కొవిడ్‌ కాలంలో చర్మ సంరక్షణ

ABN , First Publish Date - 2021-08-17T17:55:44+05:30 IST

కొవిడ్‌ కాలం ఇంకా కొనసాగుతోంది. పూర్వంలా తరచూ బయటకు వెళ్లడం మానేశాం! వర్క్‌ ఫ్రం హోంతో ఎక్కువ సమయం ఇళ్లకే పరిమితమైపోతున్నాం! మాస్క్‌ ధరిస్తున్నాం, తరచూ చేతులను శానిటైజ్‌ చేసుకుంటున్నాం!వీటన్నిటి ప్రభావంతో చర్మం ఎలాంటి

కొవిడ్‌ కాలంలో చర్మ సంరక్షణ

ఆంధ్రజ్యోతి(17-08-2021)

కొవిడ్‌ కాలం ఇంకా కొనసాగుతోంది. పూర్వంలా తరచూ బయటకు వెళ్లడం మానేశాం! వర్క్‌ ఫ్రం హోంతో ఎక్కువ సమయం ఇళ్లకే పరిమితమైపోతున్నాం! మాస్క్‌ ధరిస్తున్నాం, తరచూ చేతులను శానిటైజ్‌ చేసుకుంటున్నాం!వీటన్నిటి ప్రభావంతో చర్మం ఎలాంటి ఒడిదొడుకులకు లోనవుతుందో... ఎలాంటి చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందో...వాటిని ఎప్పటికప్పుడు ఎలా సరిదిద్దుకోవాలో.... చర్మ వైద్యులు వివరిస్తున్నారు!


ఇంటి నుంచి పని చేసేవారిలో శారీరక శ్రమ లోపించడం వల్ల బరువు పెరుగుతూ ఉంటారు. దాంతో మొటిమలు, పైపెదవి, చుబుకం దగ్గర వెంట్రుకలు పెరగడం, మెడ చుట్టూ, బాహుమూలాల్లో నల్లగా మారడం, చర్మం సాగి స్ట్రెచ్‌ మార్క్స్‌ ఏర్పడడం లాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్యలు తగ్గాలంటే..


ఇంట్లో ఉన్నా తప్పనిసరిగా శారీరక వ్యాయామం చేయాలి. ఇందుకోసం నడక, సైక్లింగ్‌ లాంటి వ్యాయామాలను ఎంచుకోవచ్చు.

పాటలు వింటూ గార్డెన్‌లో నెమ్మదిగా నడవడం వ్యాయామం ఫలితాన్ని ఇవ్వదు. ఎలాంటి వ్యాయామమైన చమటలు కారేంత తీవ్రంగా ఉన్నప్పుడే ఫలితం దక్కుతుంది. 

ఇంటి పట్టున ఉన్నవాళ్లు అవసరానికి మించి ఆహారం తీసుకోవడం, నైట్‌ షిఫ్ట్‌లో ఉన్నవాళ్లు తరచూ స్నాక్స్‌ తింటూ ఉండడం లాంటి అలవాట్ల వల్ల బరువు పెరిగే వీలుంటుంది. ఈ అలవాట్లు మానుకోవాలి.

ఎక్కువగా సలాడ్లు తినడం ద్వారా అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరకుండా చూసుకోవచ్చు.


మూల కారణాలు వెతకాలి

మొటిమలు పెరుగుతున్నా, మొటిమల తాలూకు మచ్చలు ఏర్పడుతున్నా, నెలసరిలో హెచ్చుతగ్గులు జరుగుతున్నా, రాత్రి నిద్ర తగ్గుతున్నా సమస్యను తీవ్రంగా పరిగణించి వైద్యులను కలవాలి. చర్మం మీద మచ్చలతో కూడిన పిగ్మెంటేషన్‌, మెడ చుట్టూ నలుపు లాంటివి బరువు తగ్గడం ద్వారా అదుపులోకి వచ్చినా,  మధుమేహం, థైరాయిడిజం లాంటి కొన్ని అంతర్గత సమస్యల కారణంగా చర్మ సమస్యలు మొండిగా మారతాయి. హైపో థైరాయిడ్‌ వల్ల చర్మం పొడిబారి, జీవం కోల్పోతుంది. మధుమేహంతో చర్మం మీద ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, సెగ గడ్డలు లాంటివి వేధిస్తాయి. కాబట్టి ఈ రెండు హార్మోన్‌ సమస్యలు ఉన్నవాళ్లు క్రమం తప్పక పరీక్షలు చేయించుకుంటూ, అవసరమైన మందులు వాడుకుంటూ ఉండాలి. అవసరాన్ని బట్టి వైద్యులను కలుస్తూ ఉండాలి. 


