ఒకే రోజు పది లక్షలకు పైగా కరోనా పరీక్షలు.. రికార్డు కొట్టిన స్లొవేకియా

ABN , First Publish Date - 2020-11-01T10:26:44+05:30 IST

యూరప్‌లోని స్లొవేకియా దేశం కరోనా పరీక్షల్లో సరికొత్త రికార్డును సాధించింది. శనివారం ఒక్కరోజే స్లొవేకియా ప్రభుత్వం పది లక్షలకు పైగా

ఒకే రోజు పది లక్షలకు పైగా కరోనా పరీక్షలు.. రికార్డు కొట్టిన స్లొవేకియా

బ్రాటిస్లావా: యూరప్‌లోని స్లొవేకియా దేశం కరోనా పరీక్షల్లో సరికొత్త రికార్డును సాధించింది. శనివారం ఒక్కరోజే స్లొవేకియా ప్రభుత్వం పది లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా అతిచిన్న దేశాల్లో ఏ దేశం కూడా ఈ రికార్డును సాధించలేదు. స్లొవేకియా జనాభా కేవలం 55 లక్షలు. అయితే ప్రభుత్వం వారాంతంలోనే దేశం మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించి కరోనా మహమ్మారిని నియంత్రించాలని సంకల్పంగా పెట్టుకుంది. కరోనా పరీక్షల కోసం దాదాపు 5 వేల టెస్టింగ్ సైట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కనీసం 40 వేల మెడికల్ వర్కర్లు, వలంటీర్లు, సైనికులు ఇందులో పాలుపంచుకుంటున్నారు.


సోమవారం నాటికి పది కంటే వయసు పైబడిన ప్రతిఒక్కరు కరోనా పరీక్ష చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో 60కు పైబడిన వారు కూడా గంటల కొద్దీ లైన్లలో నిల్చుని కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. మరోపక్క పరీక్ష ఫలితాలు కూడా 30 నిమిషాల్లోనే వచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పీసీఆర్ పద్దతి కాకపోవడంతో.. 100 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం లేదు. దీంతో వచ్చే వారం రెండో రౌండ్ టెస్టింగ్‌కు అధికారులు సిద్దమవుతున్నారు. కాగా.. స్లొవేకియాలో శనివారం 2,573 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 57,664కు చేరుకుంది. మరోపక్క కరోనా బారిన పడి మొత్తం 219 మంది మృత్యువాతపడ్డారు.  

Updated Date - 2020-11-01T10:26:44+05:30 IST