ఎంతో ‘స్మార్ట్‌’!

ABN , First Publish Date - 2022-08-08T07:03:22+05:30 IST

ఇప్పుడంతా స్మార్ట్‌గా మారిపోయింది. ఒంటి నుంచి ఇంటి వరకు సమస్తం స్మార్ట్‌ మయం. ఈ క్రమంలోనే ఇళ్లల్లో స్మార్ట్‌ కిచెన్లు కూడా ఏర్పాటయ్యాయి. ఈ రూటులోనే గ్యాస్‌ సిలిండర్లు కూడా స్మార్ట్‌గా మారిపోయాయి. అత్యాధునిక పరిజ్ఞానం తో ఫైబర్‌తో వీటిని తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చారు.

ఎంతో ‘స్మార్ట్‌’!

  • జిల్లాలోకి స్మార్ట్‌ గ్యాస్‌ సిలిండర్లు
  • అత్యాధునిక టెక్నాలజీతో ఫైబర్‌తో తయారీ
  • వంటింట్లో సిలిండర్ల పేలుళ్లకు చెక్‌
  • ఐదు, పది కిలోల్లో కూడా లభ్యం

సామర్లకోట, ఆగస్టు 7: ఇప్పుడంతా స్మార్ట్‌గా మారిపోయింది. ఒంటి నుంచి ఇంటి వరకు సమస్తం స్మార్ట్‌ మయం. ఈ క్రమంలోనే ఇళ్లల్లో స్మార్ట్‌ కిచెన్లు కూడా ఏర్పాటయ్యాయి. ఈ రూటులోనే గ్యాస్‌ సిలిండర్లు కూడా స్మార్ట్‌గా మారిపోయాయి. అత్యాధునిక పరిజ్ఞానం తో ఫైబర్‌తో వీటిని తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇప్ప టికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఇలా పెద్ద నగరాల్లో కొన్నినెలల క్రితం వినియోగంలోకి తీసుకొచ్చి ప్రయోగం చేసింది. అక్కడ సక్సెస్‌ కావడంతో ఇప్పుడు దేశమంతా ఈ ఫైబర్‌ స్మార్ట్‌ గ్యాస్‌ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ రకం సిలిండర్లను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇకపై వంటింట్లో సిలిండర్లు పేలుతున్నా యన్న భయాలు కూడా ఉండవని సంబంధిత కంపెనీ ప్రతినిధులు ఆంధ్రజ్యోతికి శనివారం తెలిపారు. 

స్మార్ట్‌ సిలిండర్‌ ప్రత్యేకత

ఇనుముతో తయారు చేసిన సిలిండర్‌ను మోసుకెళ్లాలంటే చాలా భారంగా ఉంటుంది. గ్యాస్‌ ఎంత ఉందో తెలుసుకోవడం కూడా కష్టమే. ఇనుముతో తయారు చేసిన సిలిండర్‌ గ్యాస్‌ లేకుండా 16 కిలోలు ఉండగా ఫైబర్‌తో తయారుచేసిన స్మార్ట్‌ సిలిండర్‌ 6.3 కిలో లు మాత్రమే ఉంటుంది. ఫైబర్‌ సిలిండర్‌లో ఎంతగ్యాస్‌ ఉందో సుల భంగా తెలుసుకోవచ్చు. కొత్త సిలిండర్‌ లోపలి భాగం గోడలు ఫైబర్‌ తో మూడు వరుసలుగా తయారు చేయడంతో తీవ్ర ఒత్తిడిని తట్టు కుంటుంది. గ్యాస్‌ ఒత్తిడి అధికమైతే సిలిండర్‌ లోపలి భాగంలో ఉండే గోడలు మెత్తబడతాయి. తద్వారా పేలే అవకావం తక్కువగా ఉంటుంది. ఐరన్‌ సిలిండర్లపై నీరు పడితే తుప్పు పడతాయి. ఫైబర్‌ సిలిండర్‌తో ఆ ఇబ్బంది ఉండదు.

జిల్లాలోకి రెండు రకాల స్మార్ట్‌ సిలిండర్లు

రెండు రకాల ఫైబర్‌ సిలిండర్లను ఐవోసీ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. పదికిలోలు, ఐదు కిలోల్లో వినియోగదారులకు అంది స్తోంది. పది కిలోల సిలిండర్‌కు రూ.3,350, ఐదు కిలోల సిలిండర్‌కు రూ.2,150 చొప్పున డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. రూ.778 చెల్లించి పది కిలోల సిలిండర్‌ను రూ.406 చెల్లించి ఐదు కిలోల సిలిండర్‌ల్లో గ్యాస్‌ నింపుకోవచ్చు. ఇనుప సిలిండర్‌ను సంస్థకు ఇచ్చేస్తే గతంలో చెల్లించిన డిపాజిట్‌ డబ్బులు తిరిగిచ్చేస్తారు. ఫైబర్‌ సిలిండర్‌ కోసం కొత్తగా డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది.

అందుబాటులోకి కొత్త సిలిండర్లు

మనకు కూడా ఈ ఫైబర్‌ గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం బెంగళూరు, కడప, కర్నూలు, హిందూపురం తదితర ప్రాంతాల్లో తొలిసారిగా అడుగిడాయి. ఈ ప్రాంతంలోనే స్మార్ట్‌ గ్యాస్‌ సిలిండర్ల ఫిల్లింగ్‌ ప్లాంట్‌లు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో 1200 వరకూ ఈ స్మార్ట్‌ గ్యాస్‌ సిలిండర్ల వినియోగదారులు ఉన్నట్లు సమాచారం. త్వరలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఫైబర్‌ గ్యాస్‌ సిలిండర్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానున్నట్లు సంస్థ వర్గాల ద్వారా తెలిసింది. ఈ కారణంగా ముందుగా కాకినాడ జిల్లా సామర్లకోట, పెద్దాపురం, కాకినాడ, పిఠాపురం తదితర ప్రాంతాల్లో స్మార్ట్‌ గ్యాస్‌ సిలిండర్ల వినియోగానికి విస్తృతంగా ప్రచారం ప్రారంభించాయి.

Updated Date - 2022-08-08T07:03:22+05:30 IST