శానిటైజర్‌ సమస్యలు

తరచూ శానిటైజర్‌ వాడే కొందర్లో అలర్జీలు తలెత్తుతూ ఉంటాయి. చర్మం పొడిబారుతూ ఉంటుంది. ఆల్కహాల్‌తో తయారయ్యే శానిటైజర్‌ వల్ల చర్మపు అలర్జీలు తలెత్తేవారు శానిటైజర్లకు బదులుగా చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బు వాడుకోవాలి. శుభ్రం చేసుకున్న ప్రతిసారీ మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకుంటూ ఉండాలి. అలాగే వేర్వేరు శానిటైజర్లకు బదులుగా ఒకే రకమైన శానిటైజర్‌నే వాడుకోవాలి. 


ఒత్తిడితో చర్మ సమస్యలు

కొవిడ్‌ పాండమిక్‌తో కూడిన ఒత్తిళ్లు పెరగడం మూలంగా హెర్పిస్‌ జోస్టర్‌ మొదలైన చర్మ వ్యాధులు తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. కొవిడ్‌ వచ్చి తగ్గిన వాళ్లలో కూడా ఈ సమస్యలు తిరగబెడుతూ ఉంటాయి. హెర్పిస్‌ జోస్టర్‌ చర్మ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా చర్మ వైద్యులను కలవాలి. 


కొవిడ్‌ - హెయిర్‌ లాస్‌

కొవిడ్‌ వచ్చి తగ్గిన మూడు నుంచి ఆరు నెలల తర్వాత వెంట్రుకలు రాలే సమస్య తలెత్తవచ్చు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి తగ్గిన ప్రతి సందర్భంలోనూ ఎంతో కొంత హెయిర్‌ లాస్‌ ఉండడం సర్వసాధారణం. మలేరియా, డెంగ్యూ లాంటి ఇన్‌ఫెక్షన్లు తగ్గిన తర్వాత కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అయితే పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఒకవేళ ఆహారంతో ఈ సమస్య పరిష్కారం కానప్పుడు వైద్యుల సూచన మేరకు, వెంట్రుకల కుదుళ్లను బలపరిచే హెయిర్‌ సీరం వాడవలసి ఉంటుంది. 


విటమిన్‌ డి లోపం

విటమిన్‌ డి శరీరంలోని ప్రతి అవయవానికీ అత్యంత అవసరం. వెంట్రుకలు, చర్మం, కండరాలు, ఎముకలు... అన్నీ సమర్థంగా, ఆరోగ్యంగా పని చేయాలంటే విటమిన్‌ డి సరిపడా అందాలి. అయితే మనందర్లో ఎంతోకొంత విటమిన్‌ డి లోపం ఉంటోంది. వర్క్‌ ఫ్రం హోమ్‌ కారణంగా ఇళ్లకే నెలల తరబడి పరిమితమైపోవడం మూలంగా ఎక్కువ మందిలో విటమిన్‌ డి లోపం చోటుచేసుకుంటోంది. అయితే ఈ విటమిన్‌ లోపాన్ని భర్తీ చేయడం కోసం ఏడాదికోసారి డి విటమిన్‌ సప్లిమెంట్‌ కోర్సు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు. వారానికి ఒక టాబ్లెట్‌ చొప్పున పది వారాల పాటు సప్లిమెంట్‌ వాడుకుంటే సరిపోతుంది. అలాగే... 


మాంసాహారంలో విటమిన్‌ డి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చేపలు, గుడ్లు, మాంసం... తరచుగా తీసుకుంటూ ఉండాలి.

శాకాహారులు తరచుగా మష్రూమ్స్‌ తీసుకుంటూ ఉండాలి.

3విటమిన్‌ డి కలిసిన పదార్థాలు (కార్న్‌ఫ్లేక్స్‌, వంటనూనెలు) ఎంచుకోవాలి.


