బీజేపీకి బుద్ధి చెప్పండి: ఓటర్లకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు

ABN , First Publish Date - 2022-02-04T01:21:43+05:30 IST

రైతు ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే రాబోయే ఎన్నికలల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించాయి. భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ తికాయత్ అయితే దేశంలోని కొన్ని..

బీజేపీకి బుద్ధి చెప్పండి: ఓటర్లకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు

న్యూఢిల్లీ: తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిందని స్వరాజ్ ఇండియా అధినేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. 2020లో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఏడాదికి పైగా నిరవధిక నిరసన చేసిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు తలొగ్గి క్షమాపణ చెబుతూ సాగు చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అయితే సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటు మరికొన్ని డిమాండ్లు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం ఇంకా నెరవేర్చలేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.


రైతు ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే రాబోయే ఎన్నికలల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించాయి. భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ తికాయత్ అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తిరిగి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీని ఓడించాలని ప్రచారం చేశారు. కాగా, దేశంలో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగు చట్టాల్ని మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు విమర్శకులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీని ఓడించాలని ఓటర్లకు తాజాగా పిలుపునివ్వడం గమనార్హం.


దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా కొనసాగిన రైతు ఆందోళనలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలది ప్రధాన పాత్ర కాగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ కూడా ముఖ్య భూమిక పోషించింది. హర్యానాలో ఇప్పట్లో ఎన్నికలు లేవు, ఇక పంజాబ్‌పై బీజేపీకి కూడా ఎలాంటి అంచనాలు లేవు. అయితే కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రైతుల ఆందోళన ప్రభావం ఎంత మేరకు ఉంటుందనేది ఎన్నికల ఫలితాల అనంతరం తెలుస్తుంది.


‘‘ప్రభుత్వం ఇచ్చిన అనేక వాగ్దానాలు అలాగే మిగిలి ఉన్నాయి. హామీలు నెరవేర్చాల్సింది పోయి, రైతులను మరింత ప్రమాదంలో నెట్టే చట్టాలను బీజేపీ ప్రభుత్వం చేసింది. కనీస మద్దతు ధరపై కమిటీ వేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు వేయలేదు. అలాగే రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని చెప్పి అది కూడా చేయలేదు. అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా ఉత్తరప్రదేశ్‌ ఓటర్లకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది’’ అని యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు.

Updated Date - 2022-02-04T01:21:43+05:30 IST