స్మార్ట్‌ స్లమ్స్‌ సఫా లక్ష్యం!

ABN , First Publish Date - 2021-10-23T05:30:00+05:30 IST

ఇంట్లో వద్దన్నా.. పదకొండేళ్ల క్రితం మంచి వ్యాపారాన్ని వదిలేసి పాతబస్తీ బాట పట్టిందామె. మైనారిటీ మహిళల జీవితాల్ని దగ్గరగా చూసేందుకు అక్కడి బస్తీల్లో తిరిగింది. ..

స్మార్ట్‌ స్లమ్స్‌ సఫా లక్ష్యం!

ఇంట్లో  వద్దన్నా.. పదకొండేళ్ల క్రితం మంచి వ్యాపారాన్ని వదిలేసి పాతబస్తీ బాట పట్టిందామె. మైనారిటీ మహిళల జీవితాల్ని దగ్గరగా చూసేందుకు అక్కడి బస్తీల్లో తిరిగింది. ‘సఫా’ అనే స్వచ్ఛంధ  సంస్థను నెలకొల్పి వేల మంది మహిళలకు స్కిల్‌డెవలప్‌ మెంట్‌ శిక్షణతో పాటు వ్యాపారాలు చేసుకోవటానికి దన్నుగా నిలిచింది.  వినూత్నంగా మహిళా చెఫ్‌లతో ఈ సంస్థ ‘లుక్మా’ అనే క్లౌడ్‌ కిచెన్‌ నడుపుతోంది. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న ‘సఫా’ ఫౌండర్‌ రుబీనా నఫీజ్‌ ఫాతిమాను ‘నవ్య’ పలకరించింది.


‘‘లుక్మా అంటే ముద్ద అని అర్థం. ఇక్కడ పదిహేను మంది చెఫ్‌లు.. మూడు షిఫ్టుల్లో పని చేస్తారు. హైదరాబాద్‌ చికెన్‌, మటన్‌ బిర్యానీలు మా అథంటిక్‌ ఫుడ్‌. పులావ్‌లు, కర్రీలు, తీపి పదార్థాలు, హలీమ్‌.. ఇలా యాభైకి పైన వంటలు మా కిచెన్‌లో తయారవుతాయి. 


ఫైవ్‌స్టార్‌ చెఫ్‌లతో శిక్షణ..

ప్రతి ఇంట్లోని తల్ల్లి గొప్ప చెఫ్‌. పాతబస్తీలోని కొందరు ఒంటరి మహిళలు పనిమనిషి ఉద్యోగాలు చేయటం చూశా. ఎంత కష్టపడినా తక్కువ ఆదాయం. వీళ్లు చెఫ్స్‌గా పనిచేస్తే ఆర్థికాభివృద్ధి వస్తుందనుకున్నా. ఈ క్రమంలో కేరళలోని కుడుంబశ్రీ కమ్యూనిటీ కిచెన్‌కి వెళ్లా. ఆ స్ఫూర్తితోనే ‘లుక్మా’ కిచెన్‌ ప్రారంభించా. ఏ అండాదండాలేని పదిహేనుమంది గృహిణులను ఎన్నుకొని ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లో శిక్షణ ఇప్పించా. స్టార్‌ హోటల్స్‌ చెఫ్‌లూ మా సంస్థకొచ్చి శిక్షణ ఇచ్చారు. కూరగాయలను ఎలా తరగాలి? ఎప్పుడూ ఒకే రుచి రావటానికి ఏం చేయాలి? హైజీన్‌ ఎలా మెయింటేన్‌ చేయాలి? ఇలాంటివన్నీ నేర్చుకున్నారు. చెఫ్‌లయ్యాక వీళ్ల  నెల ఆదాయం పెరిగింది. రజియా, సనా అనే చెఫ్‌లు ఏకంగా స్కూటీలు కొన్నారు. 


 ఫ్రెంచి వాళ్లూ మెచ్చారు.. 

