రేబాన్‌, ఫేస్‌బుక్‌ల నుంచి ‘స్మార్ట్‌గ్లాసెస్‌’

ABN , First Publish Date - 2021-09-18T06:25:37+05:30 IST

‘స్మార్ట్‌వాచ్‌’ తరవాత ఇప్పుడు ‘స్మార్ట్‌ గ్లాసెస్‌’ శకం మొదలైంది. ‘రేబాన్‌’తో కలిసి ఫేస్‌బుక్‌ తొలిసారిగా స్మార్ట్‌ గ్లాసెస్‌ను ఆరంభించింది. దీనిని ‘రేబాన్‌ స్టోరీస్‌’గా పిలుస్తున్నారు. ఇది పూర్తిగా పలు ఫీచర్ల...

రేబాన్‌, ఫేస్‌బుక్‌ల నుంచి ‘స్మార్ట్‌గ్లాసెస్‌’

‘స్మార్ట్‌వాచ్‌’ తరవాత ఇప్పుడు ‘స్మార్ట్‌ గ్లాసెస్‌’ శకం మొదలైంది. ‘రేబాన్‌’తో కలిసి ఫేస్‌బుక్‌ తొలిసారిగా స్మార్ట్‌ గ్లాసెస్‌ను ఆరంభించింది. దీనిని ‘రేబాన్‌ స్టోరీస్‌’గా పిలుస్తున్నారు. ఇది పూర్తిగా పలు ఫీచర్ల సమాహారం. 

దీనితో ఫొటోలు, 30 సెకెండ్ల నిడివి గల వీడియోలు తీసుకోవచ్చు. అంతేకాదు సంగీతం, పాడ్‌కాస్ట్‌, ఫోన్‌కాల్స్‌ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఇటలీ, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియాలో వీటి అమ్మకాలు మొదలయ్యాయి. వీటి ధర 299 డాలర్లు అంటే మన కరెన్సీలో రమారమి రూ.21.975గా ఉంది. ఫ్రేమ్‌/ లెన్స్‌, స్టయిల్స్‌కు సంబంధించి సుమారు ఇరవై కాంబినేషన్లలో ఈ గ్లాసెస్‌ లభ్యమవుతాయి. రేబాన్‌ ఐకానిక్‌ స్టయిల్స్‌ ముఖ్యంగా వేఫారర్‌, రౌండ్‌, మెటియోర్‌ సహా పలు రకాలు వీటిలో ఉన్నాయి. పోలరైజ్డ్‌ గ్లాసెస్‌(329 డాలర్లు), ట్రాన్సిషన్‌(379 డాలర్లు), వేర్వేరు రేట్లతో ప్రిస్ర్కిప్షన్‌ లెన్సెస్‌ ఉన్నాయి. అయితే ఈ రేబాన్‌ స్టోరీస్‌ అమ్మకాలు మన దేశంలో ఎప్పుడు ఆరంభమవుతాయనే సమాచారం మాత్రం లేదు. భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్‌ లేకాండానే కౌచ్‌లో గేమ్స్‌ అడుకోవచ్చని, అంతేకాకుండా వీడియో, ఫొటోలను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవచ్చుని ఫేస్‌బుక్‌ సీఈఓ చెబుతున్నారు. భవిష్యత్తులో మన చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవాలంటే స్మార్ట్‌ఫోన్‌ ఉండాల్సిన అవసరం ఉండదని ఇటీవల విడుదల చేసిన ఒక వీడియోలో ఆయన తెలిపారు. 

మార్కెట్‌లో విడుదలైన చోట్ల ప్రజలని అంతగా ఆకట్టుకోలేకపోతోందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఫేస్‌బుక్‌, గేమ్స్‌, షాప్‌ని యాక్సెస్‌ చేయలేకపోవడం వల్ల కొంత నిరాసక్తంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే... చాలా మంది మాత్రం ‘హే ఫేస్‌బుక్‌’ అంటూ వీడియోలు మాత్రం తీసుకుంటున్నారట. వీటి కోసం ప్రత్యేక ఫేస్‌బుక్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

గూగుల్‌, స్నాప్‌, అమెజాన్‌ ఇప్పటికే తమవైన గ్లాసెస్‌ను మార్కెట్లోకి విడదల చేశాయి. ఫేస్‌బుక్‌ విషయానికి వస్తే ఇదే మొదటి వెంచర్‌. అయితే ఇప్పటికీ ఏ ఒక్కటి ఈ సెగ్మెంట్‌లో ఘన విజయం సాధించలేదన్నది మాత్రం నిపుణుల మాట. కమర్షియల్‌ స్పేస్‌ స్మార్ట్‌ గ్లాసెస్‌ తమ ప్లేస్‌ పొందలేదు. అయితే ఎమర్జింగ్‌ మార్కెట్‌లో ఇవీ ఒక భాగమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇమ్మెర్సివ్‌ ఎడ్జ్‌ అడ్వయిజర్స్‌ నివేదిక ప్రకారం 2030 నాటికి ‘స్మార్ట్‌గ్లాసెస్‌’ అమ్మకాలు 22 లక్షల యూనిట్లకు చేరుకుంటాయని అంచనా.


Updated Date - 2021-09-18T06:25:37+05:30 IST