యువతకు పెద్దపీట

ABN , First Publish Date - 2020-10-31T08:55:49+05:30 IST

పార్టీ పదవుల్లో యువతరానికి పెద్ద పీట వేస్తాం. అందరి సహకారంతో సంస్థాగతంగా పార్టీని ముందుకు నడిపించి..

యువతకు పెద్దపీట

 పార్టీ బలోపేతమే లక్ష్యం

 కూన రవికుమార్‌

టీడీపీ పార్లమెంట్‌  అధ్యక్షుడిగా నేడు ప్రమాణ స్వీకారం


(ఆమదాలవలస, అక్టోబరు 30): ‘పార్టీ పదవుల్లో యువతరానికి పెద్ద పీట వేస్తాం. అందరి సహకారంతో సంస్థాగతంగా పార్టీని ముందుకు నడిపించి.. మరింత బలోపేతం చేస్తా’నని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ అధ్యక్షుడు కూన రవికుమార్‌ తెలిపారు. శ్రీకాకుళంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన పార్లమెంట్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడారు. అధినేత చంద్రబాబునాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం దిశగా చేపట్టనున్న భవిష్యత్‌ ప్రణాళికలను వివరించారు. అవి ఆయన మాటల్లోనే.. ‘సిక్కోలు.. టీడీపీకి కంచుకోట. ప్రతిపక్షంలో ఉన్నా..


జిల్లాలో ఇప్పటికీ పార్టీ పటిష్టంగానే ఉంది. అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలను పాటిస్తూ.. జిల్లాలో పార్టీ పూర్వవైభవానికి కృషి చేస్తా. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తా. అన్ని కమిటీల్లో యువతకు 50 శాతం పదవులు కేటాయిస్తాం. 20 ఏళ్లకు సరిపడా నాయకత్వాన్ని తయారు చేస్తాం. జిల్లాలో అధికంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పిస్తాం. జిల్లాకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడితో పాటు నలుగురు పొలిట్‌బ్యూరో సభ్యులు ఉన్నారు. దీంతో పార్టీకి మరింత బలం చేకూరుతోంది. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. ఈతకాయ ఇచ్చి.. తాటికాయ తీసుకున్న చందంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోంది.


నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయినా వీటిపై సమీక్షించే పరిస్థితి లేదు.  ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేర్చడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి.. ప్రజల మధ్యకు తీసుకెళ్తాం. జిల్లా అంతటా పర్యటిస్తా. పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని.. ముందుకెళ్తా. టీడీపీకి దూరమైన సామాజికవర్గాలను, నాయకులను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తా. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా సమష్టిగా శ్రమిస్తా’మని కూన రవికుమార్‌ తెలిపారు.  

Updated Date - 2020-10-31T08:55:49+05:30 IST