ఇంటర్‌ పాసైన బాలికలకు స్మార్ట్‌ఫోన్‌.. డిగ్రీ విద్యార్థినులకు స్కూటీ..!

ABN , First Publish Date - 2021-10-22T13:56:26+05:30 IST

ఇంటర్‌ పాసైన బాలికలకు స్మార్ట్‌ఫోన్‌..

ఇంటర్‌ పాసైన బాలికలకు స్మార్ట్‌ఫోన్‌.. డిగ్రీ విద్యార్థినులకు స్కూటీ..!

ఇంటర్‌ పాసైన బాలికలకు స్మార్ట్‌ఫోన్‌

డిగ్రీ విద్యార్థినులకు స్కూటీ మేం అధికారంలోకి వస్తే ఇస్తాం: ప్రియాంక


లఖ్‌నవూ: రానున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటర్‌ పాసైన బాలికలకు స్మార్ట్‌ఫోన్‌, డిగ్రీ విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా ప్రకటించారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. ‘‘బుధవారం కొంత మంది బాలికలను కలిశాను. తమ చదువు, భద్రత కోసం తమకు స్మార్ట్‌ఫోన్‌ అవసరమని వారు చెప్పారు. ఈ విషయంపై మా పార్టీ మ్యానిఫెస్టో కమిటీతో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం. మేం అధికారంలోకి వస్తే ఈ హామీని నెరవేరుస్తాం’’ అని పేర్కొన్నారు. కాగా ఈ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు కేటాయిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.


ఆ మహిళా పోలీసులపై చర్యలకు యోగి యోచన

తనతో ఫొటో దిగిన మహిళా పోలీసులపై చర్యలు తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ యోచిస్తున్నారని ప్రియాంక వాద్రా అన్నారు. ఈ మేరకు వార్తలు వస్తున్నాయని ఆమె ట్వీట్‌ చేశారు. ‘‘ఆ మహిళా కానిస్టేబుళ్లు నాతో ఫొటో దిగడమే నేరమా? ఒకవేళ వారిపై చర్యలు తీసుకుంటే నన్ను కూడా శిక్షించాలి. నిజాయితీగల మహిళా పోలీసుల కెరీర్‌ను పాడుచేయడం ఈ ప్రభుత్వానికి తగదు’’ అని పేర్కొన్నారు. పోలీసు కస్టడీలో చనిపోయిన ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రియాంక బుధవారం ఆగ్రాకు వెళ్తుండగా దారిలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ సందర్భంలో కొందరు మహిళా పోలీసులు ఆమెతో ఫొటో దిగారు. మరోవైపు ఈ ఘటనపై యోగి సర్కారు దర్యాప్తుకు ఆదేశించిందని లఖ్‌నవూ పోలీసులు తెలిపారు. నియమాలను ఉల్లంఘించినట్లు తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు.

Updated Date - 2021-10-22T13:56:26+05:30 IST