మమకారమా? వ్యాపారమా?

ABN , First Publish Date - 2022-01-12T07:47:46+05:30 IST

ఎప్పుడో ఎన్టీఆర్‌ హయాం నుంచి ప్రభుత్వాలు కేటాయించిన ఇళ్లకు బకాయిలు ఉన్నాయంటూ... వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరిట పేదల నుంచి పైసా వసూల్‌కు దిగుతున్నారు! ఇప్పుడు... మధ్య తరగతి నుంచీ సొమ్ములు రాబట్టుకునేందుకు ‘స్మార్ట్‌’ స్కీమ్‌ ఒకటి రచించారు. అదే... జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పథకం!

మమకారమా? వ్యాపారమా?

  • జగనన్న టౌన్‌షిప్‌లో స్మార్ట్‌గా దోపిడీ
  • రియల్టర్‌ అవతారమెత్తిన రాష్ట్ర ప్రభుత్వం
  • లాభాపేక్ష లేదనడం వట్టి మాటే
  • బహిరంగ మార్కెట్‌కంటే ధర ఎక్కువే
  • ఓటీఎస్‌ పేరుతో పేదల నుంచి వసూలు
  • టౌన్‌షిప్‌ పేరిట మధ్యతరగతిపై వల
  • అసలు ఈ ప్రభుత్వాన్ని నమ్మేదెలా?
  • ప్లాట్లు అమ్మి వదిలేస్తే దిక్కెవరు?
  • ఇలాంటి ప్రాజెక్టులు గతంలో విఫలం


రాష్ట్రవ్యాప్తంగా వేలాది టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరికొన్ని ఇళ్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా లబ్ధిదారులకు అప్పగించడం లేదు!

హౌసింగ్‌ బోర్డు... ప్రభుత్వ రంగ సంస్థ! పట్టణాలు, నగరాల్లో ప్లాట్లు వేస్తూ, ఇళ్లు కూడా నిర్మిస్తూ కొత్త కాలనీలనే ఏర్పాటు చేస్తుంది. కానీ...  ఉద్దేశపూర్వకంగానే ఈ సంస్థ కార్యకలాపాలకు బ్రేకులు వేశారు.

ఇవన్నీ ఇలా ఉండగానే... మరో కొత్త హౌసింగ్‌ స్కీమ్‌ తెచ్చారు. అదే... ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌’! ఇందులో మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరకే వివాదాల్లేని, అన్ని వసతులు ఉన్న ఇంటి స్థలాలు కేటాయిస్తారట! మంచిదే! కానీ... ఇది జనంపై ఉన్న మమకారమా? లేక, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమా?


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఎప్పుడో ఎన్టీఆర్‌ హయాం నుంచి ప్రభుత్వాలు కేటాయించిన ఇళ్లకు బకాయిలు ఉన్నాయంటూ... వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరిట పేదల నుంచి పైసా వసూల్‌కు దిగుతున్నారు! ఇప్పుడు... మధ్య తరగతి నుంచీ సొమ్ములు రాబట్టుకునేందుకు ‘స్మార్ట్‌’ స్కీమ్‌ ఒకటి రచించారు. అదే... జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పథకం! తొలి దశలో... గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, నెల్లూరు జిల్లా కావలి, కడప జిల్లా రాయచోటి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు... ఇలా ఐదు చోట్ల లేఔట్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్లాట్లు బుక్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ లాంఛనంగా ప్రారంభించి, ప్రసంగించారు.  ‘‘లాభాపేక్ష లేకుండా, మార్కెట్‌కంటే తక్కువ ధరకే, ప్రభుత్వమే ప్లాట్లను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఇది. దీనివల్ల మధ్య తరగతికి మంచి జరుగుతుంది’’ తెలిపారు. ప్రయత్నం మంచిదే. కానీ... ‘లాభాపేక్ష లేకుండా, మార్కెట్‌ రేటుకంటే తక్కువ ధరకే’ అనడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ‘స్మార్ట్‌ టౌన్‌షిప్‌’ పేరిట గేటెడ్‌ కమ్యూనిటీ రియల్‌ఎస్టేట్‌ను తలదన్నే స్థాయిలో ప్లాట్ల ధరలను నిర్ణయించారు. భారీ లాభాలు దండుకునేలా... ఫక్తు వ్యాపారం మొదలుపెట్టారని అక్కడి మార్కెట్‌ ధరలను చూస్తే తెలుస్తుంది.


అందుబాటులో ఉన్నాయా?

