Abn logo
May 14 2021 @ 23:33PM

సేవల్లో అలసత్వం

హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారికి అందని సాయం

ముందుల కిట్‌లో కానరాని యాంటీ బయాటిక్స్‌

ఆశ వర్కర్ల దగ్గర పనిచేయని పల్స్‌ ఆక్సీమీటర్లు

జీవీఎంసీ సర్వేలన్నీ తూతూ మంత్రం

విమ్స్‌కు సౌకర్యాల కొరత 

జ్ఞానాపురం శ్మశానంలో ఆగని వసూళ్లు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


విశాఖపట్నంలో కరోనా బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన సౌకర్యాలేవీ సక్రమంగా అందడం లేదు. చాలావరకు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. ఉన్నతాధికారులు కొందరు...దిగువ స్థాయి సిబ్బందికి బాధ్యతలు బదలాయించి, చేతులు దులుపుకుంటున్నారు. నగరంలో జ్వరాలు ఎంతమందికి వున్నాయో సర్వే చేయమంటే..వార్డు వలంటీర్లకు అప్పగించి, రెండు రోజుల్లో పూర్తయిపోయిందని కాకి లెక్కలు ఇస్తున్నారు. ఎవరి ఇళ్లకు వెళ్లకుండానే నివేదికలు తయారైపోతున్నాయి. ఒక్క విశాఖపట్నం నగరంలోనే 15 వేల మంది కరోనాతో హోమ్‌ ఇసోలేషన్‌లో ఉన్నారు. వారికి కరోనా కిట్‌ అందించి, నిత్యం పర్యవేక్షించాల్సిన బాధ్యత వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించారు. అయితే 80 శాతం మందికి ఎటువంటి వైద్య సాయం అందడం లేదు. నగర శివార్లలో కొందరికి కరోనా కిట్‌ ఇస్తున్నారు. అందులో జ్వరం తగ్గించే పారాసిటామల్‌, విటమిన్‌ మాత్రలే ఉంటున్నాయి. యాంటీ బయాటిక్స్‌ ఏమీ ఇవ్వడం లేదు. అవి కూడా 100 మందిలో 20 మందికే ఇస్తున్నారు. లెక్కలు మాత్రం అన్నీ జరిగిపోతున్నట్టుగానే చెబుతున్నారు.


పనిచేయని పల్స్‌ ఆక్సీమీటర్లు


హోమ్‌ ఐసోలేషన్‌లో వున్న వారికి ఆక్సిజన్‌ తనిఖీ చేయాలంటే పల్స్‌ ఆక్సీమీటర్‌ ఉండాలి. వీటిని గతంలో ఆశ వర్కర్లకు ఇచ్చారు. అప్పుడు కంటే ఇప్పుడే వాటి అవసరం ఎక్కువగా ఉంది. అయితే చాలామంది దగ్గర ఆ ఆక్సీమీటర్లు లేవు. ఉన్నా పనిచేయడం లేదు. గతంలో కరోనా పాజిటివ్‌ రాగానే వారిని వలంటీర్లు దగ్గరుండి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తీసుకువెళ్లి చేర్పించేవారు. ఇప్పుడు ఊపిరి పోతున్నదని చెప్పినా కనీసం స్పందించడం లేదు. దీనిపై మంత్రివర్యులు సమీక్షించి, పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం చాలా ఉంది.


ఎక్కడా పట్టించుకోవడం లేదు


- ఆనందపురం చందక గ్రామంలో ఈ నెల ఒకటో తేదీన ఐదుగురు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ అని వచ్చింది. ఏఎన్‌ఎం ఫోన్‌ చేసి, మీకు కరోనా వచ్చిందని చెప్పిందే తప్ప ఇప్పటివరకు వారికి ఇంటికి వెళ్లలేదు. ఒక్క మందు బిళ్ల ఇవ్వలేదు.

