite అనే అప్లికేషన్‌ ఉపయోగపడుతుంది. ఇది మీ  ఆదాయం, ఖర్చులను సమర్థంగా నిర్వహిస్తుంది. అలాగే సకాలంలో బిల్లులు చెల్లించేలా బిల్‌ రిమైండర్‌ సర్వీస్‌ కూడా దీంట్లో ఉంటుంది. https://bit.ly/38ZnJtn లింకులో ఈ అప్లికేషన్‌ లభిస్తుంది.




కొత్తవి నేర్చుకోవడానికి...


ఉద్యోగం చేసే మహిళల పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ గృహిణులు తమ సమయాన్ని సమర్థంగా వినియోగించుకుని ఆన్‌లైన్‌లో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. స్పోకెన్‌ ఇంగ్లీష్‌, బాడీ లాంగ్వేజ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మొదలుకొని పాటలు పాడడం, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ వంటి వివిధ అంశాల గురించి udemy, Linkedin Learning వంటి అప్లికేషన్స్‌లో కోర్సులు లభిస్తుంటాయి. వీటిలో కొన్ని పెయిడ్‌ కోర్సులు ఉన్నప్పటికీ, చాలా వరకు ఉచిత కోర్సులు కూడా లభిస్తాయి. https://bit.ly/3ezZzGQ లింక్‌ నుంచి Udemy అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.





ఆరోగ్యం గురించి...


మహిళల శారీరక, మానసిక ఆరోగ్యం అనేక అంశాలపై ముడిపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆందోళనకు గురికాకుండా తరచూ వచ్చే సమస్యలు, వాటి లక్షణాలు, వాటికి సరైన పరిష్కార మార్గాల గురించి వివరంగా తెలియ చెప్పడానికి Women‘s Health అనే అప్లికేషన్‌ ప్రయత్నించవచ్చు. దీన్ని https://bit.ly/2WmL0jI లింక్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


ఆపత్కాలంలో రక్షణ కోసం...


మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు అత్యవసర సర్వీసులు, ఆత్మీయులను వెంటనే అలర్ట్‌ చేయడం కోసం Indian SOS Women Safety అనే యాప్‌ పనికొస్తుంది. దీన్ని https://bit.ly/2DNrw1n అనే లింక్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మహిళల ఆత్మరక్షణకు అనేక విలువైన సూచనలు కూడా దీనిలో లభిస్తాయి. అవసరమైన చోట వీడియోలు కూడా ఉంటాయి. అలాగే మహిళల కోసం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ)లో ఉన్న సెక్షన్‌ల సమాచారం కూడా ఉంటుంది. నెట్‌వర్క్‌ సక్రమంగా లేకపోయినా కూడా పనిచేసేలా ఈ అప్లికేషన్‌ను  తీర్చిదిద్దారు.





పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు...


వ్యాపార రంగంలో ప్రవేశించి స్టార్ట్‌పలు మొదలుకొని పెద్ద ప్రాజెక్టుల వరకూ నిర్వహించే మహిళా పారిశ్రామికవేత్తలకు ఉపయుక్తంగా ఉండేలా https://bit.ly/2OuSdKd లింకులో లభించే ‘ఉమెన్‌ ఎంట్రప్రెన్యూర్‌ ప్రోగ్రామ్‌’ ఉపయోగపడుతుంది. అందుకు కావాల్సిన నైపుణ్యాలు, ఎదురయ్యే సవాళ్లు, గురించిన పూర్తిస్థాయి సమాచారం ఇందులో లభిస్తుంది.




మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు...


గర్భం దాల్చినప్పుడు శిశువులో ఏ వారంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి. పిల్లలను పెంచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి అనేక అంశాలకు సంబంధించిన సలహాలు అందించే అప్లికేషన్‌ Indian Women App: Healofy. ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్‌, మహిళలకు సంబంధించిన కీలకమైన విషయాల గురించి ఈ అప్లికేషన్‌ సమాచారం అందిస్తుంది. https://bit.ly/3es0Pvo అనే లింక్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.





శారీరక వ్యాయామం కోసం...


కుటుంబ పరిస్థితుల వల్ల చాలామంది మహిళలకు  వ్యాయామానికి తగినంత సమయం వెచ్చించడం సాధ్యపడదు. వారికి ఉపయోగపడేదే 7 Minutes Workout.  దీన్ని గూగుల్‌ ప్లే స్టోర్‌లో https://bit.ly/39bYjsJ అనే లింక్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. బరువు తగ్గాలన్నా, శారీరకంగా దృఢంగా ఉండాలన్నా ఎలాంటి పరికరం అవసరం లేని భారీ మొత్తంలో వ్యాయామాలు దీంట్లో పొందుపరచి ఉంటాయి. ఒక్కొక్కటి 30 సెకన్ల పాటు చేయగలిగే 12 వ్యాయామాలు, మొత్తం 7 నిమిషాల్లో పూర్తవుతాయి.




నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothu sridhar

Updated Date - 2020-07-18T05:30:00+05:30 IST