మధ్య తరగతి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకే స్మార్ట్‌టౌన్‌షి్‌పలను ఏర్పాటు చేస్తున్నట్లు జగన్‌ పేర్కొన్నారు. కానీ... వాటి ధరలను మాత్రం మధ్య తరగతికి ఏమాత్రం అందుబాటులో లేని స్థాయిలో పెట్టారు. ఉదాహరణకు... నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో జమ్మలపాలెం వద్ద జగనన్న స్మార్ట్‌సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో అంకణం(సెంటులో ఆరో భాగం) రూ.40వేలుగా నిర్ణయించారు. అదే ప్రాంతం లో ప్రైవేట్‌ లేఅవుట్లలో ఒక అంకణాన్ని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు విక్రయిస్తున్నారు. వెరసి... బహిరంగ మార్కెట్‌తో పోల్చితే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి్‌పలో అంకణం ధర రూ.10వేల నుంచి 15వేలు ఎక్కువ.  ప్రకాశం జిల్లా కందుకూరులోని లేఔట్‌లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఒక గది(8 చదరపు గజాలు లేదా 72 చదరపు అడుగులు) విలువ రూ.50,400 నిర్ణయించారు. ఆ చుట్టుపక్కల ఒక్కో గది స్థలం రూ.40 వేలకే లభిస్తోందని చెబుతున్నారు. లాభాపేక్ష లేకుండా, సరసమైన ధరకు ఇస్తుంటే... బహిరంగ మార్కెట్‌కంటే ధర ఎందుకు ఎక్కువ పెట్టినట్లు?


ప్రభుత్వమంటేనే అనుమానాలు...

మంగళవారం ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన అచ్చంగా... ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఇచ్చినట్లుగానే ఉంది. న్యాయ వివాదాలకు తావులేని స్పష్టమైన టైటిల్‌ డీడ్‌ ఇస్తారట! రోడ్లు వేస్తారట! మంచినీటి సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ఉంటుందట! ఎవరు ఎక్కడ వెంచర్‌ వేసినా... ఈ సదుపాయాలన్నీ కల్పించాల్సిందే. నిర్దిష్టమైన విస్తీర్ణాన్ని పార్కులు, ఇతర సామాజిక అవసరాలకు కేటాయించాలి. అప్పుడే వెంచర్‌కు అప్రూవల్‌ వస్తుంది. దీనిపై ప్రత్యేకంగా ‘రెరా’ చట్టం ఉంది. అది పక్కనపెడితే... ప్లాట్లను అమ్మేసిన తర్వాత ప్రభుత్వం నిజంగా అక్కడ ‘డెవల్‌పమెంట్‌’ చేస్తుందా? అనే సందేహాలు జనంలో కలుగుతున్నాయి. ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థను నమ్మొచ్చుగానీ... ఈ ప్రభుత్వాన్ని నమ్మలేమని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పనులంటే కాంట్రాక్టర్లు భయపడిపోతున్నారు. వేలకోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.


కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకున్నా ఫలితం ఉండటంలేదు. అన్ని శాఖలు కాంట్రాక్టర్లు, సరఫరాదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. చివరికి... ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా బాధితులకు భోజనాలు పెట్టిన చిన్న కాంట్రాక్టర్లకు నెలల తరబడి బిల్లులునిలిపేశారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే...  ఐటీడీఏలో సబ్‌ప్లాన్‌ అమలులో భాగంగా లబ్ధిదారులు తమ వాటా కింద డీడీలు తీసేందుకూ భయపడుతున్నారు. ఆ డీడీల సొమ్ము కూడా ప్రభుత్వం వాడేసుకుంటుందేమో అన్నది వారి అనుమానం! అలాంటిది... ఇప్పుడు కాగితాల మీద వేసిన ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి ప్‌’లను నిజంగానే అభివృద్ధి చేస్తారా? వాటి కోసం డబ్బు ఖర్చుపెడతారా? నిధులెక్కడి నుంచి తెస్తారు? ఎన్ని నెలల్లోపు పనులు పూర్తిచేస్తారు? ఒకవేళ ప్రభు త్వం ఆ పనులు చేయకుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు, సందేహాలు! గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ‘దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌’(దిల్‌) పేరుతో ఇలాంటి ప్రాజెక్టునే చేపట్టారు. కానీ.. అది విజయవంతం కాలేదు. భారీ అంచనాలతో మొదలైన ‘రాజీవ్‌ స్వగృహ’ కుదేలైపోయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘టిడ్కో’ ఇళ్లను జగన్‌ సర్కారు చిన్న చూపు చూస్తోంది. ఒక ప్రభుత్వం చేపట్టిన హౌసింగ్‌ ప్రాజెక్టు మరో ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవుతుంటే.... జగనన్న స్మార్ట్‌టౌన్‌షి్‌పను నమ్మేదెలా?


సొంత లాభం చూసుకుని...

