కనెక్షన్‌.. కలెక్షన్‌!

ABN , First Publish Date - 2020-09-27T11:12:36+05:30 IST

:కాసులకు కక్కుర్తిపడి అధికారులు నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. పైసలిస్తే చాలు అక్రమంగా కుళాయిని పెట్టేస్తున్నారు.

కనెక్షన్‌.. కలెక్షన్‌!

 గ్రామాల్లో అక్రమంగా కుళాయిలు

 అధికారులతో కలసి చోటా నాయకుల దందా

 ప్రజలకు తప్పని తాగునీటి ఇక్కట్లు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి):కాసులకు కక్కుర్తిపడి అధికారులు నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. పైసలిస్తే చాలు అక్రమంగా కుళాయిని పెట్టేస్తున్నారు. రెండు పూటలా తాగునీరు అందించండి మహాప్రభో అని ప్రజలు వేడుకున్నా పెడచెవిన పెట్టే అధికారులు.. గ్రామాల్లో చోటా నాయకులు, దళారులు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి అడ్డగోలుగా కుళాయి కనెక్షన్లు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


జిల్లాలో గత ఆర్నెళ్లుగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామీణ నీటి సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. పలు గ్రామాల్లో నిర్వహణ లేని రక్షిత పథకాలకు మరమ్మతులు చేపట్టింది. అంతవరకు బాగానే ఉన్నా, ఆ పథకాల నిర్వహణ మాత్రం గాలికొదిలేస్తోంది. గ్రామ పంచాయతీలే చూసుకోవాలనే సాకుతో నిధులు ఖర్చు చేసి చేతులు దులుపుకొంటోంది.


ఇదే అదునుగా భావించిన గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు అధికార పార్టీకి చెందిన చోటా నేతలు రక్షిత పథకాల నుంచి ఇంటింటికీ అక్రమ కుళాయిలు ఏర్పాటు చేయిస్తామని చెప్పి వేల రూపాయిలు దండుకుంటున్నారు. ఎచ్చెర్ల మండలం దుప్పలవలస గ్రామంలో ఓ చోటా నాయకుడు స్థానిక నేతలతో కలిసి అక్రమ కుళాయి కనెక్షన్లకు వేల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే కొందరు గ్రామ సచివాలయ సిబ్బందితో పాటు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.


ఇదే మండలం పెయ్యవానిపాలెంలో కూడా మరోనేత ఇదే విధంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సంతబొమ్మాళి, తదితర మండలాల్లో ఇటువంటి పరిస్థితే నెలకొంది. అధికారులు కాసులకు కక్కుర్తిపడి దొడ్డిదారిన అక్రమ కుళాయిలు ఇచ్చేస్తున్నారని, దీనివల్ల చెంతనే రక్షితనీటి పథకం ఉన్నా గ్రామాల్లో తాగునీటి కొరత ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


 పట్టించుకోని అధికారులు

పంచాయతీకి నగదు చెల్లిస్తే.. ఇంటింటికీ కుళాయి ఇస్తామంటూ కొందరు ప్రచారం చేసుకొని దందాకు పాల్పడుతున్నారు. వాస్తవానికి గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలనలోనే ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా నియమించిన సచివాలయ సిబ్బంది గ్రామాల్లోని కుళాయిల వివరాలు సేకరించి అక్రమ  కనెక్షన్లపై  పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయాల్సి వుంది.


కానీ, సచివాలయ ఉద్యోగులు స్థానిక నేతల సిఫారసులకు అనుగుణంగా నడుచుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికులు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, రెవెన్యూ అధికారులు ఈ అక్రమ కుళాయి కనెక్షన్ల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-09-27T11:12:36+05:30 IST