బీడీ కార్మికుల ఆసుపత్రికి సుస్తీ

ABN , First Publish Date - 2022-05-05T05:14:17+05:30 IST

దుబ్బాక అంటేనే బీడీ పరిశ్రమకు పెట్టింది పేరు.. వేలాది మంది బీడీ పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్నారు. ఇదే పరిశ్రమతో వచ్చే ఆరోగ్య దుష్పరిణామాల నుంచి కార్మికులను రక్షించేందుకు సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం దుబ్బాకలో ఆసుపత్రిని ప్రారంభించారు. కేంద్రకార్మిక శాఖ బీడీ సంక్షేమ నిధి నుంచి ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని ప్రస్తుతం పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.

బీడీ కార్మికుల ఆసుపత్రికి సుస్తీ

సొంత భవనంలేక అవస్థలు

సకాలంలో అందని మందులు

సంచార సేవలకు మంగళం


దుబ్బాక, మే 4 : దుబ్బాక అంటేనే బీడీ పరిశ్రమకు పెట్టింది పేరు.. వేలాది మంది బీడీ పరిశ్రమను నమ్ముకుని  జీవిస్తున్నారు. ఇదే పరిశ్రమతో వచ్చే ఆరోగ్య దుష్పరిణామాల నుంచి కార్మికులను రక్షించేందుకు సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం దుబ్బాకలో ఆసుపత్రిని ప్రారంభించారు. కేంద్రకార్మిక శాఖ బీడీ సంక్షేమ నిధి నుంచి ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని ప్రస్తుతం పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. 

దుబ్బాకలో ఉన్న సుమారు 20 వేల మంది బీడీ కార్మికులతోపాటు చుట్టూ ఉన్న మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాల నుంచి ఇదే ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందేవారు. నియోజకవర్గంలో పీఎఫ్‌, నాన్‌పీఎ్‌ఫ కార్మికులు 60వేల మందికిపైగా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఇదే ఆసుపత్రి నాణ్యమైన వైద్యం అందించేది. కేంద్రం నుంచి వచ్చే మందులతో రోగులకు అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం ఉండేది. దుబ్బాకలో బీడీ పరిశ్రమతోపాటు అనుబంధంగా చేనేత పరిశ్రమ ఉండటంతో ఎక్కువ మందికి ఆస్తమా, టీబీ వ్యాధులతో బాధపడేవారు. వారి కుటుంబసభ్యులు బీడీ కార్మికులుగా ఉండటంతో వీరికి ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగంగా ఉండేది. రోజురోజుకూ బీడీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడంతో ఈ ఆసుపత్రికి ప్రాధాన్యం తగ్గింది.


గతంలో రోజూ 150మందికి ఓపీ సేవలు

గతంలో సుమారు 150 మందికిపైగా బీడీకార్మికులకు  ఓపీ ఉండేది. ప్రస్తుతం 20 మంది రావడంలేదు. ఆసుపత్రికి సొంత భవనం లేదు. సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరైన భవనం అద్దెకు దొరకకపోవడంతో అవస్థలు తప్పడంలేదు. దీనికి తోడు ప్రతీరోజు సంచార వైద్యం అందించేవారు. పగటి పూట వారానికి 5 గ్రామాల చొప్పున తిరిగి వైద్యం అందించాల్సి ఉంటుంది. అయితే 20 ఏళ్ల క్రితం అందించిన వాహనం ప్రస్తుతం నడిచే పరిస్థితి లేదు. దీంతో సంచార వైద్యానికి దూరంగా ఉంటుంది. కరోనా పరిస్థితులు ఏర్పడిన నాటి నుంచి కేంద్ర నుంచి సరిగ్గా మందులు కూడా అందడంలేదు. దీని మూలంగా కార్మికులు ఆసుపత్రికి రావడం పూర్తిగా తగ్గించారు. బీడీ కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో సూది మందు కూడా ఇచ్చేందుకు స్టాఫ్‌నర్సు దిక్కులేదు. ఒక డాక్టర్‌, ఫార్మాసిస్టు, డ్రైవర్‌తోనే డిస్పెన్సరీ ఆసుపత్రిని నడిపించాల్సి వస్తున్నది. సుమారు 60 వేల మంది కార్మిక కుటుంబాలకు నాణ్యమైన మందులను అందించి, చికిత్సను అందించే ఆసుపత్రి మంచాన పడింది. 


Read more