కొన్ని జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు తమ సొంత భూముల ధరలు పెరిగేలా ‘పథకం’ రచించారు. వారి భూములకు సమీపంలోనే స్మార్ట్‌ టౌన్‌షి్‌ప ఏర్పాటయ్యేలా చూశారు.  లేదా... టౌన్‌ షిప్‌ ఫలానా చోట వస్తుందని తెలుసుకుని, ముందుగానే చుట్టుపక్కల స్థలాలు కొనుగోలు చేశారు. ధర్మవరంలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి్‌ప వెంచర్‌ చుట్టు పక్కల భూములను నేతల బినామీలు, అనుచరులు ముందుగానే కొనుగోలు చేసినట్లు సమాచారం. 


నవులూరు 

సరసమైన ధర... ఇదేనా?

అమరావతిని అటకెక్కించిన జగన్‌ సర్కారు... ‘జగనన్న టౌన్‌షిప్‌’ కోసం మాత్రం రాజధాని గ్రామాన్ని ఎంచుకుంది.  అదే... మంగళగిరి సమీపంలోని నవులూరు! ఇక్కడి లేఔట్‌లో గజం ధర రూ.17,500గా నిర్ణయించారు. ఇదే నవులూరులో... రాజధాని రైతులు ఇచ్చిన పూలింగ్‌ లేఔట్లలో చదరపు గజం రూ.10వేలు పలుకుతోంది. పూలింగ్‌ లేఔట్లను కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే ఇవ్వాలి. మరి... బహిరంగ మార్కెట్‌లో రూ.10వేలు పలికే చదరపు గజం, జగనన్న స్మార్ట్‌టౌన్‌షి్‌పలో రూ.17,500 ఎందుకు అయినట్లు? మరోవైపు... ఈ టౌన్‌షి్‌పకు సమీపంలోనే వీజీఎంటీ పట్టణాభివృద్ధి సంస్థ  చాలా ఏళ్ల క్రితం ఓ వెంచర్‌ వేసి ప్లాట్లు విక్రయించింది. కానీ... ఇప్పటికీ అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించనే లేదు. 


ధర్మవరం

లాభాపేక్ష లేదా?

అనంతపురం జిల్లా ధర్మవరంలో... జగనన్న టౌన్‌షిప్‌ కోసం అసైన్డ్‌ భూములను కూడా సేకరించారు. రైతుకు అన్యాయం జరగకుండా ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించారు. మంచిదే! అంటే... ప్రభుత్వానికి ఎకరం రూ.25 లక్షలు పడినట్లు! సాధారణంగా ఒక ఎకరాన్ని లేఔట్‌గా అభివృద్ధి చేయడానికి రూ.25 లక్షలు ఖర్చవుతుంది. ప్రభుత్వం మరింత పకడ్బందీగా చేస్తుందనుకున్నా... గరిష్ఠంగా రూ.35 లక్షలకు మించదు. వెరసి... ఎకరంలో ప్లాట్లు అభివృద్ధి చేయడానికి అయ్యే ఖర్చు రూ.60 లక్షలు. రోడ్లు, నిబంధనల ప్రకారం వదిలేయాల్సిన ఖాళీ స్థలాలు పోగా... ఒక ఎకరంలో 2600 గజాలు మాత్రమే విక్రయించేందుకు వీలుంటుంది. అంటే... ఇక్కడ ఎకరం రూ.60 లక్షలు కాబట్టి, ఒక్క చదరపు గజం రూ.2300 పడుతుంది. గరిష్ఠంగా రూ.2500 అనుకుందాం! కానీ... ధర్మవరంలోని జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి్‌పలో గజం ధర రూ.5,999 గా నిర్ణయించారు. ఎందుకో? లాభాపేక్ష లేనప్పుడు రెట్టింపు ధర ఎందుకో? 


కందుకూరు

రెట్టింపు లాభం

ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో... గతంలో టిడ్కో ఇళ్లు కట్టిన ప్రాంతంలోనే జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్‌ కోసం స్థలం ఎంపిక చేశారు. అక్కడ గది (8 గజాలు) విలువ రూ.50,400గా నిర్ణయించారు. ఇదే ప్రాంతంలో ప్రస్తుతం ఎకరం రూ.30లక్షల నుంచి 40 లక్షలకు లభిస్తోంది. ఎవరైనా రియల్టర్‌ ఇక్కడ భూములను కొనుగోలు చేసి, అభివృద్ధి పరిచి ఎంచక్కా... అదే గది విస్తీర్ణం స్థలాన్ని రూ.30వేలకు విక్రయించుకున్నా మంచి లాభం వస్తుంది.! మరి... రూ.50వేలకు అమ్ముతున్న ప్రభుత్వానికి, రెట్టింపు లాభం! 

Updated Date - 2022-01-12T07:47:46+05:30 IST