Abn logo
Sep 24 2021 @ 01:32AM

ప్రతి విద్యార్థికీ స్మార్ట్‌ విద్య

  • అమెరికాలో అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌తో ప్రధాని నరేంద్రమోదీ
  • ఐదు ప్రముఖ కంపెనీల సీఈవోలతో సమావేశం
  • రక్షణ పరిజ్ఞానం, పీఎల్‌ఐ తదితర అంశాలపై 
  • జనరల్‌ ఆటమిక్స్‌ సీఈవో వివేక్‌ లాల్‌తో చర్చ
  • ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌మోరిసన్‌తో సమావేశంలో
  • ఇరుదేశాల నడుమ ఆర్థిక సంబంధాలపై చర్చ
  • అమెరికా పర్యటన మొదటిరోజు బిజీబిజీగా మోదీ


భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు వాషింగ్టన్‌ డీసీలోని ఆండ్రూస్‌ జాయింట్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న భారతీయులు.. జాతీయపతాకాలను చేబూని ఉత్సాహంగా ఆయనకు స్వాగతం పలికారు. ఇందుకు వారికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రవాసులే భారత్‌ బలమని అభివర్ణించారు.


వాషింగ్టన్‌, సెప్టెంబరు 23: ఐదు దిగ్గజ సంస్థల సీఈవోలతో భేటీ.. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారి్‌సతో సమావేశాలతో.. ప్రధాని మోదీ అమెరికా పర్యటన మొదటి రోజు బిజీబిజీగా సాగింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌మోరిసన్‌తో జరిగిన సమావేశంలో.. ఇరుదేశాల నడుమ ఆర్థిక, ప్రజల మధ్య పరస్పర సంబంధాల బలోపేతంపై ప్రధానంగా చర్చించినట్టు ప్రధాని కార్యాలయం ట్విటర్‌ ద్వారా తెలిపింది. ఆస్ట్రేలియాతో స్నేహబంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు పేర్కొంది. ఆస్ట్రేలియాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఈ భేటీ మరో అధ్యాయంగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ అభివర్ణించారు. ఇరు ప్రధానుల మధ్య భేటీలో.. కొవిడ్‌-19, వాణిజ్యం, రక్షణ, శుద్ధ ఇంధనం తదితర ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చినట్టు ఆయన తెలిపారు.


భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11 గంటల సమయలో మోదీ-మోరిసన్‌ భేటీ జరిగింది. ఈ భేటీకి ముందు.. అమెరికాకు చెందిన ఐదు ప్రముఖ కంపెనీల సీఈవోలతో ప్రధాని విడివిడిగా సమావేశమయ్యారు.ఆ ఐదుగురూ.. క్వాల్‌కామ్‌ సీఈవో క్రిస్టియానో ఈ అమన్‌, అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌, ఫస్ట్‌ సోలార్‌కు చెందిన మార్క్‌ విడ్‌మర్‌, జనరల్‌ ఆటమిక్స్‌కు చెందిన వివేక్‌ లాల్‌, బ్లాక్‌స్టోన్‌ కంపెనీకి చెందిన స్టీఫెన్‌ ఏ ష్వార్జ్‌మాన్‌. వీరిలో శంతను నారాయణ్‌, వివేక్‌లాల్‌ భారతీయ-అమెరికన్లు కావడం విశేషం. ఈ ఐదు కంపెనీల్లో అడోబ్‌ ఐటీ, డిజిటల్‌ రంగానికి ప్రతినిధికాగా.. జనరల్‌ ఆటమిక్స్‌ సంస్థ సైనిక డ్రోన్‌ పరిజ్ఞానంలో ముందంజలో ఉంది. ఫస్ట్‌ సోలార్‌.. సౌరశక్తి రంగంలో, బ్లాక్‌స్టోన్‌ పెట్టుబడుల రంగంలో, క్వాల్‌కామ్‌ సెమీకండక్టర్‌ చిప్‌ల రంగంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి సంస్థలు.ఇవీ చర్చకు..

అడోబ్‌ సీఈవో తనను తాను మోదీ అభిమాని/మద్దతుదారుగా అభివర్ణించుకుంటారు. శంతనూతో భేటీలో మోదీ డిజిటల్‌ ఇండియా పథకం గురించి ప్రధానంగా చర్చించారు. ఆరోగ్యం, విద్య, పరిశోధన రంగాల్లో డిజిటల్‌ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడంపై వీరి చర్చ సాగింది. అలాగే.. కృత్రిమ మేధ, స్టార్టప్‌ సంస్థల ప్రాముఖ్యం గురించి కూడా తమ చర్చలో ప్రముఖంగా ప్రస్తావన వచ్చిందని శంతనూ నారాయణ్‌ తెలిపారు.


‘‘అడోబ్‌ సంస్థ భారతదేశంలో ఇంకా ఏం చేయగలదనే అంశంపైనా మేం మాట్లాడుకున్నాం’’ అని ఆయన వెల్లడించారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసులే జరుగుతున్నందున.. భారత్‌లోని ప్రతి విద్యార్థికీ వీడియో, యానిమేషన్‌ విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆకాంక్షను శంతను వెలిబుచ్చినట్టు సమాచారం. ప్రతి విద్యార్థికీ స్మార్ట్‌ విద్యను అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమంటూ మోదీ కూడా ఆయనతో ఏకీభవించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత కొవిడ్‌ శకంలో డిజిటల్‌ విద్యకు ఒక భూమిక ఏర్పడిందని.. దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. 


 దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో భాగంగా ముప్పై ప్రిడేటర్‌ డ్రోన్లను కొనే యోచనలో భారత్‌ ఉన్న నేపథ్యంలో.. మిలటరీ డ్రోన్ల తయారీలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి సంస్థగా పేరొందిన జనరల్‌ ఆటమిక్స్‌ సీఈవో వివేక్‌లాల్‌తో ప్రధాని  భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. వివేక్‌లాల్‌ జకార్తాలో జన్మించిన భారత సంతతి వ్యక్తి. ప్రస్తుతం కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. గత ఏడాదే జనరల్‌ ఆటమిక్స్‌ సీఈవోగా నియమితులయ్యారు. ఆయనతో భేటీలో ప్రధాని మోదీ.. భారత రక్షణ పరిజ్ఞాన రంగం బలోపేతం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం, ఇతర సంస్కరణల గురించి చర్చించారు.


 చిప్‌ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన క్వాల్‌కామ్‌ సీఈవో క్రిస్టియానో అమన్‌తో మోదీ భేటీ అయ్యారు. భారత్‌లో 5జీ, పీఎం వాణి తదితర ప్రాజెక్టులపై సహకారంపై అమన్‌ ఆసక్తి చూపారు.  భారత్‌లో టెలీకమ్యూనికేషన్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ రంగాల్లో పెట్టుబడుల గురించి అమన్‌తో ప్రధాని చర్చించారు.


 దేశంలో సౌరశక్తి వినియోగాన్ని గణనీయంగా పెంచడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా.. ఫస్ట్‌ సోలార్‌ సీఈవో మార్క్‌ విడ్మర్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఫోటోవోల్టాయిక్‌’ సెల్స్‌ సరఫరాదారు. అమెరికాలోని అరిజోనాకు చెందిన ఈ కంపెనీ.. మనదేశంలో 68.4 కోట్ల డాలర్ల (దాదాపు రూ.5 వేల కోట్ల) విలువైన, 3.3 గిగావాట్ల సామర్థ్యం కలిగిన కేంద్రం ఏర్పాటుపై ఇటీవలే ఒక ప్రకటన చేసింది. 


 బ్లాక్‌స్టోన్‌ సంస్థ ప్రపంచంలోని అగ్రశ్రేణి పెట్టుబడుల సంస్థల్లో ఒకటి. పెన్షన్‌ ఫండ్లు, భారీ సంస్థలు, వ్యక్తుల తరఫున ఈ సంస్థ పెట్టుబడులు పెడుతుంది. బ్లాక్‌స్టోన్‌ సీఈవో ష్వార్జ్‌మాన్‌తో భేటీ భారతదేశంలో పెట్టుబడులకు మరింత ఊతమివ్వనుందని ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది. 


ఈ రెండ్రోజుల్లో...

ప్రధాని మోదీ ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో భేటీ కానున్నారు. ఆ తర్వాత క్వాడ్‌ (భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌) దేశాధినేతల తొలి భౌతిక సమావేశం జరుగుతుంది. దీనికి బైడెన్‌ ఆతిథ్యం ఇస్తారు.  బైడెన్‌ అమెరికా ప్రధానిగా పగ్గాలు చేపట్టాక మోదీతో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడారుగానీ.. ముఖాముఖి కలుసుకోవడం ఇదే. పర్యటన చివరిరోజు మోదీ ఐక్యరాజ్యసమితి 76వ వార్షిక సర్వసభ్యసమావేశాల్లో ప్రసంగిస్తారు.  కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో భారతీయులతో సభ ఏదీ నిర్వహించట్లేదు. 


ఆకు్‌సలో భారత్‌ ఉండబోదు

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత ప్రధాన ఉద్దేశంగా ఏర్పాటైన ఆస్ట్రేలియా-బ్రిటన్‌-అమెరికా(ఆకు్‌స)కూటమిలో భారత్‌ ఉండబోదని అమెరికా తేల్చిచెప్పింది. జపాన్‌కూ చోటు ఉండబోద ని స్పష్టం చేసింది. గత వారం జరిగిన త్రైపాక్షిక చర్చల్లో భాగంగా ఆకుస్‌ ఆవిర్భావాన్ని మూడు దేశాలు ప్రకటించాయి.అఫ్ఘాన్‌.. టెర్రరిస్టుల అడ్డా కారాదు


అఫ్ఘాన్‌ గడ్డ టెర్రరిస్టులకు అడ్డా కారాదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పునరుద్ఘా టించారు. ఐక్యరాజ్య సమితి(ఐరాస) 76వ సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో జీ20 దేశాల విదేశాంగ మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఈ విషయంపై తాలిబాన్లు హామీ ఇచ్చారని, వారు దానికి కట్టుబడి ఉండేలా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సందర్భంలో జీ4 దేశాల (భారత్‌, బ్రెజిల్‌, జర్మనీ, జపాన్‌) విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్‌ మాట్లాడుతూ.. ఐరాస భద్రతా మండలిలో మార్పులు అనివార్యమని, శాశ్వత దేశాలు, సభ్యదేశాల సంఖ్య పెరగాలని అన్నారు.


తాజా వార్తలుమరిన్ని...