స్మార్ట్‌ఫోన్లకు జోరు గిరాకీ

ABN , First Publish Date - 2020-06-13T08:51:57+05:30 IST

నిత్యావసరంగా మారిన స్మార్ట్‌ఫోన్లకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ క్రమంగా పుంజుకుంటోంది. లాక్‌డౌన్‌ కారణంగా దుకాణాలు మూసివేయడంతో ఫోన్ల అమ్మకాలు జరగలేదు. అయితే ఇటీవల సడలింపులు ఇవ్వడంలో దుకాణాలు తెరుచుకుని ఫోన్ల అమ్మకాలు...

స్మార్ట్‌ఫోన్లకు జోరు గిరాకీ

  • డిమాండ్‌ ఎక్కువ.. సప్లయ్‌ తక్కువ
  • ఫోన్లను దిగుమతి చేసుకుంటున్న షామీ, ఒప్పో!
  • దేశీయంగా ఉత్పత్తి తక్కువగా ఉండటమే కారణం 

న్యూఢిల్లీ, జూన్‌ 12: నిత్యావసరంగా మారిన స్మార్ట్‌ఫోన్లకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ క్రమంగా పుంజుకుంటోంది. లాక్‌డౌన్‌ కారణంగా దుకాణాలు మూసివేయడంతో ఫోన్ల అమ్మకాలు జరగలేదు. అయితే ఇటీవల సడలింపులు ఇవ్వడంలో దుకాణాలు తెరుచుకుని ఫోన్ల అమ్మకాలు జోరందుకున్నాయి. కానీ డిమాండ్‌కు తగిన స్థాయిలో ఫోన్లను కంపెనీలు సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం దేశీయంగా ఉన్న మొబైల్‌ ఫోన్ల తయారీ ప్లాంట్లలో కార్యకలాపాలు నత్తనడకన సాగుతుండటమేనట. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు తగిన విధంగా ఫోన్లను సరఫరా చేసేందుకు కొన్ని కంపెనీలు దిగుమతుల బాట పట్టాయని తెలుస్తోంది. చైనాకు చెందిన షామీ, ఒప్పో కంపెనీలు కొన్ని స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లను భారత్‌లోకి దిగుమతి చేసుకుంటున్నాయని తెలిసింది. దిగుమతులతో కొనుగోలుదారులు తమకు నచ్చిన ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కాస్త ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. దిగుమతి చేసుకునే డివైజ్‌లపై అధిక సుంకాలు విధిస్తుండటమే ఇందుకు కారణం. దేశంలో తయారీని ప్రోత్సహించేందుకు సుంకాలను పెంచారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే చాలా విదేశీ కంపెనీలు స్థానికంగానే స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తున్నాయి. 


కార్మికుల కొరత

షామీ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న స్మార్ట్‌ఫోన్లను కాంట్రాక్టు మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ ఫాక్స్‌కాన్‌.. ఏపీ, తమిళనాడులోని ప్లాంట్లలో తయారు చేస్తోంది. న్యూఢిల్లీ శివారులోని ప్లాంట్‌లో ఒప్పో ఫోన్లు తయారు అవుతున్నాయి. పలు కంపెనీలు వివిధ రాష్ర్టాల్లో తమ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఫోన్ల తయారీకి ప్రభుత్వం ఎప్పుడో అనుమతి ఇచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగడం లేదనే పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కరోనా భయంతో ఫోన్లను అసెంబుల్‌ చేసే కార్మికులు విధులకు హాజరుకావడంలేదని ఫలితంగానే అనేక ప్లాంట్లలో ఉత్పత్తి అంతంత మాత్రంగా సాగుతోందని అంటున్నారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని షామీ, ఒప్పో లాంటి కంపెనీలు ఫోన్లను దిగుమతి చేసుకుంటున్నాయని, ఇది తాత్కాలికమేనని చెబుతున్నారు. దేశీయంగా ఉత్పత్తి, పంపిణీ సాధారణ స్థాయికి చేరుకున్నాక దిగుమతుల అవసరం ఉండదని అంటున్నారు. కాగా ఈ రెండు కంపెనీలు ఏయే మోడళ్లను దిగుమతి చేసుకుంటున్నాయో తెలియాల్సి ఉంది. దిగుమతులకు సంబంధించి ఈ కంపెనీలు స్పందించలేదు. 


కంపెనీల ప్రణాళికలపై ప్రభావం

లాక్‌డౌన్‌ మూలంగా కంపెనీల స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు డిమాండ్‌ పెరుగుతున్నా అందుకు అనుగుణంగా ఉత్పత్తులను అందించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కంపెనీల అమ్మకాల ప్రణాళికలపై ప్రభావం పడుతోందని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నా వాటిని డిమాండ్‌కు తగిన స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం సవాలుగానే ఉంటుందంటున్నారు. అయితే మరో నెలరోజుల్లో తయారీ కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని, అప్పుడు ఫోన్ల లభ్యత పెరుగుతుందని అంటున్నారు. 


Updated Date - 2020-06-13T08:51:57+05:30 IST