స్మార్ట్‌గా నిరుద్యోగులకు కుచ్చుటోపీ

ABN , First Publish Date - 2022-08-10T06:24:15+05:30 IST

నర్సీపట్నం కేంద్రంగా 2018 అక్టోబర్‌లో స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీని అనకాపల్లికి చెందిన ఇండిపూడి సుధాకర్‌ స్థాపించారు. దీనికి ఆయన మేనేజింగ్‌ డైరెక్టర్‌, చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

స్మార్ట్‌గా నిరుద్యోగులకు కుచ్చుటోపీ
స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ బోర్డు

- ఉద్యోగాల పేరుతో మోసం

- ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు

- నర్సీపట్నం కేంద్రంగా స్మార్ట్‌ యోజన సంస్థ కార్యకలాపాలు

- ఉమ్మడి విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల యువతకు ఎర

- మోసపోయామని ఆలస్యంగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు


ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ కుచ్చుటోపీ పెట్టింది. ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తీసుకుని మోసం చేసింది. ఉద్యోగాల కోసం అప్పులు చేసిన నిరుద్యోగ యువత ఇప్పుడు గగ్గోలు పెడుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని  బాధితులు వేడుకుంటున్నారు.


నర్సీపట్నం, ఆగస్టు 9 : నర్సీపట్నం కేంద్రంగా 2018 అక్టోబర్‌లో స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీని అనకాపల్లికి చెందిన ఇండిపూడి సుధాకర్‌ స్థాపించారు. దీనికి ఆయన మేనేజింగ్‌ డైరెక్టర్‌, చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పేద, మధ్య తరగతికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షలు నుంచి రూ.3 లక్షలు వరకు వసూలు చేశారు. నర్సీపట్నం కేంద్రంగా ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు సంస్థ కార్యకలాపాలు విస్తరించి 5 వేల మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకుల నుంచి మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేశారు. ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, జిల్లా ఏవో పోస్టులు సృష్టించి నెలకు రూ.15 నుంచి రూ.25 వేలు జీతాలు ఇస్తామని నమ్మించారు. వీరితో గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై సర్వే చేయించేవారు. అయితే చాలా మంది నర్సీపట్నం శివపురంలోని కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సెల్‌ ఫోన్లతో కాలక్షేపం చేసి ఇంటికి వెళ్లి పోయేవారు.

అందర్నీ నమ్మించి..

ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పనే లక్ష్యంగా తమ సంస్థ పని చేస్తున్నట్టు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుధాకర్‌ ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను నమ్మించారు. అప్పుడప్పుడు గ్రామాలలో చిన్న చిన్న కార్యక్రమాలు చేసి ప్లాస్టిక్‌ చెత్త డబ్బాలు పంపిణీ, అంగన్‌వాడీ కేంద్రాలలోని పిల్లలకు పలకలు, పుస్తకాలు పంపిణీ చేసేవారు. రాజకీయ నాయకులతో ఫొటోలు దిగుతూ వారితో పరిచయాలు పెంచుకునేవారు. ఇన్ని వేల మందికి జీతాలు ఎలా ఇస్తున్నారని ఎవరైనా అడిగితే గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలకు సీఎస్‌ఆర్‌ నిధులు మంజూరు అవుతున్నట్టు నమ్మించారు. జీవీఎంసీ మినహా ఉత్తరాంధ్ర జిల్లాలలో స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్‌ వాహనాల డ్రైవర్‌ పోస్టులు ఇప్పిస్తామని కొందరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 

నవంబరు నుంచి జీతాలు లేవు

గత ఏడాది నవంబర్‌ నుంచి సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. జీతాల కోసం అడిగితే బకాయిలతో సహా ఇచ్చేస్తామని ప్రతి నెలా చెప్పి నమ్మించారు. ఏదో విధంగా కట్టిన డబ్బులు రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగులు ఉండేవారు. దీంతో అందులో పని చేస్తున్న ఉద్యోగులు సైతం జీతాల బకాయిలు విషయాన్ని బయటకు పొక్కనీయకుండా స్మార్ట్‌ యోజన సంస్థను కాపాడుతూ వచ్చారు. అయితే సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చైర్మన్‌ సుధాకర్‌ అందుబాటులో ఉండకపోవడంతో అనుమానం వచ్చి బాధితులు పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. 

కంప్యూటర్లు మాయం

ఈ నెల 3వ తేదీన శివపురం కార్యాలయంలోని 25 కంప్యూటర్లు, సీపీయూలు, ప్రింటర్లు, ఒక గ్యాస్‌ సిలిండర్‌, ఒక కుర్చీ చోరీకి గురయ్యాయి. దీనిపై 4వ తేదీన సంస్థ జిల్లా ఏవో రజాక్‌ తమ కార్యాలయంలో చోరీ జరిగిందని పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. క్లూస్‌ టీమ్‌ వచ్చి వేలి ముద్రలు తీసుకున్నారు. అయితే నిరుద్యోగులను మోసం చేసి కార్యాలయం బోర్డు తిప్పేసే ఉద్దేశంతోనే కంప్యూటర్లు మాయం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.

దర్యాప్తు చేస్తున్నాం

స్మార్ట్‌ యోజన వెల్ఫెర్‌ సొసైటీ నిరుద్యోగులను మోసం చేసినట్టు అందిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నాం. మునిసిపాలిటీ పరిధిలోని సుబ్బారాయుడుపాలేనికి చెందిన దేవర రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సొసైటీ చైర్మన్‌ సుధాకర్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశాం. 

- గోవిందరావు, పట్టణ ఎస్‌ఐ



Updated Date - 2022-08-10T06:24:15+05:30 IST