Abn logo
Sep 25 2021 @ 23:42PM

స్మార్ట్‌ సిటీ పనులు త్వరగా పూర్తి చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌

 - కరీంనగర్‌ పచ్చదనంతో వెల్లివిరియాలి

-  మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 25: కరీంనగర్‌లో చేపడుతున్న స్మార్ట్‌సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, మేయర్‌ వై సునీల్‌రావుతో కలిసి స్మార్ట్‌ సిటీ పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో కురిసే చిన్నపాటి వర్షాలకే రోడ్లు జలమయం అవుతున్నాయని, వర్షపు నీరు రోడ్లుపై నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారం చేయకుండా కట్టడి చేయాలని, పాదచారులు ఫుట్‌పాత్‌లపై నడిచి వెళ్లేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. స్మార్ట్‌సిటీ బోర్డు అధికారులతో సమావేశం నిర్వహించుకుని ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. టవర్‌సర్కిల్‌ ప్రాంతంలో స్మార్ట్‌సిటీ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లను త్వరగా పూర్తి చేయాలని, రైతులు, వ్యాపారులు కూరగాయలు మార్కెట్లలోనే విక్రయించుకునేలా చూడాలని అన్నారు. రోడ్లపై కూరగాయలు విక్రయించడం వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు వస్తున్నాయని, వీటిని నివారించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. డంప్‌ యార్డు పనులు పూర్తి చేయాలన్నారు. మేయర్‌ సునీల్‌రావు మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ పనుల్లో కాంట్రాక్టర్లు అలసత్వం ప్రదర్శించకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. రోడ్లపై వర్షపునీరు సాఫీగా వెళ్లేందుకు ఫుట్‌పాత్‌ల కింద గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. శాతవాహన యూనివర్సిటీ, పద్మనగర్‌ వద్ద రోడ్డుపై వర్షపు నీరు నిలువకుండా ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ నగరంలో స్మార్ట్‌ సిటీ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామనితెలిపారు. పచ్చదనం పరిశుభ్రతకు పెద్దపీట వేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.  సమావేశంలో సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమ అగర్వాల్‌, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి, మున్సిపల్‌ కమిషనర్‌ యాదగిరి రావు, ఆర్‌అండ్‌బి, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు, స్మార్ట్‌సిటీ అధికారులు, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. 

- నిరుపేదలకు వరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు నిరుపేదలకు వరంగా మారాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం  కలెక్టరేట్‌ ఆడిటోరియంలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మంత్రి గంగుల కమలాకర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్‌ నాయకత్వంలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. కరీంనగర్‌ రూరల్‌ మండలానికి చెందిన 33, అర్బన్‌ మండలానికి చెందిన 164 మంది లబ్ధిదారులకు రెండు కోట్ల 30 లక్షల 26 వేల 680 రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణిహరిశంకర్‌, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, ఎంపీపీ రాణి, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ పాల్గొన్నారు.