Telugu Velugu: ఎస్‌కేపీసీలో ఉత్సాహంగా తెలుగు వెలుగు పోటీలు

ABN , First Publish Date - 2022-09-07T16:12:37+05:30 IST

స్థానిక జార్జిటౌన్‌లోని శ్రీ కన్యకాపరమేశ్వరి మహిళా కళాశాల (ఎస్‌కేపీసీ) ఐక్యూఏసీ, సృజన తెలుగు భాషామండలి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం

Telugu Velugu: ఎస్‌కేపీసీలో ఉత్సాహంగా తెలుగు వెలుగు పోటీలు

ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 6: స్థానిక జార్జిటౌన్‌లోని శ్రీ కన్యకాపరమేశ్వరి మహిళా కళాశాల (ఎస్‌కేపీసీ) ఐక్యూఏసీ, సృజన తెలుగు భాషామండలి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం తెలుగు వెలుగు అంతర్‌ విభాగాల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఉద యం 10.30 గంటలకు వాసవీ అమ్మవారి ప్రత్యేక పూజ, ప్రార్థనా గీతం, జ్యోతి ప్రజ్వలనతో కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.మోహన శ్రీ(Dr. T. Mohana Shri) అధ్యక్షతన ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. తెలుగు ఆచార్యులు డాక్టర్‌ పీఎస్‌ మైథిలి పోటీ వివరాలను తెలియజేయడంతో పాటు అతిథులను సభకు పరిచయం చేశారు. ముఖ్య అతిథులుగా సిటీ యూనియన్‌ బ్యాంకు రిటైర్డ్‌ డీజీఎం డీబీవీఎన్‌ శరత్‌చంద్ర కుమార్‌, విజయశ్రీ దంపతులు, పాత్రికేయురాలు సిరి అయితరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా శరత్‌చంద్ర(Saratchandra) మాట్లాడుతూ.. తల్లిదండ్రులను, గురువులను, దేశాన్ని గౌరవించాలని చెప్పారన్నారు. తెలుగు భాష జీవితానికి మనుగడ అని వ్యాఖ్యానించారు. మాతృభాషను ప్రతి ఒక్కరూ ప్రేమించాలని, దేశ భాషలందు తెలుగు లెస్స, సుందర తెనుంగు అని కీర్తించిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు తెలుగు భాష పై మక్కువ పెంచుకోవాలన్నారు. అపుడే ఇతర భాషలను కూడా అనర్గళంగా మాట్లాడవచ్చన్నారు. తెలుగు భాషలో చదువుకుంటే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోలేమన్న అపోహలు విడనాడాలని, తెలుగు మాధ్యమంలో చదువుకున్న సుప్రీంకోర్టు రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ.రమణ న్యాయశాఖలను ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు పలు వేదికలపై మాతృభాషలోనే ప్రసంగించారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అనంతరం సిరి ఐతరాజు మాట్లాడుతూ, ఎస్‌.కె.పి.డి యాజమాన్యం నిర్వహించే కార్యక్రమాలు, విద్యా సంస్థల తరపున చేపడుతున్న వేడుకల్లో తెలుగుదనం ఉట్టిపడుతుందన్నారు. ముందుగా తెలుగు విద్యార్థినులు స్వాతంత్య్ర సమరయోధులు వేషధారణ, సంప్రదాయ వస్త్రధారణతో నటించి ఆలరించారు. దేశభక్తి గీతాలను ఆలపించారు. తెలుగు వెలుగు పోటీలు విద్యార్థినులు ప్రతిభకు అద్దంపట్టగా విజేతలకు బహుమతులు అందజేశారు.

Updated Date - 2022-09-07T16:12:37+05:30 IST