మెల్లమెల్లగా ముంచుతున్నారు!

ABN , First Publish Date - 2020-09-27T08:47:02+05:30 IST

కడప జిల్లా గండికోట ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలను కొంచెం కొంచెంగా ముంచుతున్నారు...

మెల్లమెల్లగా ముంచుతున్నారు!

  • గండికోటలో 16 టీఎంసీల నిల్వ 
  • 10రోజుల్లోనే 4 టీఎంసీల పెంపు
  • తాళ్లప్రొద్దుటూరులో మునిగిన  కాలనీలు 
  • బిక్కుబిక్కుమంటున్న ముంపు బాధితులు 


(కడప-ఆంధ్రజ్యోతి)

కడప జిల్లా గండికోట ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలను కొంచెం కొంచెంగా ముంచుతున్నారు. ఈ ఒక్క ఏడాది అవకాశం ఇస్తే, ఇళ్లు కట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్తామని కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు మహిళలు అందోళనకు దిగిన సంగతి తెలిసిందే. 12.04 టీఎంసీలు నిల్వ చేస్తే, ఆ గ్రామానికి ఎలాంటి ముంపు ఉండదు. కానీ, ఈ ఏడాది 23 టీఎంసీలు నిల్వ చేస్తామని సీఎం జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా అధికారులు జలాశయంలో నీటిమట్టాన్ని క్రమంగా పెంచుతున్నారు. ఈ నెల 15న 12.52 టీఎంసీలు నిల్వచేశారు. 22నాటికి 13.98 టీఎంసీలకు పెంచారు. అప్పటికే బీసీ, ఎస్సీ కాలనీల్లో కొన్ని ఇళ్లు నీట మునిగాయి. అక్కడితో ఆగకుండా 24న 14.50 టీఎంసీలు, 25వ తేదీకి 15 టీఎంసీలకు పెంచిన ఇరిగేషన్‌ అధికారులు శనివారం నీటి నిల్వను 16 టీఎంసీలకు చేర్చారు. తాళ్లప్రొద్దుటూరు బీసీ, ఎస్సీ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో దిక్కుతోచని స్థితిలో బాధితులు మూటాముల్లె సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

Updated Date - 2020-09-27T08:47:02+05:30 IST