- ఎన్‌ఏడీ దగ్గర శాంతినగర్‌లో కిరణ్‌కుమార్‌ అనే యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. హోమ్‌ ఇసోలేషన్‌లో ఉండి, డాక్టర్‌ చెప్పిన మందులు వాడుతున్నారు. వారం రోజులకు కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. మీకు పాజిటివ్‌ కదా? ఏఎన్‌ఎం, ఆశ వర్కర్‌ వచ్చి మందులు ఏమైనా ఇచ్చారా? అని అడిగారు. ఎవరూ రాలేదని చెబితే..త్వరలోనే వస్తారని చెప్పారు. ఇంకో వారం అయిపోయింది. కనీసం వార్డు వలంటీరు కూడా వారింటికి వెళ్లలేదు.

- పద్మనాభంలోని పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, మరో తొమ్మిది మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. దాంతో అక్కడివారికి కరోనా సేవలు అందడం లేదు.


విమ్స్‌కు మందులు, మాస్కులు కొరత


విమ్స్‌ పరిస్థితి అన్నింటి కంటే చాలా భిన్నం. ఇక్కడ ఆక్సిజన్‌ సామర్థ్యం కేవలం 300 పడకలకే. అంతకు మించిన పడకలకు ఆక్సిజన్‌ అవసరమైన స్థాయిలో అందదు. అందుకే అక్కడ ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ఆక్సిజన్‌ సరఫరాలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ఎంతో అవసరమైన వెంటిలేటర్లలో సగం మరమ్మతులతో మూలకు చేరాయి. వాటిని బాగు చేసే దిక్కు లేదు. ఇక్కడ రోగులకు గతంలో మంచి ముందులు, ఇంజక్షన్లు ఇచ్చేవారు. ఇప్పుడు తగినన్ని రాకపోవంతో ఆక్సిజన్‌, మాత్రలతోనే సరిపెడుతున్నారు. సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు, మాస్క్‌లు ఇండెంట్‌ పెట్టి వారం అయినా ఇవ్వడం లేదు. వందల సంఖ్యలో సిబ్బంది ప్రమాదకరమైన వాతావరణంలో పనిచేసే చోట ఆరోగ్య రక్షణకు తగిన వసతులు సమకూర్చకపోతే ఎలాగనే భావన సిబ్బందిలో వ్యక్తమవుతోంది. 


రెమ్‌డెసివర్‌ లెక్క తేల్చాలి


రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల కేటాయింపు, సరఫరాలో పెద్ద గోల్‌మాల్‌ జరుగుతోంది. ఈ రోజు వరకు జిల్లాకు వచ్చిన ఇంజక్షన్లు, వాటి కేటాయింపు వివరాలు ఒక్క అధికారి కూడా బయటకు వెల్లడించలేదు. ఎన్ని ఆరోపణలు వస్తున్నా...భరిస్తున్నారే తప్ప నోరు విప్పడం లేదు. ఇవి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు అందరికీ అవసరం కాబట్టి పేదల పేరు చెప్పి వారికి ఇస్తున్నారే విమర్శలూ ఉన్నాయి. అందుకే ఈ అంశంపై ఎవరూ మాట్లాడం లేదు. 


బోర్డు పెడితే..దోపిడీ ఆగుతుందా?


జ్ఞానాపురం శ్మశాన వాటికలో దోచుకు తింటున్నారు. అక్కడ దహనానికి రూ.3 వేలు అని బోర్డు పెట్టి అధికారులు చేతులు దులుపుకొన్నారు. బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు. కానీ ఇప్పటికీ అక్కడ దోపిడీ ఆగలేదు. ఒక్కరిపై కూడా చర్య లేదు.


104లో ఏమి జరుగుతోంది?


ఊపిరి అందడం లేదని ప్రతి ఒక్కరూ ఆక్సిజన్‌ బెడ్‌ కోసం ప్రైవేటు ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. ఎవరో ఒకరు పెద్దలు సిఫారసు చేస్తే తప్ప పడక ఇవ్వడం లేదు. 104కి ఫోన్‌ చేస్తే ఒకంతట కనెక్ట్‌ కాదు. దాని నుంచి సాయం పొందిన వారి సంఖ్య చాలా స్వల్పం. అందులో లోపాలు ఏమిటో చెప్పరు. సవరించరు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి చర్యలు చేపడితే...కరోనా రోగులకు ప్రభుత్వం ప్రకటించిన సేవలు అందే అవకాశం ఉంది. లేదంటే...సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలాగే ఉంటుంది.

Advertisement