2019లో కిచెన్‌ ప్రారంభించాం. ఒకరోజు ముందే ఆర్డరివ్వాల్సి ఉంటుంది. హోటల్‌లో మాదిరి ఆహారాన్ని నిల్వ ఉంచుకోం. ఫ్రెష్‌గా చేసిస్తాం. ఇంటి ఫుడ్‌ తిన్న ఫీలింగ్‌ ఉంటుంది. ఇదే ప్రత్యేకత. కనీసం పదిమందికి ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఉప్పు తక్కువా? కారం ఎక్కువా? ఇలా రిక్వైర్‌మెంట్‌ బట్టి వండుతాం. ఎన్జీవోల ఆర్డర్ల మేరకు అనాథాశ్రమాలు, ఓల్డేజ్‌ హోమ్‌లకు ఆహారాన్ని సరఫరా చేస్తాం. కొందరు తమ కొడుకు పుట్టిన రోజు సందర్భంగా ఫలానా అనాథాశ్రమానికి భోజనం అందించమని ఆర్డరిస్తారు. ఇలా మేం రోజూ బిజీనే. మాకు ఇద్దరు ఫుడ్‌ డెలివరీ గర్ల్స్‌ ఉన్నారు. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి.. ప్రాంతాల నుంచీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కూడా ఆర్డర్లు ఇస్తారు. ఇటీవలే ఒకరింటికి ఫ్రెంచి వాళ్లు పదిహేను మంది వస్తే.. మాతోనే వండించారు. లొట్టలేసుకుని మరీ వాళ్లు తిన్నారు. చెఫ్‌లను మెచ్చుకున్నారు. మసాలాలను కూడా మేం తయారు చేసి అమ్ముతాం. 


మహిళలకో స్టూడియో..

పురుషులు ఎక్కడైనా బాతాఖానీ కొట్టగలరు. ముఖ్యంగా ముస్లిం మహిళలకు ఆ స్వేచ్ఛ ఉండదు. అందుకే మహిళల కోసమే ‘లుక్మా స్టూడియో’ను ఆర్నెళ్ల కిందట ప్రారంభించా. రాజకీయాలు, కల్చర్‌, ఎడ్యుకేషన్‌, మ్యూజిక్‌.. ఇలా ఎన్నో విషయాలపై డిస్కస్‌ చేసుకోవచ్చు. మొన్నీ మధ్య ఓ అమ్మాయి పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ క్లాసులు చెప్పింది. ఇరవై ఐదుమంది కూర్చోవడానికి చోటుండే ఈ స్టూడియోకి అమ్మాయిలు క్యూ కట్టారు. కొందరు ఇక్కడ పుట్టిన రోజులు జరుపుతారు. స్టూడియోకి వచ్చే వారికి ముందే ఆర్డరు తీసుకుని ఆహారాన్ని అందిస్తాం. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌నుంచి కొందరు స్టూడియోకొచ్చి మెచ్చుకున్నారు.  


అందుకే ‘సఫా’ ప్రారంభించా.. 

పాతబస్తీలో తలాక్‌ గురించి ఫోకస్‌ చేసే మీడియా.. అక్కడి మహిళల స్థితిగతుల్ని పట్టించుకోదు. అజ్ఞానం, నిరక్షరాస్యత, పేదరికంతో కొట్టుమిట్టాడే మైనారిటీ మహిళలకోసం ఏదైనా చేద్దామనుకున్నా. అలా పుట్టిందే ‘సఫా’. దీనర్థం ప్యూర్‌ అండ్‌ క్లీన్‌. ‘సఫా’ సంస్థను 11 ఏళ్ల క్రితం మాసబ్‌ట్యాంక్‌ దగ్గర ప్రారంభించా. తొలిసారి టైలరింగ్‌, మెహందీ డిజైన్‌, బ్యుటీషియన్‌ కోర్సుల శిక్షణ అక్కడే ఇప్పించా. పాతబస్తీలోని పేదలకు లోన్లు ఇప్పించి.. కిరాణాషాపులు, పాప్‌కార్న్‌ మిషన్లు, టీ కొట్టులు.. పెట్టించా. సంపాదన మొదలయ్యాక ఇంట్లోనే మహిళలకు విలువ, గౌరవం పెరిగాయి. వారెంతో ఆనందపడ్డారు. 