మాస్క్‌ సమస్యలు

మొటిమలు ఉన్నవాళ్లు నిరంతరంగా మాస్క్‌ ధరించడం వల్ల మొటిమలు మరింత పెరుగుతూ ఉంటాయి. ఇందుకు కారణం మాస్క్‌ను శుభ్రం చేయకుండా దాన్నే పదే పదే వాడడం, ముఖాన్ని తరచుగా శుభ్రం చేసుకోకపోవడమే! అలాగే మాస్క్‌ను శుభ్రం చేసుకునే విధానం, ధరించే విధానం కూడా ముఖ్యమే!

మాస్క్‌ను కొందరు డెట్టాల్‌, డిటర్జెంట్‌లో నానబెట్టి ఉతికి శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ మాస్క్‌ను సబ్బునీటితో ఉతికి, ఎండలో ఆరబెట్టి వాడుకుంటే సరిపోతుంది. 

ఒకటే మాస్క్‌ను ఎక్కువ రోజులు వాడుతూ ఉండడం కంటే రోజుకొకటి చొప్పున డిస్పోజబుల్‌ మాస్క్‌లను వాడుకోవడం అన్నివిధాలా క్షేమం. ఒకే మాస్క్‌ను శుభ్రం చేయకుండా పదే పదే వాడడం వలన, చర్మపు నూనెలు ఇంకిపోయి, మొటిమలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.

ఎన్‌ 95 మాస్క్‌ను వాడేవారు ఒకసారి మాస్క్‌ను వాడిన తర్వాత నాలుగు రోజుల పాటు దాన్ని వాడకుండా కవర్‌లో దాచి ఉంచి, ఆ తర్వాతే వాడుకోవాలి. ఇలా ఒక ఎన్‌ 95 మాస్క్‌ను నాలుగు సార్లు వాడుకోవచ్చు. అంతే తప్ప ఈ రకం మాస్క్‌ను ప్రతి రోజూ వరుసగా నాలుగు రోజుల పాటు, నాలుగు సార్లు వాడుకోవడం సరి కాదు. 

క్లాత్‌ మాస్క్‌ను తప్పనిసరిగా ప్రతి రోజూ శుభ్రం చేసుకోవాలి. అంతే తప్ప దాని మీద శానిటైజర్‌ స్ర్పే చేసి వాడుకోకూడదు. 

మొటిమల సమస్య ఉన్నవాళ్లు శాలిసిలిక్‌ యాసిడ్‌ సీరంను ముఖానికి అప్లై చేసిన తర్వాతే మాస్క్‌ ధరించాలి. ఇలా చేస్తే మొటిమలు పెరగకుండా ఉంటాయి.


ఆహారంతో చర్మ సౌందర్యం

చర్మ ఆరోగ్యం కోసం విటమిన్లు, మినరల్స్‌ సరిపడా అందే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం...

వీలైనంత ఎక్కువగా పచ్చి కూరగాయలు తీసుకుంటూ ఉండాలి. 

ప్రొటీన్‌, ఐరన్‌, క్యాల్షియం, ఫాస్ఫరస్‌ పుష్కలంగా ఉండే మొలకలు ఆహారంలో చేర్చుకోవాలి. 

ఒమేగా3 ఫ్యాటీయాసిడ్లు ఉండే పదార్థాలు తీసుకోవడం ఎంతో అవసరం. 

చేపలు, బాదం, వాల్‌నట్స్‌, ఫ్లాక్స్‌ సీడ్స్‌, సబ్జా, వేరుసెనగ పప్పులు ఎక్కువగా తీసుకోవాలి.

రెండు రకాల పళ్లు, రెండు రకాల కూరగాయలు ప్రతి రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. 

నిమ్మరసంలో విటమిన్‌ సి ఎక్కువ కాబట్టి, చర్మ ఆరోగ్యం కోసం ప్రతిరోజూ నిమ్మరసం తాగాలి. 

విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌ మొదలైన యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉండే క్యారట్‌, బీట్‌రూట్‌, టమాటా జ్యూస్‌లను ప్రతి రోజూ మార్చి మార్చి తీసుకోవడం అవసరం. 

సరిపడా నిద్ర, చమట పట్టేలా వ్యాయామం... కూడా చర్మపు ఆరోగ్యానికి అవసరం!


డాక్టర్‌ స్వప్న ప్రియ,

డెర్మాటాలజిస్ట్‌,

కేర్‌ హాస్పిటల్స్‌, 

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2021-08-17T17:55:44+05:30 IST