స్లాగ్‌నూ వదలట్లేదు

ABN , First Publish Date - 2022-08-20T06:11:40+05:30 IST

సెజ్‌లో అభిజిత్‌ ఫెర్రో ఎల్లాయీస్‌ కర్మాగారంలో ఉత్పత్తి అనంతరం స్లాగ్‌ విడుదల అవుతుంది.

స్లాగ్‌నూ వదలట్లేదు
అభిజిత్‌ కర్మాగారంలో నిల్వ ఉన్న స్లాగ్‌

- అభిజిత్‌ కర్మాగారంలో ‘రాజు’కున్న స్లాగ్‌ వ్యవహారం

- ప్రజాప్రతినిధి రంగ ప్రవేశంతో పెరిగిన ధర

- సాయం చేయమని కోరిన బ్రిక్‌ యజమానులపైనే పెత్తనం

- అనుచరులను నియమించి కమీషన్ల దందా

- బ్రిక్‌ ఇండస్ట్రీ యజమానుల ఆందోళన

- పది రోజులుగా స్లాగ్‌ తరలించకుండా నిరసన


ఆదుకోమని ‘రాజు’గారి వద్దకు వెళితే మరో రెండు తన్నమన్నారన్న చందంగా ఉందని ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాల్‌జీ బ్రిక్‌ ఇంటస్ర్టీ యజమానుల పరిస్థితి. స్లాగ్‌ సరఫరా చేసే కర్మాగార యాజమాన్యం ధర పెంచకుండా చూడాలని ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధిని వేడుకుంటే.. మొత్తం స్లాగ్‌నే స్వాధీనం చేసుకుని చక్రం తిప్పుతున్నారు. తన అనుచరులతో ఇష్టమొచ్చిన ధరకు విక్రయిస్తున్నారు. దీంతో బ్రిక్‌ ఇండస్ట్రీ యజమానులు రోడ్డెక్కారు. 

-------------------------

అచ్యుతాపురం, ఆగస్టు 19: సెజ్‌లో అభిజిత్‌ ఫెర్రో ఎల్లాయీస్‌ కర్మాగారంలో ఉత్పత్తి అనంతరం స్లాగ్‌ విడుదల అవుతుంది. ఈ స్లాగ్‌ను నిల్వ చేయడం కర్మాగార యాజమాన్యానికి తలకు మించిన భారం. అందుకే మొదట్లో ఉచితంగా దీనిని ఇచ్చేవారు. దీనిని ఏ విధంగానైనా ఇతర ప్రాంతాలకు తరలించాలని చూసేవారు. అయితే ఈ స్లాగ్‌ని ఇక్కడ పాల్‌జీ బ్రిక్‌ ఇండస్ర్టీ (సిమెంటు ఇటుక) యజమానులు ప్రయోగాత్మకంగా వినియోగించి విజయం సాధించారు. ఈ విషయం ఉమ్మడి విశాఖ జిల్లా అంతా వ్యాపించింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని సుమారు 235 పాల్‌జీ బ్రిక్‌ ఇండస్ర్టీ యజమానులు ఇక్కడ నుంచి స్లాగ్‌ని వాహనాల ద్వారా రవాణా చేసేవారు. అప్పట్లో ఉచితంగా ఇచ్చిన అభిజిత్‌ కర్మాగార యాజమాన్యం ఆ తరువాత టన్నుకు రూ.30లు తీసుకునేది. రోజుకు సుమారు రెండు వేల టన్నుల వరకు ఉమ్మడి విశాఖ జిల్లా అంతా రవాణా చేసేవారు. క్రమంగా స్లాగ్‌కు డిమాండ్‌ పెరుగుతుం డడంతో కర్మాగార యాజమాన్యం టన్ను రూ.90 చేసింది. 

ధర పెంచకుండా చూడమని అడిగితే..

అభిజిత్‌ యాజమాన్యం ఇంకా ధర పెంచకుండా ఉండాలంటే అధికార పార్టీ ప్రజాప్రతినిధితో చెప్పించాలని పాల్‌జీ బ్రిక్‌ యజమానులు భావించారు. వారంతా విశాఖలో ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి స్లాగ్‌ ధర పెంచకుండా చూడాలని అభ్యర్థించారు. అలాగే అంటూ ఆయన హామీ ఇచ్చి తన తనయుడిని పరిశీలించమని ఆదేశించారు. ఆయన తనయుడు కూలంకషంగా పరిశీలించి రూపాయి పెట్టుబడి లేకుండా రోజుకు భారీగా ఆదాయం వస్తుందని చెప్పాడు. దీంతో ఆ ప్రజాప్రతినిధి.. స్లాగ్‌ వ్యవహారం మొత్తం తన చేతిలోకి తీసుకున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి నలుగురు నాయకులను అభిజిత్‌ కర్మాగారం వద్ద ఏర్పాటు చేసి తాము చెప్పిన ధరకే స్లాగ్‌ విక్రయించేలా చర్యలు చేపట్టారు. 

