కంటి నిండా కునుకు లేక..!

ABN , First Publish Date - 2022-03-19T08:29:57+05:30 IST

పడకెక్కిన వెంటనే గుర్రు పెట్టేవాడ్ని మించిన అదృష్టవంతుడు.. ఎంత దొర్లినా నిద్ర పట్టని వాడ్ని మించిన అభాగ్యుడు లేడంటారు. అలాగే, ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖమెరుగదు అంటారు. ఆకలి విషయమేమో గానీ.. ఎన్ని సుఖాలు అందుబాటులో ఉన్నా..

కంటి నిండా కునుకు లేక..!

యువతలో పెరుగుతున్న నిద్ర లేమి సమస్య

పని ఒత్తిడి, గ్యాడ్జెస్‌ అధిక వినియోగమే కారణం

పెరుగుతున్న తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలు

అధికశాతం రోడ్డు ప్రమాదాలకూ నిద్రలేమే కారణం

‘స్లీప్‌ డిజార్డర్స్‌’పై ఏఐజీ వైద్యుల సర్వేలో వెల్లడి

నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ సూచన


హైదరాబాద్‌ సిటీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): పడకెక్కిన వెంటనే గుర్రు పెట్టేవాడ్ని మించిన అదృష్టవంతుడు.. ఎంత దొర్లినా నిద్ర పట్టని వాడ్ని మించిన అభాగ్యుడు లేడంటారు. అలాగే, ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖమెరుగదు అంటారు. ఆకలి విషయమేమో గానీ.. ఎన్ని సుఖాలు అందుబాటులో ఉన్నా.. అసలు నిద్రే ఎరుగని వారు ఇప్పుడు ఎక్కువయ్యారు. నిద్ర లేమి.. సర్వరోగ సర్వావస్థలకూ ఇదే మూలం. సరిపడా సమయం నిద్రపోయే వాళ్ల దరిదాపుల్లోకి కూడా అనారోగ్యం రాదని వైద్యులు చెబుతుంటారు. కాలంతో పరిగెత్తే ప్రస్తుత కాలంలో.. నిద్రకు ప్రాధాన్యం తగ్గిపోయింది. కొందరు పనిఒత్తిడిలో పడి నిద్రకు దూరమవుతుంటే.. ఇంకొందరు రాత్రనక పగలనక గ్యాడ్జెట్స్‌ వినియోగంలో మునిగి తేలుతూ.. నిద్రను పట్టించుకోరు. ఎప్పుడో పడక మీదకు చేరినా.. నిద్ర పట్టదు. అటూ ఇటూ దొర్లుతూనే రాత్రిని ముగించేస్తారు. ఇంకేముంది.. తెల్లవారితే హడావుడి. నిద్రకు సమయం దొరకదాయె.. దొరికిన సమయంలో అది పట్టదాయె..! ఇదే నేటి తరాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఒక్కసారి నిద్ర క్రమం తప్పితే.. శరీరం అదుపు తప్పుతుంది. ఇంద్రియాలు నియంత్రణ కోల్పోతాయి. ఈ స్థితి అత్యంత ప్రమాదకరమని, అధికశాతం రోడ్డు ప్రమాదాలకు ఇదే కారణమని వైద్యులు చెబుతున్నారు.


‘స్లీప్‌ డిజార్డర్స్‌’ అనే అంశంపై ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. వరల్డ్‌ స్లీప్‌ డే సందర్భంగా ఏఐజీ వైద్యులు.. శుక్రవారం ఈ సర్వే వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం.. పడకపైకి చేరినా.. నిద్ర పట్టక దాదాపు 60 శాతం మంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో.. అసహనం ఎక్కువై పడక దిగేస్తున్నారు. అలాగే, 42 శాతం మంది స్లీప్‌ అప్నియా సమస్యతో భాధపడుతున్నారు. వీరికి పడుకుంటే శ్వాస సమస్యలు ఎదురవుతాయి. ఊపిరి అందక తీవ్రంగా ఇబ్బంది పడుతారు. కారణమేదైనా.. ఇలా సరిగా నిద్రపోని వారు పగటి వేళ ఎక్కువగా కునుకుపాట్లు పడుతుంటారు. ఆ సమయంలో వాళ్లు డ్రైవింగ్‌లో ఉంటే.. 37 శాతం రోడ్డు ప్రమాదాలు ఇలాగే జరుగుతున్నాయని ఏఐజీ వైద్యులు స్పష్టం చేశారు. రాత్రి వేళ నిద్రపోని వారు.. పగటి వేళలో తీవ్ర అలసటతో కనిపిస్తారని, నీరసంగా, బద్ధకంతో ఉంటారని సర్వేలో వెల్లడైంది.

