అరకొరే అరకొరే

ABN , First Publish Date - 2020-10-02T09:18:06+05:30 IST

ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభతరం చేసేందుకు.. ఏర్పాటు చేసిన సచివాలయాల్లో అరకొర సేవలే అందుతున్నాయి. సచివాలయ పాలనకు శ్రీకారం చుట్టి.. నేటికి ఏడాది పూర్తవుతున్నా.. వీటి పనితీరు ఇంకా మెరుగుపడలేదు.

అరకొరే అరకొరే

 సచివాలయాల్లో సక్రమంగా అందని సేవలు

 ‘మీ-సేవ’కు వెళ్లాలని సూచిస్తున్న సిబ్బంది


(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి):

ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభతరం చేసేందుకు.. ఏర్పాటు చేసిన సచివాలయాల్లో అరకొర సేవలే అందుతున్నాయి. సచివాలయ పాలనకు శ్రీకారం చుట్టి.. నేటికి ఏడాది పూర్తవుతున్నా.. వీటి పనితీరు ఇంకా మెరుగుపడలేదు. జిల్లాలో 95 వార్డు, 835 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ప్రభుత్వం చెప్పిన ప్రకారం మొత్తం సచివాలయాల్లో 574 సేవలు లభ్యమవుతున్నాయి. అన్నీ అందుబాటులోకి వచ్చినా.. కొన్నిసేవలపై సిబ్బందికి ఇంకా శిక్షణ ఇవ్వలేదు.


దీంతో కొన్ని సేవలు మాత్రమే ప్రజలు పొందుతున్నారు. ఇందులో కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలకు మాత్రమే ప్రజలు ఎక్కువగా సచివాలయాలకు వెళ్తున్నారు. వీటితో పాటు ఇటీవల కొత్త బియ్యం కార్డులు, వాటిలో మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో ధ్రువపత్రాలను అందించాల్సి ఉన్నా.. చాలా సచివాలయాల్లో జాప్యమవుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. రెండు దరఖాస్తులు చేసుకోవల్సి వస్తోంది.


సచివాలయాల్లో వీటి కోసం అభ్యర్థులు ఆధార్‌, పాత కుల ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు జిరాక్స్‌, విద్యార్హత సర్టిపికెట్ల జిరాక్స్‌లు సమర్పించి.. రూ.45 చెల్లిస్తున్నారు. అక్కడ రశీదు ఇస్తున్నారు. ఈ రశీదుతోపాటు ఆదార్‌, పాత కుల ధ్రువీకరణ, రేషన్‌కార్డు తదితరవి మరో జిరాక్స్‌ సెట్‌ రెవెన్యూ కార్యాలయాల్లో అందజేస్తున్నారు. వాటిని భౌతికంగా పరిశీలించిన తర్వాతే.. ఆన్‌లైన్‌లో సచివాలయం నుంచి వచ్చిన దరఖాస్తులను డిజిటల్‌ సైన్‌తో ఆమోదిస్తున్నారు. సచివాలయంలో దరఖాస్తు చేసుకుని... తర్వాత నకలు కాపీలు రెవెన్యూ కార్యాలయంలో అందజేయకుంటే సకాలంలో ధ్రువపత్రాలు మంజూరు కావడం లేదు. జిల్లా కేంద్రంతోపాటు.. అంతటా ఇదే పరిస్థితి నెలకొనడంతో దరఖాస్తుదారులు అవస్థలు పడుతున్నారు.

  

అక్కడికి ఎందుకు వెళ్లారు?

సచివాలయాల్లో దరఖాస్తు చేసి రెండు వారాలు అవుతోందని, ఇంకా ధ్రువపత్రాలు జారీ కాలేదని కొందరు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి చెప్పగా.. సిబ్బంది నుంచి సరికొత్త సమాధానం వినిపిస్తోంది. ‘అసలు సచివాలయాలకు ఎందుకు వెళ్లారు? అక్కడి నుంచి ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులకు మూడు లాగిన్‌లు అవుతుంటాయి. అదే మీసేవలో దరఖాస్తు చేసుకుంటే డైరెక్ట్‌ లాగిన్‌ అవుతుంది. సత్వరమే ధ్రువపత్రాలు వచ్చే అవకాశం ఉంది’ అని రెవెన్యూ సిబ్బందే పరోక్షంగా మీసేవలను ప్రస్తావిస్తూ..  ప్రజలకు ఇలాంటి సమాచారం చెబుతున్నారు. దీంతో కొంతమంది మీ సేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. 

Updated Date - 2020-10-02T09:18:06+05:30 IST