నిద్రపోతున్న నిఘా

ABN , First Publish Date - 2021-08-04T05:23:09+05:30 IST

జిల్లా సరిహద్దుల్లో నిఘా నిద్రపోతోంది. అక్రమ దందా హద్దులు దాటుతోంది. మహారాష్ట్ర సరిహద్దు మండలాల్లో కొందరు అడ్డదారిలో సంపాదన కోసం ఆరాట పడుతున్నారు. జిల్లా సరిహద్దులో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసినా అధికారుల నిఘా వైఫల్యంతో అక్రమ వ్యాపారులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

నిద్రపోతున్న నిఘా

సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద నిఘా కరువు

సరిపడా అధికారులు ఉన్నా.. తనిఖీలు సున్నా 

అన్ని తెలిసినా చర్యలకు జంకుతున్న అధికారులు

జిల్లాలో యఽథేచ్ఛగా అక్రమ వ్యాపారం 

ఆదిలాబాద్‌, ఆగస్టు3 (ఆంధ్రజ్యోతి): జిల్లా సరిహద్దుల్లో నిఘా నిద్రపోతోంది. అక్రమ దందా హద్దులు దాటుతోంది. మహారాష్ట్ర సరిహద్దు మండలాల్లో కొందరు అడ్డదారిలో సంపాదన కోసం ఆరాట పడుతున్నారు. జిల్లా సరిహద్దులో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసినా అధికారుల నిఘా వైఫల్యంతో అక్రమ వ్యాపారులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రధానంగా తలమడుగు, బోథ్‌, తాంసి, బేల, జైనథ్‌, నార్నూర్‌ మండలాల్లో సరిహద్దు గ్రామాల నుంచే అక్రమ దందా సాగుతోంది. కరోనా కట్టడికి జిల్లా వ్యాప్తం గా ఎనిమిది సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఆ తర్వాత అంతా మామూ లుగానే మారిపోయింది. భోరజ్‌ చెక్‌పోస్టు వద్ద ఆర్‌టీఏ అధికారులు తనిఖీలను నిర్వహిస్తున్నా అక్రమ దందాకు అడ్డుకట్ట పడడం లేదు. జిల్లాలో గుట్టల కొద్ది పట్టుబడుతున్నా గుట్కా నిల్వలన్నీ మహారాష్ట్ర నుంచే వ్యాపారులు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని మండలాల సరిహద్దుల్లో ఇప్పటి వరకు చెకు పోస్టులను ఏర్పాటు చేయనే లేదు. ఈ మండలాల సరిహద్దుల్లోనే మహారాష్ట్రలో పర్సోడాపాడి గ్రామం వద్ద చెక్‌ పోస్టు ఉన్నా నామమాత్రంగానే తనిఖీలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావా ల్సిన ఆదాయానికి భారీ గండిపడుతున్నా అధికారులకు పట్టింపు కరువవుతోంది. ఇటీవల జిల్లా కేంద్రంలోని కోజా కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన 15క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇలా గుట్టు చప్పుడు కాకుండా జిల్లాలో అక్రమదందాలు కొనసాగుతున్నాయి.

అడ్డుకట్ట ఏది..?

అడ్డదారుల్లో పత్తి, బియ్యం, పప్పుదినుసులు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అలాగే గంజాయి, దేశీదారు మద్యం, గుట్క తదితర నిషేధిత వస్తువుల రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. తరచూ జిల్లాలో దేశీదారుమద్యం, గుట్కా పట్టుబడుతున్నా అధికారులు అడ్డుకట్ట వేయలేక పోవడం పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కొందరు అధికా రులు ఏకంగా ప్రైవేట్‌ వ్యక్తులను నియమించుకొని మా మూళ్లకు ఎగబడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీ కేంద్రాల వద్ద అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ప్రైవేట్‌ వ్యక్తుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఈ అక్రమ దందాపై అధికారులకు అన్ని తెలిసినా చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా నిఘా కొనసాగిస్తేనే జిల్లాలోకి నిషేధిత వస్తువుల సరఫరా ఎలా జరుగుతుందో అధికారులకే తెలియాలి మరి. ఏదో అడపదడపగా తనిఖీలు చేయడం, పట్టుకోవడం, కేసులు నమోదు చేసి వదిలేయడంతో అక్రమ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

నిఘా వైఫల్యం..

జిల్లాలోని ఏడు మండలాలతో మహారాష్ట్ర సరిహద్దులు ము డిపడి  ఉన్నాయి. బేల మండ లంలో సాంగిడి, కంగార్‌ పూర్‌, మార్గుడ్‌, కొబ్బాయి గ్రామాల నుంచి మహారా ష్ట్ర సరిహద్దులోకి రాకపోక లు కొనసాగుతున్నాయి. కానీ ఈ మండలపరిధిలో ఎక్కడా తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. అలాగే తాంసి మండలంలో కరంజి(టి) గ్రామం నుంచి మహారాష్ట్రకు రాకపోకలు సాగుతున్నా ఇక్కడ చెక్‌ పోస్టును ఏర్పాటు చేయలేదు. బోథ్‌ మండలంలో ఘన్‌పూర్‌ గ్రామం వద్ద ఎక్సైజ్‌, వ్యవసాయ, మార్కెటింగ్‌, వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసినా నామ మాత్రంగానే తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికా రులు స్థానికంగా ఉండకపోవడంతో వారానికి ఒక్కసారి చుట్టపు చూపులాగా వస్తూపోతున్నట్లు సమాచారం. తలమడుగు మండలంలో లక్ష్మీపూర్‌ గ్రామం వద్ద తనిఖీ కేంద్రాలు ఉన్నా ఇక్కడంతా ప్రైవేటు సిబ్బందే విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు అడపాదడపా వెళ్లి వస్తుం డడంతో ఈ మార్గం గుండానే మహారాష్ట్ర నుంచి అక్రమ మద్యం, నిషేధిత మత్తు పదార్థాలు భారీగా దిగుమవు తున్నాయి. జిల్లాలో సరిపడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ అధికారులున్నా తనిఖీలకు మాత్రం వెనకాడడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.

Updated Date - 2021-08-04T05:23:09+05:30 IST