‘దళిత బంధు’ స్మార్ట్‌ ఫోన్‌తో అనుసంధానం

ABN , First Publish Date - 2021-07-25T08:38:59+05:30 IST

దళిత సాధికారత కోసం ము ఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ పథకా న్ని పక్కాగా అమలు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు...

‘దళిత బంధు’ స్మార్ట్‌ ఫోన్‌తో అనుసంధానం

  • ప్రతి లబ్ధిదారుడికి క్యూఆర్‌ కోడ్‌తో స్మార్ట్‌ కార్డు
  • కోరుకున్న యూనిట్‌తో పాటు స్మార్ట్‌ఫోనూ అందజేత 

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): దళిత సాధికారత కోసం ము ఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ పథకా న్ని పక్కాగా అమలు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సీఎం స్వయంగా చొరవ తీసుకుని అమలు చేస్తున్న పథకం కావడంతో ఎక్కడా ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘దళిత బంధు’ ప్రతి దశలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించారు. ఆమేరకు ప్రతి లబ్ధిదారుడికి వారు కోరుకున్న యూనిట్‌తోపాటు స్మార్ట్‌ ఫోన్‌ కూడా ఇప్పించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అధికారులు, కార్యాలయాల చుట్టు తిరగాల్సిన అవసరం ఉండదని.. తన వ్యాపారం లాభ, నష్టాలు, ఇతర సమాచారాన్ని మొబైల్‌ ద్వారానే లబ్ధిదారుడు అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. లబ్ధిదారులను, అధికారులను స్మార్ట్‌ ఫోన్‌ వేదికగా అనుసంధానించడం వల్ల నిరంతర పర్యవేక్షణకు అవకాశం ఉంటుందన్నది ఉన్నతాధికారుల ఆలోచన. అవసరాన్నిబట్టి అధికారులు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటారు. అంతేకాదు.. ప్రతి లబ్ధిదారుడికి ఫొటో, క్యూఆర్‌ కోడ్‌తో స్మార్ట్‌ కార్డు తయారు చేయించి ఇస్తారు. అవసరమైనప్పుడు స్మార్ట్‌ కార్డుపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం వల్ల లబ్ధిదారుడి వ్యాపార స్థితిగతుల వివరాలను తెలుసుకునే వీలుంటుంది. నిరక్షరాస్యులైన లబ్ధిదారుల సులభంగా అర్థం చేసుకుని ఉపయోగించే విధంగా క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని రూపొందిస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.


Updated Date - 2021-07-25T08:38:59+05:30 IST