‘నిద్రా’ నేత్రాలు

ABN , First Publish Date - 2022-06-25T05:22:22+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణ కోసం సిద్దిపేట జిల్లాలోని పట్టణాలు, అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, స్థానికులు, పోలీసు యంత్రాంగం సమన్వయంతో కృషి చేసి దాదాపు అన్ని గ్రామాలపై కెమెరాల నిఘా ఉండేలా చూసుకున్నారు. అయితే వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో చాలా చోట్ల కెమెరాలు పని చేయడం లేదు.

‘నిద్రా’ నేత్రాలు
సిద్దిపేట పట్టణంలోని లాల్‌కమాన్‌ ఏరియాలో ఆకాశం వైపు చూస్తున్న సీసీ కెమెరా

సీసీ కెమెరాలపై పర్యవేక్షణ కరువు

నిర్వహణ లోపంతో బేలచూపులు

నిఘా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం

ఫలితంగా కేసుల ఛేదన జాప్యం

మరమ్మతులు చేయిస్తేనే వినియోగం


సిద్దిపేట జిల్లా కేంద్రంలోని లాల్‌ కమాన్‌ ఏరియా నిత్యం రద్దీగా ఉంటుంది. వాణిజ్య, వ్యాపార లావాదేవీలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఇది. పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి ప్రదేశాలపై పటిష్టమైన నిఘా ఉండాలి. కానీ ఇక్కడ అమర్చిన ఓ సీసీ కెమెరా రోజుల తరబడిగా ఆకాశం వైపు చూస్తున్నది. ఇలా నిఘాపై నిర్లక్ష్యంతో, పర్యవేక్షణ లోపంతో జిల్లాలో ఎన్నో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. కనెక్షన్లు లేక, మరమ్మతులకు నోచకోక వెక్కిరిస్తున్నాయి. 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూన్‌ 24 : శాంతిభద్రతల పరిరక్షణ కోసం సిద్దిపేట జిల్లాలోని పట్టణాలు, అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, స్థానికులు, పోలీసు యంత్రాంగం సమన్వయంతో కృషి చేసి దాదాపు అన్ని గ్రామాలపై కెమెరాల నిఘా ఉండేలా చూసుకున్నారు. అయితే వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో చాలా చోట్ల కెమెరాలు పని చేయడం లేదు. 


మరమ్మతులపై నిర్లక్ష్యం

సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో ఉన్న ఆసక్తిని చాలాచోట్ల వాటి నిర్వహణలో మాత్రం ప్రదర్శించలేకపోయారు. హడావిడిగా అమర్చి, ఆ తర్వాత పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా రిపేరయ్యాయి. వాటిని మళ్లీ మరమ్మతులు చేయించడంలోనూ శ్రద్ధ చూపలేదు. దీంతో నెలల తరబడిగా వెక్కిరిస్తున్నాయి. పట్టణాలు, గ్రామాలకు సంబంధించిన జనరల్‌ ఫండ్‌, ఎస్డీఎఫ్‌ నిధులు, విరాళాలు, దాతల సౌజన్యంతో ఈ కెమెరాలు ఏర్పాటయ్యాయి. నిర్వహణ కోసం కూడా కొన్ని నిధులు సమకూర్చుకుంటే ఈ కెమెరాలు మళ్లీ వినియోగంలోకి వస్తాయి. 


నిఘా వ్యవస్థపై ప్రభావం

ఇటీవల కాలంలో కీలకమైన హత్యలు, దొంగతనాలు, ప్రమాదాలకు సంబంధించిన కేసుల చేధనలో సీసీ కెమెరాలే ప్రధాన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మూడు నెలల క్రితం సిద్దిపేట సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద జరిగిన భారీ దోపిడీని తేటతెల్లం చేయడానికి కూడా ఈ సీసీ కెమెరాలే దోహదం చేశాయి. ఇవే కాకుండా ఎన్నో రకాల మిస్టరీలను క్షణాల్లో చేధించే విధంగా పోలీస్‌ శాఖలో సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇందులో భాగమైన సీసీ కెమెరాలు పలుచోట్ల పనిచేయకపోవడాన్ని కూడా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో కొద్ది రోజుల క్రితం వరుసగా మూడు ఇళ్లలో దొంగతనం జరిగింది. అదేచోట ఉన్న సీసీ కెమెరా పనిచేయకపోవడంతో ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండడమే దీనికి నిదర్శనం అని చెప్పవచ్చు. నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి గ్రామంలో గత 14వ తేదీన రాజిరెడ్డి అనే రైతుకు చెందిన ట్రాక్టర్‌ను అపహరించారు. బంజేరుపల్లి చుట్టుపక్కల ఇబ్రహీంపూర్‌, కోదండరావుపల్లి, నారాయణరావుపేట, మాటిండ్ల గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడతో ఆ ట్రాక్టర్‌ను ఎటువైపు తీసుకెళ్లారో ఆచూకీ లభించలేదు. ఇలా పలు సంఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. సీసీ కెమెరాల పనితీరుపై దృష్టిసారిస్తే పలు కేసుల ఛేదన సులువుగా మారుతుంది.



Updated Date - 2022-06-25T05:22:22+05:30 IST