 అదే నా డ్రీమ్‌.. 

ఈ పదకొండేళ్లలో ఎన్నో ఆటుపోట్లు.. చూశా కానీ ఏనాడూ ఆగలేదు. ఆరువేల మందికి టైలరింగ్‌, ఆరు వందల మందికి బ్యుటీషియన్‌ కోర్సులో, నాలుగు వందలమందికి మెహందీ డిజైనింగ్‌లో శిక్షణనిప్పించా. ఆరు వేల మంది యువతకు స్పోకెన్‌ ఇంగ్లీష్‌, ఎమ్‌ఎస్‌ఆఫీస్‌ నేర్పించాం. 750 మందికి లోన్లు ఇప్పించి ఉపాధిని చూపించాం. ఎనభైమందికి కుకింగ్‌లో శిక్షణ ఇప్పించాం. మాకు హైదరాబాద్‌లో ఆరు బ్రాంచీలున్నాయి. ‘ఎడ్యుకేట్‌ ఎ గర్ల్‌.. ఎంపర్‌ ఎ ఫ్యామిలీ’ అనేదే మా సంస్థ సిద్ధాంతం. టాటా, అపోలో, హెచ్‌ఎస్‌బీసీ, అమెజాన్‌, కోటక్‌  మహీంద్ర బ్యాంక్‌.. ఇలా ఎన్నో కార్పొరేట్‌ కంపెనీలు అండగా నిలుస్తున్నాయి. మా సంస్థలో 70 మంది ఉద్యోగులున్నారు. 55 శాతం మంది మహిళలే. ‘సఫా’ ఈ స్థాయికి వస్తుందని ఏనాడూ కలగనలేదు. మేం ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం. ఏదీ ఉచితంగా ఇవ్వం. మహిళలు కష్టపడి పని చేయాలి. ఎవరికాళ్ల మీద వాళ్లే నిలబడాలి. మున్ముందు పనిలోనూ, క్వాలిటీలోనూ నంబర్‌వన్‌ కావాలి. అన్ని పారామీటర్లలో స్లమ్స్‌ అభివృద్ధి కావాలి. స్మార్ట్‌ విలేజెస్‌లా స్మార్ట్‌ స్లమ్స్‌ తయారు చేయాలన్నదే నా డ్రీమ్‌. 


 రాళ్లపల్లి రాజావలి

ఫొటోలు- ఎమ్‌. అనిల్‌ కుమార్‌



హైదరాబాద్‌లో పుట్టి పెరిగా, బీకాం చదివా. నాన్న ఆర్మీలో పనిచేశారు. మా తాతయ్య నిజాం దగ్గర అడ్మిషన్‌ సెక్షన్‌లో పనిచేశారు. పంజాగుట్టలో విద్యార్థులకోసం ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సంస్థను నడిపేదాన్ని. నాకెప్పుడూ ముస్లిం కమ్యూనిటీలో ఛారిటీ ఉంది కానీ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ లేదనే బాధ ఉండేది. పాతబస్తీలోని మహిళల ఆర్థికాభివృద్ధికి ఏదైనా చేద్దామని వ్యాపారాన్ని వదిలేశా. ఇంట్లో వాళ్లే ఒప్పుకోలేదు. ‘స్లమ్స్‌లోకి వెళ్లడం మంచిది కాద’ని నా కొడుకే సలహా ఇచ్చాడు. పాతబస్తీ బాట పట్టినప్పుడు ఎన్నో ఆర్థిక కష్టాలు. స్నేహితుల సాయం మాత్రమే ఉండేది. సద్గురు జ్ఞానానంద ఫెలోషిప్‌ వచ్చింది. నెలకి పదివేల చొప్పున రెండేళ్లు సర్వైవ్‌ అయ్యా. సక్సెసయ్యాక అందరూ.. అభినందిస్తున్నారిప్పుడు!

Updated Date - 2021-10-23T05:30:00+05:30 IST