టీడీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం!

ABN , First Publish Date - 2020-10-02T09:15:10+05:30 IST

జిల్లా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తోంది.. ఇందులో భాగంగా

టీడీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం!

 పార్లమెంటరీ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా తమ్మినేని సుజాత

 జిల్లాలో టీడీపీ పూర్వ వైభవానికి అధిష్ఠానం యత్నం

 క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠానికి చర్యలు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి):

జిల్లా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తోంది.. ఇందులో భాగంగా పార్టీకి కొత్త రక్తం ఎక్కించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ విప్‌ కూన రవికుమార్‌ను నియమించింది. తాజాగా పార్లమెంటరీ పార్టీ జిల్లా మహిళా అధ్యక్ష, కార్యదర్శులుగా యువ మహిళా నేతలకు అవకాశం కల్పించింది.


జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా తమ్మినేని సుజాత, ప్రధాన కార్యదర్శిగా ఇచ్ఛాపురానికి చెందిన ఆశి లీలారాణిలను నియమిస్తూ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. దీంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జిల్లాలో ఎంపీ స్థానంతో పాటు రెండు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. మిగిలిన అన్ని చోట్ల పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అధినేత చంద్రబాబు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు.


క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేస్తూ... పునర్‌ వైభవానికి యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో జూమ్‌ యాప్‌ ద్వారా చంద్రబాబు సమీక్షించారు. పార్టీకి నూతన జవసత్వాలు తీసుకొచ్చేందుకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో వైసీపీకి దీటైన నాయకత్వాన్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో రాజకీయంగా ఛైతన్యం కలిగిన ఒక సామాజిక వర్గానికి చెందిన నేత కిల్లి కృపారాణి వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు.


ఇటీవల టీడీపీ అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ విప్‌ కూన రవికుమార్‌ను పార్లమెంట్‌ అధ్యక్షునిగా నియమించింది. తాజాగా మహిళా విభాగం అధ్యక్షురాలిగా తమ్మినేని సుజాతను మూడోసారి రంగంలోకి దింపింది. సామాజిక వర్గ సమీకరణలు, సమతుల్యం పాటిస్తూ కొత్త నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొత్తగా మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎంపికైన తమ్మినేని సుజాత... ఆమదాలవలస నుంచి రెండుసార్లు ఎంపీపీగా, ఒకసారి జడ్పీటీసీ అభ్యర్థిగా గెలుపొందిన దివంగత నేత తమ్మినేని శ్యామలరావు కుమార్తెగా అందరికీ సుపరిచితురాలు.


ఇటీవల వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమదాలవలస ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె సేవలు పార్టీకి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మూడోసారి మహిళా విభాగం పగ్గాలు అప్పగించినట్లు చెబుతున్నారు. ఇఛ్చాపురానికి చెందిన ఆశి లీలారాణిని పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆమె ఇచ్ఛాపురం ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్‌ మహిళా నాయకురాలు.


పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా గతంలో పార్టీకి సేవలందించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ...టీడీపీకి పూర్వ వైభవం తెస్తారనే ఉద్దేశంతోనే కొత్త నాయకులకు పగ్గాలు అప్పగించినట్లు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2020-10-02T09:15:10+05:30 IST