కమీషన్ల దందా

మొదట్లో ఒక టన్నుకు తమకు రూ.30 కమీషన్‌ ఇవ్వాలని బ్రిక్‌ యజమానులకు ఈ నాయకులు చెప్పడంతో వారు సరేనన్నారు. దీంతో స్లాగ్‌ టన్ను ధర రూ.90 నుంచి రూ.120కి చేరింది. తరువాత దీనిని రూ.190కి పెంచారు. దీంతో బ్రిక్‌ యజమానులు ఆందోళన చేశారు. ఈ విషయం జిల్లా మంత్రి వరకు వెళ్లింది. ఆయన అనుచరులు కూడా రంగంలోకి దిగారు. దీంతో యాజమాన్యం ఎటూ చెప్పలేక తీవ్ర ఇబ్బంది పడింది. అయితే మంత్రి అనుచరులు  ఎందుకో దీనిన వదులుకున్నారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధి మాత్రం వదులుకోలేదు. దీని ధరను ఇటీవల టన్ను రూ.240 చేశారు. అభిజిత్‌ యాజమాన్యానికి రూ.190, లోడింగ్‌కు రూ. 10, కమీషన్‌ రూ.30 అని పేర్కొంటూ టన్ను ధర రూ.240 చేశారు. దీనికి బ్రిక్‌ ఇండస్ర్టీ యజమానులు అంగీకరించారు. అయితే తమ కమీషన్‌ రూ.70 కావాలని, అందువల్ల ప్రస్తుతం టన్ను రూ.270 తక్కువకు విక్రయించేది లేదని ఆ నాయకులు తేల్చి చెప్పారు. బ్రిక్‌ యజమానులు ఆందోళనకు దిగి గత పది రోజులుగా కర్మాగారం నుంచి స్లాగ్‌ను తరలించడం లేదు. దీని వల్ల కర్మాగారంలో సుమారు 15 వేల టన్నుల స్లాగ్‌ నిల్వలు పేరుకుపోయాయి. కర్మాగార యాజమాన్యం ఎటూ చెప్పలేక ఇరుకున పడింది. తాము చెప్పిన ధర ఇవ్వకుంటే స్లాగ్‌ ఇచ్చేది లేదని ప్రజాప్రతినిధి అనుచరులు భీష్మించుకున్నారు. అంతేకాకుండా తాము ఇతరులకు విక్రయిస్తామంటూ ఇతర ప్రాంతాల నుంచి లారీలను అభిజిత్‌ కర్మాగారానికి శుక్రవారం రప్పించారు. దీంతో బ్రిక్‌ యజమానులు కర్మాగారం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. వీరికి బ్రిక్‌ ఇండస్ట్రీ సంఘాలు మద్దతు తెలిపాయి. కాగా సెజ్‌లో సుందరం ఎల్లాయీస్‌, మైథాన్‌ ఎల్లాయీస్‌ కర్మాగారాలున్నాయి. కానీ సుందరం ఎల్లాయీస్‌ నుంచి కేవలం బూడిద వస్తుంది. అది పాల్‌జీ బ్రిక్‌కు పనికి రాదు. మైథాన్‌ నుంచి అతి తక్కువ స్లాగ్‌ వస్తుంది. అందు వల్ల ఈ రెండు కర్మాగారాలకు డిమాండ్‌ లేదు. 

బ్రిక్‌ యజమానులపై కేసు నమోదు

అచ్యుతాపురం రూరల్‌: సెజ్‌లోని అభిజిత్‌ కంపెనీలో గల స్లాగ్‌ తరలింపు విషయమై పాల్‌జీ బ్రిక్‌ యజమానులు, దళారుల మధ్య వివాదం కొనసాగుతోంది. దళారులు పెట్టిన వాహనాన్ని బ్రిక్‌ యజమానులు అడ్డుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు. కాగా టీడీపీ నాయకుడు ప్రగడ నాగేశ్వరరావు, డ్రీమ్స్‌ నాయుడు తదితరులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేశారు. 

Updated Date - 2022-08-20T06:11:40+05:30 IST