అలసత్వంతో పెరిగిన ఉపద్రవం

ABN , First Publish Date - 2020-04-08T05:47:16+05:30 IST

వూహాన్‌లో 2019 డిసెంబర్‌లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచమంతా విస్తరిస్తూ 13 లక్షల మందికి పైగా సోకి, 75 వేల మందిని పొట్టన బెట్టుకుంది. సాంకేతిక, విజ్ఞాన రంగాల్లో అభివృద్ధి సాధించాయి...

అలసత్వంతో పెరిగిన ఉపద్రవం

‘లాక్‌డౌన్’ సందర్భంగా వ్యవసాయ పనుల కొనసాగింపు, పంట ఉత్పత్తుల అమ్మకాలు, వ్యవసాయ యంత్ర పరికరాల వినియోగానికి మినహాయింపు ఇవ్వటం అభినందనీయం. అయితే, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మధ్యన సరైన సమన్వయం లోపించడం వల్ల అమ్మకాలు, సక్రమంగా ముందుకు సాగడం లేదు. 


వూహాన్‌లో 2019 డిసెంబర్‌లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచమంతా విస్తరిస్తూ 13 లక్షల మందికి పైగా సోకి, 75 వేల మందిని పొట్టన బెట్టుకుంది. సాంకేతిక, విజ్ఞాన రంగాల్లో అభివృద్ధి సాధించాయి అని చెప్పుకునే చైనా, అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఇంగాండు వంటి దేశాలే వైరస్ మహమ్మారిని కట్టిడి చేయలేకపోతున్నాయి. నూటికి 40శాతం మంది ప్రజలు పేదరికంతో బాధపడుతూ వైద్య సౌకర్యాల లభ్యత పరిమితంగా వున్న మన దేశంలో కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టలేకపోతే సంభవించగల నష్టం ఊహాతీతం. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను విశ్లేషించుకొని కొవిడ్ 19ను మన దేశం నుంచి తరిమి వెయ్యటానికి తీసుకోవలసిన చర్యల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌర సమాజం, పౌరులు సమష్టిగా ఆలోచించవలసి వున్నది. వూహాన్‌లో చదువుకుంటూ కేరళకు జనవరి 31న వచ్చిన విద్యార్థి కరోనా పాజిటివ్‌గా దేశంలో నమోదైన తొలి కేసు.


తరువాత క్రమంగా వివిధ రాష్ర్టాలలో కరోనా ప్రభావితులు పెరుగుతూండడంతో ప్రభుత్వం స్పందించింది. దాని వ్యాప్తి నివారణ కోసం పౌరులు పాటించవలసిన మార్గదర్శకాలు ప్రకటించింది. వైరస్ ప్రభావిత దేశాల నుంచి తిరిగి వచ్చిన భారతీయులు, లేక విదేశీయులకు విమానాశ్రయాల్లోనే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమానిత కేసుల విషయంలో హోం క్వారంటైన్, ఐసోలేషన్‌లో పెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. వాప్తి నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 4న ప్రకటించారు. నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంకూడా వివిధ చర్యలను ప్రకటిస్తూ వచ్చాయి. ఎన్నో దేశాలు అనుసరిస్తున్నట్లే మన దేశంలోనూ లాక్‌డౌన్ అవసరమని మన ప్రధాని కూడా భావించారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ కోసం ఇచ్చిన పిలుపు జయప్రదమైంది. దానితో మార్చి 25 నుంచి ఈనెల 14 వరకు దేశమంతటా లాక్‌డౌన్‌ను ప్రకటించారు. వ్యవసాయ పనుల నిర్వహణకు, ఉత్పత్తుల మార్కెటింగుకు ఆటంకం కలుగకుండా చూడాలని, రైతులకు ఉపయోగపడే నిర్ణయాలతోపాటు పేదలకు, కార్మికులకు, వలస కూలీలకు మేలు చేకూర్చే మరి కొన్ని పథకాలను అమలు చేయడానికి పీఎం కళ్యాణయోజన పేరుతో 1.70 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. 


కేంద్రంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా వైద్య–ఆరోగ్య సిబ్బంది, పోలీసు యంత్రాంగం, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు మీడియా సంస్థలు, సోషల్ మీడియా ద్వారా వైరస్ నివారణకు తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూండడంతో అనుమానితుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ ఉన్న పరిస్థితులలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కాజ్ వద్ద తబ్లిగి జమాత్ మార్చి 13 నుంచి 15 వరకు నిర్వహించిన మత సమ్మేళనం వలన కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య అత్యంత వేగంగా పెరిగిపోతూ ప్రభుత్వాలకు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 50మందికి మించి ఎక్కడా ప్రజలు గుమిగూడవద్దని మార్చి 13 నుంచి ఆంక్షలు ఉన్నప్పటికీ తబ్లిగి జమాత్ సంస్థ దాదాపు రెండు వేల మందికి పైగా దేశ, విదేశీయులతో మార్చి 13 నుంచి 15 వరకు మత సమ్మేళనం నిర్వహించటం అత్యంత బాధ్యతా రాహిత్యం. అంతకు ముందు 26 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి వరకు మలేసియా రాజధాని కౌలాలంపూర్లో వేలాది మందితో జరిగిన తబ్లిగి జమాత్ మత సమ్మేళనంలో పాల్గొన్న వారిలో వందలాది మంది కరోనా పాజిటివ్ బాధితులుగా వారి నుంచి ఇంకా వేలాది మందికి మలేసియా దేశస్థులకే కాక, ఇండోనేషియా, ఇరాన్, బంగ్లాదేశ్ తదితర దేశాలకు కూడా వైరస్ వ్యాపించిందని తేలింది. అందువల్లనే ఇండోనేషియాలో నిర్వహించనున్న తబ్లిగి సమావేశాన్ని నిషేధించింది. 


ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్నప్పటికీ పోలీసు డిపార్ట్ మెంట్ పైన నియంత్రణాధికారం కేంద్ర హోంశాఖ ఆధీనంలోనే ఉంటుంది. నిజాముద్దీన్‌లో పోలీసు స్టేషన్ పక్కనే ఉన్న తబ్లిగి అంతర్జాతీయ సంస్థలో మత సమావేశాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ అడ్డుకొని నిరోధించినట్లయితే వేలాది మంది ఈ మహమ్మారి బారిన పడే ప్రమాదం, నేటి విపత్కర పరిస్థితి తప్పేది. మార్చి మొదటి వారం నుంచి వందలాది మంది ముస్లిం ప్రచారకులు టూరిస్ట్ వీసాలతో మన దేశంలోకి ప్రవేశించి ఢిల్లీలో మత సమ్మేళనానికి హాజరు కావటం, అనేక రాష్ట్రాలకు వెళ్లి మత ప్రచారం చేయటం చట్ట విరుద్ధం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ మత సంస్థ నిర్వాహకుడు సాద్పైన, చట్టాన్ని అతిక్రమించిన విదేశీయులపై తగు చర్యలు తీసుకోవాలి.


మలేసియాలో తబ్లిగి జమాత్ సమ్మేళనం వలన పలు దేశాలకు చెందిన వేలాది మంది కోవిడ్ 19కు గురయ్యారని, ఇండోనేషియా, బంగ్లాదేశ్‌ల్లో కరోనా వ్యాప్తి నిరోధానికి ఆయా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల గురించి హోం శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రధానికి, హోం మంత్రికి సరైన సమాచారం ఇచ్చి, ఈ మత సమ్మేళనం గురించి, దాని నిలుపుదల ఆవశ్యకత గురించి తెలియపరచక పోవడం ఎంత మాత్రమూ క్షంతవ్యం కాదు. ఇందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించవలసి ఉంటుంది. చైనా, హాంకాంగ్‌లనుంచి వచ్చిన ప్రయాణీకులను మాత్రమే జనవరి 17నుండి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు. మిగతా అన్ని దేశాల వారికీ దీనిని అమలు చేసి ఐసోలేషన్‌ లేదా క్వారంటైన్‌కు పంపడం మార్చి 3నుంచే ఆరంభమైంది. ఈ మధ్యకాలంలో వేలాదిమంది మన దేశానికి వచ్చారు. వీరిలో కొందరి ద్వారా కరోనా నెమ్మదిగా దేశంలో వ్యాపించింది.


కరోనాపై పోరాటానికి అవసరమైన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్; వెంటిలేటర్లు; అదనపు ప్రయోగ శాలలు; వైద్య, మున్సిపల్, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బంది రక్షణ కోసం వినియోగించే వస్తువులకు రాష్ట్ర ప్రకృతి విపత్తు ఉపశమన నిధిలో 10 శాతం మించకుండా ఖర్చు చేయాలని నిబంధన విధించడం సరికాదు. కేవలం నమూనాల సేకరణ, తనిఖీలు, స్క్రీనింగుల కొరకు మాత్రమే జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను వెచ్చించవచ్చని కేంద్రం తెలియపర్చింది. ఇదీ సరికాదు. డీఆర్‌డీవోతో మరికొన్ని సంస్థలు తక్కువ వ్యయంతో టెస్టింగ్ కిట్లు, లేబరేటరీలు, వెంటిలేటర్లు, పీపీఈలను తయారు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చెయ్యటం ఎంతైనా అభినందనీయం. ‘ప్రధాన మంత్రి విపత్కర నిధి’కి సామాజిక సేవాభావంతో పారిశ్రామిక, వ్యాపార వర్గాలు, స్వచ్ఛంద సంస్థలతో పాటు అనేక సంస్థలు భారీగా అందజేస్తున్న నిధులను ఉపయోగించి పెద్దఎత్తున పైన పేర్కొన్న పరికరాలను వెంటనే రాష్ట్రాలకు అందజేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. ‘లాక్‌డౌన్’ సందర్భంగా క్షేత్ర స్థాయి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సూచనలను అనుసరించి వ్యవసాయ పనుల కొనసాగింపు, పంట ఉత్పత్తుల అమ్మకాలు, వ్యవసాయ యంత్ర పరికరాల వినియోగానికి మినహాయింపు ఇవ్వటం అభినందనీయం. అయితే, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ–మార్కెటింగ్ శాఖల మధ్యన సరైన సమన్వయం లోపించడం వల్ల అమ్మకాలు, సక్రమంగా ముందుకు సాగడం లేదు. కర్నూలు మార్కెటింగ్ యార్డు మూసివేస్తే ఉల్లి రైతులు తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలి? రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న నిరుపమాన సేవలకు ప్రజలందరూ రుణపడి ఉన్నారు.

వడ్డే శోభనాద్రీశ్వరరావు

Updated Date - 2020-04-08T05:47:16+05:30 IST