వావిలవలసలో ‘మిథునం’

ABN , First Publish Date - 2020-09-26T10:49:35+05:30 IST

రేగిడి మండలం వావిలవలస గ్రామస్థులతో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వృద్ధాప్య దశలో ఒంటరిగా మిగిలిన భార్యాభర్తల అనుబంధాన్ని తెలిపే ‘మిథునం’ సినిమాను ఇక్కడే చిత్రీకరించారు.

వావిలవలసలో ‘మిథునం’

నెలరోజులపాటు చిత్రీకరణ

రేగిడి : రేగిడి మండలం వావిలవలస గ్రామస్థులతో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వృద్ధాప్య దశలో ఒంటరిగా మిగిలిన భార్యాభర్తల అనుబంధాన్ని తెలిపే ‘మిథునం’ సినిమాను ఇక్కడే చిత్రీకరించారు. బాలు హీరోగా, లక్ష్మీ హీరోయిన్‌గా.. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి దర్శకత్వం వహించారు.


వావిలవలస గ్రామానికి చెందిన ఏఎంఆర్‌ అధినేత మొయిద ఆనందరావు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. రెండు షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని ఇక్కడ సుమారు నెల రోజులపాటు చిత్రీకరించారు. 2011 డిసెంబరు 24 నుంచి జనవరి 6 వరకు మొదటి షెడ్యూల్‌, మళ్లీ జనవరి 15 నుంచి నెలాఖరు వరకూ మరో షెడ్యూల్‌లో షూటింగ్‌ పూర్తి చేశారు.


ఈ సమయంలో బాలుతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులంతా గ్రామస్థులతో మమేకమయ్యారు. ఎటువంటి భేషజం లేకుండా బాలు అందరితోనూ సరదాగా మాట్లాడేవారని విశ్రాంతి తహసీల్దార్‌ పి.రామినాయుడు తెలిపారు. బాలు అకాల మృతితో గ్రామస్థులంతా విషాదంలో మునిగిపోయారు. 


 చాలా బాధాకరం

బాలు గర్వం లేని మనిషి. అందరితోనూ సరాదాగా కలిసిపోయేవారు. ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం. స్నేహానికి ఎక్కువగా విలువ వచ్చేవారు. మిథునం సినిమాకు జాతీయ అవార్డు దక్కడంలో బాలు కృషి మరువలేనిది. ‘మిథునం-2’ సినిమా ప్రారంభించాలనుకున్నాం. ఇంతలో ఆయన అకాల మరణం చెందడం బాధాకరం.

                      - మొయిద ఆనందరావు, మిథునం చిత్ర                                                                                    నిర్మాత.


Updated Date - 2020-09-26T10:49:35+05:30 IST