 

సర్వే సాగిందిలా..

ఈ సర్వేలో మొత్తం 820 మంది పాల్గొన్నారు. అందులో 355 మంది మహిళలు, 462 మంది పురుషులు, ముగ్గురు ఇతరులు ఉన్నారు. వీరి సగటు వయసు 35. వైద్యులు.. వీరికి 25 ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అధిక శాతం మంది తమకు సరిగ్గా నిద్ర రావడం లేదని తెలిపారు. ఇందువల్ల అలసటగా ఉందని 34 శాతం మంది చెప్పగా.. 34 శాతం మంది అసహనంగా ఉందని చెప్పారు. డ్రైవింగ్‌లో నిద్రొస్తోందని 32 శాతం మంది చెప్పగా.. 27 శాతం మంది తలనొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల ఏదీ ఆలోచించ లేకపోతున్నామని, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నామని 27 శాతం మంది వివరించారు. నిద్రలేమి వల్ల తరచుగా పనిలో తప్పులు దొర్లుతున్నాయని 22 శాతం మంది తెలిపారు. అలాగే, 49 శాతం మంది గురక సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. 12 శాతం మందిలో హైబీపీ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.


నిద్ర లేచిన తర్వాత కూడా ఫ్రెష్‌గా ఉండడం లేదని 42 శాతం మంది, పనిలో త్వరగా అలసిపోతున్నామని 25 శాతం మంది చెప్పారు. అలాగే, 16 శాతం మంది నిద్రలో ఉలికిపాట్లకు గురవుతున్నట్లు తేలింది. కాగా, ఈ అంశంపై పల్మనాలజీ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ విశ్వనాథ్‌ గెల్లా, ఈఎన్‌టీ విభాగం డైరెక్టర్‌ శ్రీనివాస్‌ కిశోర్‌ మాట్లాడుతూ.. నిద్ర లేమి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పారు. గాడ్జెట్స్‌ వినియోగం వల్ల చాలా మంది నిద్రపోవడం లేదని, ప్రతి పది నిమిషాలకు ఒక సారి సెల్‌ఫోన్‌ చూడడం, నోటిఫికేషన్లు చదవడం, రిప్లయి ఇవ్వడం వల్ల కునుకుకు దూరమవుతున్నారని వివరించారు. నిద్రకు ఉపక్రమించిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలలో నిద్ర రావాలని, కానీ చాలా మందికి అలా జరగడం లేదని వివరించారు. తమ సర్వేలో 45 శాతం మందికి స్లీప్‌ అప్నీయా ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనివల్ల తలనొప్పి, రోజంతా అలసట, చికాకు, పనిలో ఏకాగ్రత కొల్పోవడం లాంటి ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తేలిందని చెప్పారు. స్లీప్‌ అప్నియా లక్షణాలు ఉన్న వాళ్లు వెంటనే చికిత్స తీసుకోవాలని, లేదంటే అది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది శరీరానికి త్వరగా వృద్ధాప్యం వచ్చేలా చేస్తుందన్నారు.


మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో.. సరిపడా నిద్ర కూడా అంతే అవసరమని తెలిపారు. నిద్ర లేమి వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. నిద్రలో గాఢ నిద్ర చాలా ముఖ్యమని, ఇది శరీరాన్ని చురుకుగా ఉంచుతుందని వివరించారు. నిద్రలో తరచుగా కదులుతుండడం, లేస్తుండడం జరిగితే.. సరిగ్గా నిద్రపోయినట్లు కాదని చెప్పారు. సరిగా నిద్ర పోకపోవడం వల్ల గుండె, నరాల సంబంధిత సమస్యలు, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఏర్పడతాయని వైద్యులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-19T08:29:57+05:30 IST