మొద్దునిదుర వీడితేనే మోక్షం

ABN , First Publish Date - 2021-12-24T05:30:00+05:30 IST

శ్రీరంగనాథుడిని ప్రసన్నం చేసుకోవడానికి ధనుర్మాస వ్రతం చేపట్టి, దాని కోసం తోటి గోపబాలికలను గోదాదేవి సమాయత్తం చేస్తోంది. ...

మొద్దునిదుర వీడితేనే మోక్షం

శ్రీరంగనాథుడిని ప్రసన్నం చేసుకోవడానికి ధనుర్మాస వ్రతం చేపట్టి, దాని కోసం తోటి గోపబాలికలను గోదాదేవి సమాయత్తం చేస్తోంది. నిద్ర మేలుకొని స్వామి సేవకు సిద్ధం కావాలని పిలుస్తోంది. శ్రీకృష్ణుడి ఆంతరంగిక స్వరూపాన్ని వివరిస్తూ, వారిలో ఉత్సాహం నింపడానికి ప్రయత్తిస్తోంది. గతవారం ఎనిమిది పాశురాల్లోని విశేషాలు తెలుసుకున్నాం. తొమ్మిదో పాశురంలో... స్థితప్రజ్ఞులకు ఉండవలసిన లక్షణాలను గోదాదేవి వివరించింది. యాతమావస్థ, వ్యతిరేకావస్థ, ఏకకేంద్రీయ అవస్థ, వశీరాకావస్థల గురించి ఆమె చెబుతూ... ఆ అవస్థలను ఎలా పొందాలో వెల్లడించింది. అయిదో గోపిక విశేషాలను పదో పాశురంలో గోదాదేవి వివరిస్తోంది. ఆ గోపిక ఎంతో అందగత్తె. ఆమె కోసం శ్రీకృష్ణుడు కూడా ఎన్నో తంటాలు పడుతూ ఉంటాడు. కానీ ఆమె ఎల్లప్పుడూ ఆయనను కూడా పట్టించుకోనంతగా అలౌకికమైన  స్థితిలో ఉంటుంది.  పరమయోగులకు మాత్రమే సాధ్యమయిన అలాంటి స్థితిని పొందిన ఆ గోపికను నిద్ర లేవాలని గోదాదేవి పిలుస్తోంది. ఇక పదకొండో పాశురంలో ఆరవ గోపిక బాహ్య సౌందర్యంతో పాటు ఆమె అంతః సౌందర్యాన్ని కూడా గోదాదేవి వర్ణిస్తూ, వ్రతానికి స్వాగతం పలికింది. శ్రీమద్రామాయణాన్ని ఉదాహరణగా తీసుకొని, జీవిత రహస్యాలను పన్నెండో పాశురంలో ఆమె వర్ణించింది. సాత్వికమైన నిద్ర నుంచి గోపికను లేవాలని కోరింది. స్వయంగా శ్రీరాముడు లంకకు వెళ్ళి, సీతాదేవిని రావణ చెర నుంచి విముక్తం చేసినట్టు-- గురువు మన చెరను విడిపిస్తాడనీ, కానీ అది అంత సులువైనది కాదనీ అవగాహన కలిగించే తత్వాన్ని ఆమె వివరించింది. ఎంతో అందమైన కళ్ళు ఉన్న ఎనిమిదో గోపికకు పదమూడో పాశురంలో మేలుకొలుపు పాడింది. ఆ అందమైన కళ్ళు బయటి ప్రపంచాన్ని చూస్తాయనీ, కానీ అంతఃప్రపంచాన్ని చూసే కళ్ళు వేరనీ అన్యాపదేశంగా ఈ పాశురం వివరిస్తుంది. పధ్నాలుగో పాశురంలో, ఎంతో చమత్కారంగా మాట్లాడే తొమ్మిదో గోపికను గోదాదేవి నిద్ర లేపుతోంది. అందరికన్నా నేనే ముందు లేస్తానని చెప్పిన ఆ గోపిక ఇంకా నిద్రావస్థను వదలడం లేదు. ఈ చర్య వెనుక మర్మాన్ని గోదాదేవి వివరించింది. కువలయాపీడం అనే మదపుటేనుగును శ్రీకృష్ణుడు ఎలా మట్టుపెట్టాడో పదిహేనో పాశురంలో... పదో గోపికకు చెబుతూ, ఆ స్వామి గొప్పతనాన్ని కొనియాడుతూ వ్రతం చేద్దాం రమ్మని ఆహ్వానిస్తోంది. మొద్దునిదుర వీడి, వ్రతం చేస్తేనే మోక్షానికి చేరువవుతామని గోపికలకు బోధిస్తుంది.

Updated Date - 2021-12-24T05:30:00+05:30 IST